తెలంగాణ నిర్మాణ సంఘాలన్నీ యూడీఎస్, ప్రీలాంచ్ సేల్స్‌ని అరికట్టేందుకు కలిసికట్టుగా యుద్ధం ప్రకటించాయి. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్‌లోని క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. రెరా అనుమతి లేకుండా ప్లాట్లు , ఫ్లాట్లు కొనకూడదని కొనుగోలుదారుల్ని కోరాయి. యూడీఎస్, ప్రీలాంచ్ సేల్స్ అనేవి నిర్మాణ రంగానికి పట్టిన పీడ అని.. వీటిని బారిన పడి ఇబ్బందులు పడకూడదంటే.. బయ్యర్లంతా అప్రమత్తంగా ఉండాలని విన్నవించాయి. యూడీఎస్ సంస్థలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని అభ్యర్థించాయి. నిర్మాణ సంఘాలెంతో తెలివిగా కొనుగోలుదారులు, ప్రభుత్వ విభాగాలు ఏం చేయాలో సూచించాయి తప్ప.. నిర్మాణ రంగాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ ను జయించడానికి నిర్దిష్ఠమైన ప్రణాళికల్ని రచించడంలో ఘోరంగా విఫలమయ్యాయి. గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్లుగా.. యూడీఎస్, ప్రీ సేల్‌లో కొనకూడదని చెప్పాయి. రానున్న రోజుల్లోనైనా పక్కా ప్రణాళికల్ని రచిస్తారని ఆశిద్దాం. మొత్తానికి, శుక్రవారం ప్రెస్ మీట్‌లో.. నిర్మాణ సంఘాలన్నీ కలిసి గాల్లో కాల్పులు జరిపాయని చెప్పొచ్చు.
క్రెడాయ్ హైదరాబాద్, క్రెడాయ్ తెలంగాణ, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ వంటి సంఘాలన్నీ కలిసి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో కొందరు కంటెస్టెంట్స్ తరహాలో సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు అనిపించింది. గత రెండేళ్లలో ఎవరెవరు యూడీఎస్, ప్రీ లాంచ్ సేల్ జరుపుతున్నామనే విషయాన్ని పేర్లు, ఆధారాలతో సహా ప్రభుత్వానికి అందజేశామని అన్నారు. అయితే, ఆ పేర్లేమిటో చెప్పడానికి మూకుమ్మడిగా నిరాకరించారు. వాసవి, సాహితి సంస్థలు యూడీఎస్ చేస్తున్న విషయం కొంతకాలం క్రితం ఒక ప్రముఖ టీవీ ఛానెల్ వరుస కథనాల్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఆ రెండు కాకుండా.. ఇంకా ఎన్ని సంస్థలున్నాయని ప్రశ్నిస్తే.. నిర్మాణ సంఘాల ప్రతినిధులు ఆ పేర్లు చెప్పడానికి భయపడ్డారు. పైగా, ప్రభుత్వమే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
యూడీఎస్, ప్రీలాంచ్ సేల్స్ ని అరికట్టేందుకు నిర్మాణ సంఘాలకు చిత్తశుద్ధి ఉంటే.. ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి. దీనికి యాంటీ యూడీఎస్ బ్యూరో అని పేరు పెట్టాలి. ప్రతి సంఘం నుంచి ఒక సభ్యుడు లేదా ఉద్యోగిని తీసుకోవాలి. వీరంతా ముందుగా సోషల్ మీడియాలో ఏయే సంస్థలు యూడీఎస్, ప్రీలాంచ్ సేల్స్ జరుపుతున్న వారి వివరాల్ని సేకరించాలి. ప్రాజెక్టు పేరు, ఫోన్ నెంబర్లు, లొకేషన్, ఆఫర్ వంటివాటితో ఒక జాబితా రూపొందించాలి. ఆతర్వాత క్షేత్రపర్యటనకు వెళ్లి ప్రాజెక్టు లొకేషన్ తెలుసుకోవాలి. ఆయా వివరాలన్నింటినీ పత్రికలకు విడుదల చేయాలి. ప్రభుత్వానికీ సమాచారాన్ని అందించాలి. ఇలా ఓ ప్రణాళికాబద్ధంగా.. కట్టుదిట్టంగా.. వ్యవహరిస్తే తప్ప.. యూడీఎస్, ప్రీలాంచ్ సేల్స్‌ని అరికట్టలేరు.