దేశీయ నిర్మాణ రంగంలోనే అపర కుబేరులుగా ఖ్యాతినార్జించిన అర్బన్ రైజ్ సంస్థ యజమానులు.. హైదరాబాద్‌లో స్థలం దొరికిందని చెప్పి.. నిబంధనలు తెలుసుకోకుండా ప్రాజెక్టును ఆరంభించి.. ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించి.. అదే సొమ్ములో కొంత అధికారులకు ఆమ్యామ్యాలుగా ముట్టచెప్పి.. ఆగమేఘాల మీద అనుమతుల్ని తెచ్చుకుని.. నిర్మాణ పనుల్ని ఆరంభించి.. దాదాపు 800 మంది బయ్యర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
అదేంటీ.. నిర్మాణ పనుల్ని ఆరంభించి.. బయ్యర్లకు చుక్కలు చూపించడమేమిటని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ కథనం చదవాల్సిందే.
ఆ ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ అనుమతినిచ్చింది. రెరా కూడా పర్మిషన్ ఇచ్చేసింది. అంతకుముందే ప్రీలాంచ్‌లో ఆ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొన్న బయ్యర్లు మురిసిపోయారు. తాము మంచి ప్రాజెక్టులోనే పెట్టుబడి పెట్టామని పార్టీలు చేసుకున్నారు. నిర్మాణ పనులూ చకచకా జరుగుతుండటంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. కలల గృహాన్ని ఎలా డిజైన్ చేయించాలి? ఎవరితో ఇంటీరియర్స్ చేయించాలని కలలు కంటున్న తరుణంలో.. అర్బన్ రైజ్ నుంచి పిడుగులాంటి వార్త మెయిల్‌లో వచ్చింది. అప్పటికే దాదాపుగా స్ట్రక్చర్ పూర్తి కావడంతో.. ఏం కాదులే అని ధీమాగా ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. దేశీయ రియాల్టీ రంగంలోనే అపర కుబేరులైన అర్బన్ రైజ్ సంస్థ యజమానులకు.. ఇంత చిన్న విషయంపై అవగాహన లేదా అంటూ బయ్యర్లు మండిపడుతున్నారు.
అర్బన్ రైజ్ అనే సంస్థ దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వద్ద ద హ్యాపెనింగ్ హైట్స్ అనే ప్రాజెక్టును ఆరంభించింది. బాచుపల్లిలో ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను అమ్మినట్లే.. ఇందులోనూ విక్రయించింది. ఆతర్వాత స్థానిక సంస్థల నుంచి అనుమతిని తెచ్చుకుంది. అయితే, 2023 మార్చి 20 అందులో కొన్నవారికి ఒక మెయిల్ పంపించింది. స్థానికంగా ఉన్న దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ నుంచి ఎన్వోసీ తీసుకోవాలనే సమాచారం తమకు అందిందని.. అందుకే ప్రాజెక్టు పనుల్లో కొంత వేగం తగ్గించామన్నది ఆ మెయిల్ సారాంశం.
తొలుత బయ్యర్లు ఈ అంశంపై పెద్దగా దృష్టి సారించలేదు. కారణం, అప్పటికే స్ట్రక్చర్ పనులు జోరుగా జరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, కొనుగోలుదారులు స్వయంగా వెళ్లి ప్రాజెక్టును చూడగా.. పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోవడం చూసి విస్తుపోయారు. పనుల్లో వేగం తగ్గిస్తున్నామని చెప్పారే తప్ప మొత్తం ప్రాజెక్టును నిలిపివేస్తున్నామని చెప్పలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడుండే సేల్స్ ఆఫీసును వేరే చోటికి మార్చడం చూసి సంస్థను ప్రశ్నించడం మొదలెట్టారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ నుంచి వచ్చిన లేఖను తమకు చూపెట్టాలని కొనుగోలుదారులు గట్టిగానే కోరుతున్నారు. అయినా, అర్బన్ రైజ్ మాత్రం పట్టించుకోవట్లేదు. దీంతో, ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. సమస్య పరిష్కారం అవుతుందా? లేదా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2019 మార్చి8న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఇచ్చిన ఎన్వోసీలో ఓ విషయం స్పష్టంగా పేర్కొన్నారు. నిర్మాణ జరిగే ప్రాంతం స్థానికంగా డిఫెన్స్ పరిధిలోకి వస్తే.. వారి నుంచి కూడా అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉంది. సైటు చేరువలో ఏదైనా అనధికార ఏరోడ్రోమ్ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని నిబంధనలో పేర్కొన్నారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ సమీపంలోనే అర్బన్ రైజ్ ద హ్యాపెనింగ్ హైట్స్ ప్రాజెక్టు ఉందనే విషయం తెలిసినప్పటికీ.. వారి నుంచి ఎన్వోసీ తీసుకోవాలనే ఆలోచన అర్బన్ రైజ్ యజమానులకు కానీ సిబ్బందికి కానీ తెలియకపోవడం విడ్డూరం. హెచ్ఎండీఏ కానీ స్థానిక దుండిగల్ మున్సిపాలిటీకి కానీ ఈ అంశంపై అవగాహన లేకపోవడం దారుణమైన విషయం. తప్పు స్థానిక సంస్థలదైనా, డెవలపర్‌దైనా.. అంతిమంగా కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. మరి, వీరి ఇబ్బందుల్ని అర్బన్ రైజ్ ఎప్పుడు.. ఎలా తొలగిస్తుందో?
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ అర్బన్ రైజ్‌కు ఇచ్చిన లెటర్‌ను బహిర్గతం చేయాలని ప్రాజెక్టులో ఫ్లాట్లు కొన్నవారంతా డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ, అర్బన్ రైజ్ ఈ విషయంలో పెద్దగా స్పందించట్లేదు. దీంతో, కొనుగోలుదారుల్లో మరింత భయం నెలకొంది. కాబట్టి, ఇప్పటికైనా పంప్థ ఆ లెటర్‌ను బయ్యర్లకు అందజేయాల్సన అవపరం ఎంతైనా ఉంది.
This website uses cookies.