Categories: PROJECT ANALYSIS

విశాఖలో అతిపెద్ద ఇనార్బిట్ మాల్

  • రూ.600 కోట్లతో ఏర్పాటు చేస్తున్న రహేజా గ్రూప్

దక్షిణాదిలో అతిపెద్దదైన ఇనార్బిట్ మాల్ విశాఖపట్నంలో రాబోతోంది. విశాఖలోని కైలాసపురంలో రూ.600 కోట్ల పెట్టుబడితో రహేజా గ్రూప్ దీనిని ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్థకు 17 ఎకరాలు కేటాయించగా.. 12 నుంచి 13 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద మాల్ నిర్మిస్తున్నట్టు ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి సంబంధించి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రహేజా గ్రూప్ హైదరాబాద్ లో నిర్మించిన ఇనార్బిట్మాల్ 7 నుంచి 8 ఎకరాల్లో ఉండగా.. ఇక్కడ 12 నుంచి 13 ఎకరాల్లో నిర్మిస్తున్నట్టు చెప్పారు. దీంతోపాటు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ స్పేస్, కన్వెన్షన్ సెంటర్ ను కూడా తర్వాత దశలో రహేజా సంస్థ నిర్మిస్తుందని వెల్లడించారు.

ఇక ఇనార్బిట్ మాల్ నిర్మాణంతో విశాఖ రూపురేఖలు మారిపోతాయని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 8వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఐటీ స్పేస్ నిర్మాణంతో మరో 3వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. హిందూపూర్ లో 350 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్ పార్కు రానుందని.. దీని ద్వారా 15వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని జగన్ తెలిపారు. విజయవాడ, గుంటూరు, రాజమండ్రిల్లో ఇప్పటికే తమ మాల్స్ ఉన్నాయని.. త్వరలోనే నెల్లూరు, కాకినాడ, తిరుపతిల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామని రహేజా గ్రూప్ చైర్మన్ నీల్ రహేజా వెల్లడించారు.

This website uses cookies.