అల్లు అర్జున్.. అనగానే ఓ స్టైల్ కనపడుతుంది. ఆయన హెయిర్ నుంచి కాళ్లకు వేసుకునే బూట్ల వరకు అన్నీ ప్రత్యేకంగా, విభిన్నంగా ఉంటాయి. ప్రతి అంశంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిరుచి కలిగి ఉంటారు. ఇలా ప్రతి విషయంలోనూ ఎంతో వైవిధ్యంగా కనిపించే బన్నీ ఆలోచన ధోరణి ఇంటి విషయంలో ఎలా ఉంది? ఆయన కలల ఇల్లు ఎలా ఉంటుంది ఓ సారి చూద్దామా?
సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లు అనగానే.. చుట్టూ భారీ కాంపౌండ్, లోపల చెట్లు, వైవిధ్యమైన ఎలివేషన్ ఉంటుందని ఊహిస్తాం. కానీ స్లైలిష్ స్టార్ బన్నీ రూటే సెపరేటు. ఆయన ఇల్లు నిజంగానే చాలా అంటే చాలా వైవిధ్యంగా ఉంటుంది. జూబ్లీహిల్స్‌లో దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో.. ఎనిమిది వేల చదరపు అడుగుల విశాలమైన స్థలంలో బన్నీ తన కలల సౌధాన్ని నిర్మించుకున్నారు.
బయట్నుంచి మంచు తెలుపు రంగును కలిగి ఉంటుంది. చుట్టూ మామూలు ప్రహారీ గోడ ఉంటుంది. లోపలకు వెళితే.. దీర్ఘచతురస్రాకారంలో ఉంటే ఓ వైవిధ్యమైన కట్టడం కనిపిస్తుంది. లోపలకు వెళ్లాక ఓ కారిడార్ లో నుంచి వెళితే నేరుగా స్విమ్మింగ్ పూల్ వస్తుంది. తెలుపు మరియు తటస్థ రంగులతో డిజైన్ చేసిన లివింగు రూములోనే అతిథులతో సరదాగా సంభాషిస్తారు. పెద్ద క్రీమ్ రంగులోని మంచాలు మరియు ముదురు పాలరాయి కాఫీ టేబుల్ తో ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.
కొత్త రకమైన ఎలివేషన్ తో.. అద్దాలే ప్రధానంగా కనిపించే ఆ ఇల్లు చూస్తే.. ఔరా అని అనకుండా ఉండలేం. ఇంద్రభవనం లాంటి ఆ ఇల్లు చూశాక.. అద్భుతం అనే మాట సరిపోదేమో అనిపిస్తుంది. ప్రత్యేకమైన డిజైన్, చక్కనైన స్విమ్మింగ్ పూల్, విభిన్నమైన ఫర్నిచర్ తో అదిరిపోయేలా ఉంటుంది. ‘బ్లెస్సింగ్’ అని బన్నీ పేరు పెట్టుకున్న ఈ విలాసవంతమైన సౌథం చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంది. ప్రముఖ ఆర్టిటెక్డ్ అమీర్ శర్మ ఈ ఇంటి డిజైన్ రూపొందించారు.
ఇంటి ముందు భాగంలో ఎలాంటి డిజైన్ లేకుండా ప్లేన్ గా ఉంచితేనే బాగుంటుందని బన్నీకి చెప్పి ఒప్పించారు. పిల్లల కోసం ప్రత్యేకమైన గదులతోపాటు కలర్ ఫుల్ నర్సరీ సైతం ఏర్పాటు చేశారు. అలాగే ఇంటిల్లిపాదీ కూర్చుని సినిమా, టీవీ చూసేందుకు ఓ ప్రత్యేకమైన గది నిర్మించారు. కుర్చీల దగ్గర నుంచి ప్రతి ఫర్నిచర్ కూడా చాలా వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.