Categories: TOP STORIES

అందుబాటు ఇళ్ల విక్రయాల్లో తగ్గుదల

  • తగ్గిన సరఫరా.. పెరిగిన ఈఎంఐ భారం
  • అన్ రాక్ నివేదిక వెల్లడి

కోవిడ్ మహమ్మారి ప్రభావం సరమైన గృహాల అమ్మకాలపై ఎక్కువ ప్రభావం చూపించింది. కరోనా తీవ్రత గతేడాదే తగ్గినప్పటికీ, హౌసింగ్ లో ఈ విభాగం ఇప్పటికీ ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో జరిగిన మొత్తం ఇళ్ల అమ్మకాల్లో సరసమైన గృహాల వాటా దాదాపు 20 శాతానికి తగ్గిపోయినట్టు అన్ రాక్ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. 2022లోని తొలి ఆరునెలల కాలంతో పోలిస్తే ఇది 11 శాతం తక్కువ అని పేర్కొంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సరసమైన ఇళ్ల సరఫరా గతేడాది తొలి అర్ధభాగంలో 23 శాతం ఉండగా.. ఈ ఏడాది అది 18 శాతానికి పడిపోయింది. 2023 తొలి ఆరునెలల్లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2.29 లక్షల ఇళ్ల విక్రయాలు జరగ్గా.. అందులో 46,650 ఇళ్లు మాత్రమే సరసమైన గృహాలు.

అదే 2022లో మొత్తం 1.84 లక్షల యూనిట్లు అమ్ముడవగా.. అందులో సరసమైన ఇళ్ల సంఖ్య 57,060గా ఉంది. మరోవైపు సరసమైన ఇళ్లు కొనుగోలుదారులు ఈఎంఐల రూపేణా 20 శాతం అధికంగా చెల్లిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. 2021లో 6.7 శాతం ఉన్న గృహ రుణ వడ్డీ ప్రస్తుతం 9.15 శాతానికి పెరగడమే ఇందుకు కారణమని వివరించింది. ‘2021 జూలైలో రూ.22,700 ఈఎంఐ చెల్లించిన వ్యక్తులు ఇప్పుడు రూ.27,300 చెల్లిస్తున్నారు. అంటే నెలకు దాదాపు రూ.4600 పెరిగింది. ఈఎంఐలో ఈ 20 శాతం పెరుగుదల వల్ల మొత్తం వడ్డీ భారం దాదాపు రూ.11 లక్షలు పెరిగింది. 2021లో రూ.24.5 లక్షలు వడ్డీ ఉన్నవారు ఇప్పుడు రూ.35.5 ల్షక్షలు చెల్లించాల్సి ఉంటుంది’ అని అన్ రాక్ గ్రూప్ రీసెర్చ్ హెడ్, రీజనల్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు.

This website uses cookies.