60 రోజుల్లో రూ.150 కోట్ల ప్రాపర్టీ డీల్స్ జరిపిన స్టార్లు
దేశంలోనే ఖరీదైన రియల్ ఎస్టేట్ లావాదేవీలకు చిరునామాగా నిలిచిన ముంబైలో రియల్ జోరు కొనసాగుతూనే ఉంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీల దగ్గర నుంచి అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల వరకు ముంబైలో ప్రాపర్టీలు సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విషయంలో ఇంకా ముందుంటారు. తాజాగా గత 60 రోజుల్లో బాలీవుడ్ స్టార్లు రూ.150 కోట్ల విలువైన లావాదేవీలు జరిపారు. అవేంటో చూద్దామా?
ప్రముఖ నటుడు సునీల్ శెట్టి, ఆయన అల్లుడు, క్రికెటర్ కేఎల్ రాహుల్ ముంబై సమీపంలో రూ. 9.85 కోట్లకు భూమిని కొనుగోలు చేశారు. థానే వెస్ట్ లోని ఓవాలేలో ఏడు ఎకరాల భూమిని ఇరువురూ కలిపి కొన్నట్టు స్క్వేర్ యార్డ్స్ వెల్లడించింది. మొత్తం 30 ఎకరాల 17 గుంటల విస్తీర్ణంలో ఉన్న పెద్ద పార్శిల్‌లో ఏడు ఎకరాల అవిభక్త భూమి ఉంది. ఆ భూమిని వీరు కొనుగోలు చేశారు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ జనవరి 2025 నుంచి పలు ప్రాపర్టీలు విక్రయించడం ద్వారా వార్తల్లో నిలిచారు. గత రెండు నెలల్లో ఆయన ఆరు ప్రాపర్టీలను అమ్మడం ద్వారా దాదాపు రూ.103 కోట్లు సంపాదించారు. అమ్మిన ప్రాపర్టీలు బోరివాలి, వర్లి, లోయర్ పరేల్ వంటి ప్రధాన ప్రదేశాలలో లగ్జరీ అపార్ట్ మెంట్లు, వాణిజ్య కార్యాలయ స్థలాలు ఉన్నాయి.
బాలీవుడ్ నటి అమృతా పూరి, ఆమె తండ్రి ఆదిత్య పూరి భారతదేశంలోని ఎత్తైన భవనాలలో ఒకదానిలో రూ.37 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్ మెంట్‌ను కొనుగోలు చేశారు. ఈ అపార్ట్ మెంట్ లోధా వరల్డ్ టవర్స్ లోని 49వ అంతస్తులో ఉంది. 5,446 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇది ఉన్నట్టు రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా తెలిసింది.
బాలీవుడ్ గాయకుడు రాహుల్ వైద్య, అతని కుటుంబం ముంబైలోని ఓషివారాలో రెండు ఫ్లాట్‌లను రూ.5 కోట్లకు విక్రయించారు. తల్లిదండ్రులు కృష్ణ, గీతా వైద్యతో కలిసి రాహుల్ వైద్య ముంబైలోని ఓషివార ప్రాంతంలో రెండు అపార్ట్ మెంట్లను రూ.5 కోట్లకు విక్రయించారని స్క్వేర్ యార్డ్స్ పేర్కొంది. ఈ రెండు అపార్ట్ మెంట్లు దాదాపు 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెడీ టూ మూవ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు సమర్థ అంగన్ లో ఉన్నాయి.
ప్రముఖ నటి కాజోల్ ముంబైలోని పోవై ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌ను రూ.3.1 కోట్లకు అమ్మారు. కాజోల్ విశాల్ దేవగన్ ముంబైలోని పోవై ప్రాంతంలోని ఒక అపార్ట్ మెంట్‌ను రూ.3.1 కోట్లకు అమ్మినందుకు ఒక నెల క్రితం వార్తల్లో నిలిచారు. 762 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ పోవైలోని హిరానందాని గార్డెన్స్ లో ఉన్న అట్లాంటిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్‌లోని 21వ అంతస్తులో ఉంది. దీంతో పాటు రెండు స్టాక్ కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నట్టు రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించాయి. అలాగే ఆమె ఏప్రిల్ లో ముంబై సమీపంలోని గోరేగావ్ వెస్ట్ లో రూ.28.78 కోట్ల విలువైన 4365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న వాణిజ్య స్థలాన్ని కొనుగోలు చేశారు. ముంబైలోని గోరేగావ్ వెస్ట్ లోని బంగూర్ నగర్ లింకింగ్ రోడ్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో రిటైల్ స్థలాన్ని ఆమె భారత్ రియాలిటీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేశారు.