ఏపీ రాజధాని అమరావతిలో పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం అదనపు భూమిని కేటాయించింది. గుంటూరు జిల్లాలో 100 ఎకరాలు, ఎన్నటీఆర్ జిల్లాలో 168 ఎకరాలు కలిపి మొత్తం 268 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లాలోని బోరుపాలం, పిచ్చుకపాలం, అనంతవరం తదితర ప్రాంతాల్లోఅదనపు భూమి కేటాయించినట్టు సమాచారం. ఇళ్ల స్థలాల కోసం అదనపు భూమి కావాలంటూ ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి లేఖ రాయడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమరావతిలో పేదల కోసం 1134 ఎకరాల భూమిని కేటాయించింది. గుంటూరు జిల్లాలో 23,235 మంది లబ్ధిదారులు ఉండగా.. కొత్తగా 3417 మంది లబ్ధిదారుల కోసం వంద ఎకరాలు కేటాయించింది. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో 26,739 మంది లబ్ధిదారులు ఉండగా.. కొత్తగా 6,055 మంది లబ్ధిదారుల కోసం 168 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఆర్డీఏ నుంచి రూ.65.93 కోట్లకు భూమి కొనుగోలు చేశారు. కాగా, పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఈనెల 15న అమరావతిలో పేదలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టాలు ఇవ్వనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడతారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై రాజధాని రైతులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ ప్రక్రియకు విఘాతం కలగకుండా సర్కారు అడుగులు ముందుకు వేస్తోంది.