Categories: TOP STORIES

కోకాపేట్ వేలానికే ‘సీఎన్ఎన్ వెంచర్స్’ గురి?

  • నగరంలో రెచ్చిపోతున్న యూడీఎస్ అక్రమార్కులు
  • కళ్లప్పగించి చోద్యం చూస్తున్న ’రెరా‘ యంత్రాంగం
  • ఏకంగా కోకాపేట్ భూముల్ని టార్గెట్ చేసిన సీఎన్ఎన్
  • బయ్యర్ల డబ్బులతోనే వేలంలో పాల్గొనే ఎత్తుగడ
  • పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సీరియస్

యూడీఎస్ అక్రమార్కులు విచ్చలవిడిగా చెలరేగిపోతుంటే.. తెలంగాణ రెరా యంత్రాంగం నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తోంది. గత కొంతకాలం నుంచి పలు రియల్ సంస్థలు యూడీఎస్ పేరిట అమాయ‌కుల్ని బుట్ట‌లో వేసుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో సీఎన్ఎన్ వెంచర్స్ అనే సంస్థ ఏకంగా కోకాపేట్ భూములకే గురి పెట్టింది. హెచ్ఎండీఏ నిర్వహించ తలపెట్టిన ఈ భూముల వేలం పాటలో పాల్గొనేందుకు కొనుగోలుదారుల్ని యూడీఎస్ విధానంలో బహిరంగంగా ఆహ్వానించింది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వాన్ని, హెచ్ఎండీఏను ప్రశంసిస్తూనే యూడీఎస్ విధానంలో బయ్యర్లను ఆకట్టుకునే ప్రయత్నం మొదలెట్టింది.

హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న ఈ-వేలంలో ఏడున్నర ఎకరాల స్థలాన్ని ఈ సంస్థ కొనుగోలు చేసినట్లుగా భ్రమింపచేసింది. ఈ ప్రకటనను చూసి ఏకంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ షాక్ అయ్యారు. వేలం పాట నిర్వ‌హించ‌క‌ ముందే ఇలాంటి మోస‌పూరిత ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డంపై ఆయ‌న సీరియ‌స్ అయ్యారు. ఇలాంటి సంస్థ‌లు విడుద‌ల చేసే ప్ర‌క‌ట‌నల వ‌ల‌లో ఎవ‌రూ ప‌డ‌కూడ‌ద‌ని సూచించారు. అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కోరారు. సీఎన్ఎన్ వెంచ‌ర్స్ పై త‌గిన చ‌ర్య‌ల్ని తీసుకుంటున్నామ‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.

సీఎన్ఎన్ వెంచర్స్ ప్రకటనను క్షుణ్నంగా గమనిస్తే.. మార్కెట్ రేటు కంటే యాభై శాతం రేటుకే వివాదాల్లేని భూమిని పొంద‌వ‌చ్చ‌ని పేర్కొంది. ఇంతటి మహాదవకాశాన్ని బయ్యర్లు వినియోగించాలని కోరింది. వేలం పాటలో స్థలం కొంటే.. చదరపు అడుక్కీ రూ.4000 నుంచి రూ.4,300కే ఫ్లాట్ దక్కుతుందని పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ.7 నుంచి 8 వేలకు చదరపు అడుక్కీ లభిస్తోందని తెలియజేసింది. నిర్మాణం పూర్తయ్యేసరికి చదరపు అడుక్కీ 9 నుంచి 10 వేలకు చేరుకుంటుందని వెల్లడించింది. అంటే, 1500 చదరపు అడుగుల ఫ్లాట్ విలువ ఎంతలేదన్నా 1.3 కోట్లకు చేరుకుంటుందని సీఎన్ఎన్ వెంచర్స్ అంచనా వేసింది. అసలు తెలంగాణలో రెరా అనుమతి లేకుండా ఫ్లాట్లను విక్రయించవద్దనే ప్రాథమిక సూత్రాన్ని ఈ సంస్థ విస్మరించింది. పైగా, వేలంలో స్థలం రాకపోతే సొమ్ము వాపసు ఇస్తామని ప్రకటించింది. ఈ ప్రకటనను చూసిన అరవింద్ కుమార్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఇలాంటి మోసపూరిత ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేశారు. అయితే ఇంతవరకూ ఇందులో ఎంతమంది పెట్టుబడి పెట్టారో తెలియదు. పైగా, ఇదే సంస్థ ఏడాది నుంచి సికింద్రాబాద్లో ఒక షాపింగ్ మాల్ కడతామంటూ యూడీఎస్ విధానంలో కొనుగోలుదారుల నుంచి సొమ్ము వసూలు చేసింది. మరి, ఆ ప్రాజెక్టులో ఎంతమంది సొమ్ము పెట్టారు? ఆ నిర్మాణం ఏమైందో ఇంతవరకూ అధికారికంగా తెలియదు. కనీసం ఆ నిర్మాణం పనుల పురోగతి తెలియదు. కాబట్టి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సూచించినట్లుగా.. ఇలాంటి మోసపూరిత సంస్థల పట్ల కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.

This website uses cookies.