- హైదరాబాద్ లో పతాక స్థాయికి వాయు కాలుష్యం
- కొన్ని ప్రాంతాల్లో ఏడు రెట్లు అధికంగా ధూళికణాలు
- ఇలాగే కొనసాగితే ఆరోగ్య సమస్యలు తప్పవు
భాగ్యనగరం.. పేరుకే విశ్వనగరం. కానీ సమస్యలెన్నో. ట్రాఫిక్ దగ్గర నుంచి కాలుష్యం వరకు ఎన్నో ఇబ్బందులు. వీటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో అవి ఏళ్లకేళ్లు అలాగే కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిందని వెల్లడైంది. ముఖ్యంగా పంజాగుట్ట, జూపార్క్, సనత్ నగర్ వంటి ప్రాంతాల్లో ఇది ప్రమాద ఘంటికలు మోగిస్తోందని తేలింది. మియాపూర్, జేఎన్టీయూ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఏరియాల్లో సైతం కాలుష్యం గుబులు రేపుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం-10 ధూళికణాలు 15 మైక్రోగ్రాముల వరకు మాత్రమే ఉండాలి. కానీ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇది ఏకంగా 105 గ్రాముల వరకు ఉంటోంది. అంటే ఏడు రెట్లు ఎక్కువగా వాయుకాలుష్యం నమోదవుతోంది. ఆ ప్రాంతాల్లో ఎక్కువ కాలం గాలిపీలిస్తే శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలో అంతకంతకూ వాహనాలు పెరుగుతునాయి. వాటి నుంచి వెలువడే ఉద్గారాలే గాలి నాణ్యత తగ్గి, కాలుష్యం పెరగడానికి కారణమని అధికారులు నిర్ధారించారు.
వీటికితోడు పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. గాలిలో కాలుష్యం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆస్తమాతోపాటు మానసిక వైకల్యం, ఊపిరితిత్తుల కేన్సర్ వంటి తీవ్ర ఇబ్బందులతోపాటు మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందక హఠాన్మరణం సంభవించే అవకాశాలు సైతం కొట్టిపారేయలేమని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సత్వరమే స్పందించి కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.