హైదరాబాద్ లో పెరుగుతున్న హైరైజ్ టవర్ల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయన్న ఆరోపణలను తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్లు ముక్తకంఠంతో ఖండించారు. అవన్నీ నిరాధార ఆరోపణలేనని స్పష్టం చేశాయి.
నిజానికి ఎత్తైన ఆకాశహర్మ్మాల వల్లే వసతులు మరింత మెరుగవుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు క్రెడాయ్ హైదరాబాద్, క్రెడాయ్ తెలంగాణతోపాటు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో), తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్), తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ఓ ప్రకటన విడుదల చేశాయి. పెరుగుతున్న గృహ డిమాండ్ అపార్ట్ మెంట్లతోనే తీరుతుందని.. హైరైజ్ టవర్ల నిర్మాణంతోనే గ్లోబల్ సిటీలకు అనుగుణంగా ఇక్కడ కూడా తగిన వసతులు కల్పించడం వీలవుతుందని పేర్కొన్నాయి. ఏదైనా నివాస లేదా వాణిజ్య భవనం నిర్మించేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్ బీసీ)కి అనుగుణంగా అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తామని తెలిపాయి. ఈ భవనాల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని.. అనుమతుల విషయంలో భారీ అవినీతి జరుగుతోందని వస్తున్న ఆరోపణలను ఆయా సంస్థలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఈ విషయంలో ఎవరెవరు ఏమన్నారంటే..
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన జనం హైదరాబాద్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్ బీపాస్ అనేది ఓ విప్లవాత్మక సంస్కరణ.
భవన నిర్మాణ అనుమతుల్లో అంతులేని జాప్యానికి, లంచాలకు ఇది చెక్ పెట్టింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే నిర్దేశిత గడువులోగా అనుమతులు మంజూరవుతున్నాయి. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో బలాన్ని ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఎకరా స్థలంలో 3 నుంచి 3.5 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలకు మించి అనుమతి ఇవ్వరు. అంతేకాకుండా భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకునే భవనాల ఎత్తును పరిమితం చేస్తున్నారు’
– మురళీ కృష్ణా రెడ్డి, క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్
భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయడానికి ప్రధానంగా నాలుగు అంశాలు పరిశీలిస్తారు.
భవనం ఎత్తు, అవసరమైన సెట్ బ్యాక్ లు, పార్కింగ్ నిబంధనలు, రహదారి. ఇక ఎత్తైన భవనాలకు అనుమతులు మంజూరు చేయడంలో ఫైర్ సేఫ్టీ అనేది కీలకమైన అంశం. ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ కోసం బిల్డింగ్ ప్లాన్లు పూర్తిగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇస్తారు. పనులు పూర్తయిన తర్వాత అగ్నిమాపక భద్రతా విభాగం నిర్దేశించిన ప్రక్రియను అనుసరించి ఎన్వోసీ ఇస్తేనే ఆ భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేస్తారు.
– సునీల్ చంద్రారెడ్డి, తెలంగాణ నరెడ్కో ప్రెసిడెంట్
ఐటీ, ఫార్మా పరిశ్రమలు తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ ను ఎంచుకున్నాయి. దీంతో ఎంతో మంది ప్రతిభావంతులు హైదరాబాద్ కు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలో ఏటా ఐదు లక్షల మందికి పైగా ప్రజలు నగరానికి వస్తుంటారు. వారందరికీ వసతులు కల్పించాలంటే ఎత్తైన భవనాలు ఉండాల్సిందే. లేకుంటే భూముల ధరలు ఆకాశాన్నంటుతాయి.
– జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
పెరుగుతున్న జనాభా, గృహ అవసరాలకు అనుగుణంగానే ఎత్తైన భవనాలు నిర్మించడానికి బిల్డర్ల వినతిమేరకు 2006లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే ఇప్పుడు చిన్నచిన్న సవరణలతో అమల్లో ఉంది. హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి ఇది దోహదపడుతోంది.
– సిహెచ్. ప్రభాకరరావు, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు
హైదరాబాద్ లో లగ్జరీ అపార్ట్ మెంట్లకు డిమాండ్ పెరిగిన విషయాన్ని ఫిబ్రవరి రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే అర్థమవుతుంది.
రూ.కోటి కంటే ఎక్కువ విలువైన అపార్ట్ మెంట్ల రిజిస్ట్రేషన్లలో 8 శాతం వృద్ధి కనిపిస్తోంది. నగరంలోని కొత్త ప్రాజెక్టులు స్కైలైన్ ను మెరుగుపరుస్తాయి. ప్రపంచంలోని ఏ ప్రధాన నగరానికీ తీసిపోని విధంగా హైదరాబాద్ ను తయారుచేస్తున్నాయి. ఎత్తైన భవనాలకు అగ్నిప్రమాద ముప్పు పొంచి ఉన్నప్పటికీ, ఎన్ బీసీ మార్గదర్శకాలను అనుసరించి అగ్నిమాపక సిబ్బంది క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇస్తున్నారు.
– రాజశేఖర్ రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ సెక్రటరీ
సరస్సుల సుందరీకరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం, బీపాస్ అనుమతులతో పెరిగిన ఆకాశహర్మ్యాలు డెవలపర్లను హైదరాబాద్ వైపు ఆకర్షిస్తున్నాయి.
దేశంలోని పలు ప్రాంతాల నుంచి డెవలపర్లు హైదరాబాద్ వైపు మొగ్గు చూపించడానికి ఇవే కారణం. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను నియంత్రించడానికి డ్రోన్లు, రోబోలను వినియోగించాలనే ప్రతిపాదనలను అగ్నిమాపక శాఖ సిద్ధ: చేసింది. వీటివల్ల భవనాలు సురక్షితంగానే ఉంటాయి.
– విజయ్ సాయి మేకా, తెలంగాణ నరెడ్కో జనరల్ సెక్రటరీ
This website uses cookies.