Categories: TOP STORIES

పాడురంగారెడ్డి.. ఇదేం ప‌ని?

  • అమీన్ పూర్ మున్సిపల్ ఛైర్మన్ పై కబ్జా ఆరోపణలు
  • ప‌బ్లిక్ యుటిలిటీస్ స్థ‌లంలో హెచ్ఎండీఏ
    అనుమ‌తి ఎలా ఇచ్చింది?
  • రోడ్డు కబ్జా చేసి గేటు పెట్టారని హైకోర్టులో వ్యాజ్యం

 

ఒక మున్సిపాలిటీకి ఛైర్మ‌న్ అంటే.. ఆ ఏరియాకే పెద్ద దిక్కు అని అర్థం. ఆ ప్రాంతం అభివృద్ధిని ప‌ట్టించుకోవ‌డంతో పాటు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించాల్సిన బాధ్య‌త ఆయ‌న మీదే ఉంటుంది. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరవేసేందుకు తోడ్ప‌డ‌టంతో పాటు ఎక్క‌డైనా ప్ర‌భుత్వానికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం అవుతుంటే వాటికి అడ్డుక‌ట్ట వేయాలి. ఇంత పెద్ద బ‌రువు బాధ్య‌త‌ల్ని మోయాల్సిన ఓ మున్సిప‌ల్ ఛైర్మ‌నే.. ఏకంగా ప్ర‌భుత్వ స్థ‌లాల్ని క‌బ్జా చేస్తే ఎలా?

భూముల ధ‌ర‌లకు అనూహ్యంగా రెక్క‌లు రావ‌డంతో.. అమీన్‌పూర్ వంటి ప్రాంతాల‌కు గిరాకీ పెరిగింది. అయితే అమీన్ పూర్ మున్సిపల్ ఛైర్మన్ పాండు రంగారెడ్డి పంచాయతీ స్థలాన్ని కబ్జా చేశారంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. సామాజికవేత్త, అడ్వొకేట్ వి.రవికృష్ణ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. మున్సిపాలిటీకి ప్రథమ పౌరుడిగా ఉన్న పాండురంగారెడ్డి కబ్జాకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అమీన్ పూర్ లోని సర్వే నెంబర్ 574, 575, 578లలో 33 ఫీట్ల పబ్లిక్ రోడ్లను కబ్జా చేసి గేటు పెట్టుకున్నారని ఈ ఏడాది ఏప్రిల్ 24న సంగారెడ్డి జిల్లా కలెక్టరుతో పాటు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్, హెచ్ఎండీఏ కమిషనర్, హెచ్ఎండీఏ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్, శంకరపల్లిలోని హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఎవరూ తగిన చర్యలు తీసుకోవ‌ట్లేద‌ని అందులో పేర్కొన్నారు. గతంలో ఇదే అంశంపై ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పాండు రంగారెడ్డి 33 ఫీట్ల రోడ్డును కబ్జా చేసి ప్లాట్ నెం.142, 144 మధ్య గేటు కూడా పెట్టారని తెలిపారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్లాట్ నెంబర్లు 144, 145, 146లలో పెట్రోలు బంకు ఏర్పాటు చేశారని వివరించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తగిన చర్యలు చేపట్టాలని అందులో కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ వ్యవహారాన్ని పరిశీలించి నాలుగు వారాల్లోపు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

కుడివైపు పాండురంగారెడ్డి ఇల్లు. ప‌క్క‌నే ఉన్న గేటు 33 అడుగుల రోడ్డులో ఉంది. దానిప‌క్క‌నే ఏర్పాటైన అత‌ని పెట్రోల్ బంకు

హెచ్ఎండీఏ గుడ్డిగా అనుమ‌తి?

ఈ కబ్జా వ్యవహారంపై రవికృష్ణ 2022 నవంబర్ 24న సంబంధిత అధికారులుకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని సర్వే నెంబర్లు 574, 575, 578లలో పబ్లిక్ యుటిలిటీ కోసం కేటాయించిన 3058 చదరపు గజాల స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని పేర్కొన్నారు. అందులో శ్రీనివాస నిలయం, సన్ షైన్ స్క్వేర్ అపార్టుమెంట్స్ పేరుతో ఐదు అంతస్తులో మూడు అపార్ట్ మెంట్లు నిర్మించారని.. వీటికి హెచ్ఎండీఏ అనుమతులూ ఇచ్చిందని నివేదించారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలంలో నిర్మాణాలకు హెచ్ఎండీఏ ఎలా అనుమతులు ఇచ్చిందో ఆశ్చర్యంగా ఉందన్నారు. అలాగే భరత్ నగర్ రోడ్డు నెంబరు 1 లోని రిలయెన్స్ సూపర్ మార్కెట్ పక్కన 15 ఫీట్ల రోడ్డు ప్రాంతాన్ని కబ్జా చేసి కమర్షియల్ కాంప్లెక్స్ తోపాటు కొన్ని నివాస సముదాయాలు కూడా నిర్మించారని పేర్కొన్నారు. వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

This website uses cookies.