Categories: TOP STORIES

ఇక కేరళలో రియల్ కేక

  • తదుపరి రియల్ బూమ్ ఆ రాష్ట్రంలోనే
  • కొచ్చి, త్రివేండ్రంలలో చక్కని అవకాశాలు
  • క్రెడాయ్, కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ నివేదిక వెల్లడి

భారత్ లో త రియల్ పెట్టుబడులకు కేరళ త్వరలోనే చక్కని గమ్యస్థానంగా మారనుందని క్రెడాయ్, కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక పేర్కొంది. కొచ్చిలోని 7వ స్టేట్ కాన్ లో ‘డెస్టినేషన్ కేరళ: ది నెక్స్ట్ బిగ్ రియల్ ఎస్టేట్ గ్రోత్ స్టోరీ’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో బోలెడు అంశాలను విశదీకరించింది.

భారతదేశంలోని టాప్-8 రియల్ ఎస్టేట్ మార్కెట్ లేని ఏకైక రాష్ట్రం కేరళ. అయినప్పటికీ త్వరలోనే కేరళలో రియల్ బూమ్ వస్తుందని, తదుపరి దశ వాణిజ్య రియల్ ఎస్టేట్ వృద్ధి జోరుగా కొనసాగుతుందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా కొచ్చి,త్రివేండ్రంలో రియల్ రంగం దూసుకెళ్తుందని వివరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళ 48 శాతంతో అధిక పట్టణీకరణ రేటు నమోదు చేసింది. ఇది మన దేశ సగటు పట్టణీకరణ రేటు (31 శాతం) కంటే చాలా ఎక్కువ. దాదాపు 10 లేదా 12 ఏళ్లలోనే పూర్తి పట్టణీకరణ సాధించిన రాష్ట్రంగా కేరళ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. అధిక ఆదాయం వచ్చే దేశాలలో పనిచేస్తున్న కేరళీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇది వినియోగదారుల వ్యయాన్ని పెంచుతోంది. అలాగే అనేక రిటైల్ బ్రాండ్లు, మాల్ డెవలపర్లను రాష్ట్రంలోకి ఆహ్వానిస్తోంది. ఇటీవల ఎన్ఎస్ఎస్ఓ సర్వే ప్రకారం కేరళ సగలు నెలవారీ గృహ వ్యయం జాతీయ సగటును అధిగమించడమే కాకుండా ఏపీ, కర్ణాటక, తమిళనాడు సహా చాలా పారిశ్రామిక రాష్ట్రాలను దాటేసింది. కేరళ మంచి రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, మెట్రో రైలు కనెక్టివిటీతోపాటు మౌలిక వసతుల నెట్ వర్క్ విస్తృతంగా కలిగి ఉంది. దీంతో పలు వ్యాపారాలు, వ్యక్తులకు రాష్ట్రాన్ని ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చింది.

 

కేరళ రియల్ ఎస్టేట్ రంగా అనేక ప్రభుత్వ కార్యక్రమాల నుంచి లబ్ధి పొందుతోంది. ప్రభుత్వం స్టార్టప్ లకు ప్రోత్సాహకాలతోపాటు పెట్టుబడి రాయితీలు అందజేస్తోంది. కేరళ స్టార్టప్ మిషన్ ద్వారా కొచ్చిలో కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి సంస్థలకు ప్రోత్సాహం ఇస్తోంది. అలాగే కేరళ స్టార్టప్ మిషన్ ద్వారా సీడ్ ఫండింగ్ కూడా అందజేస్తోంది. వీటితోపాటు కొచ్చి, త్రివేండ్రం, త్రిసూర్ వంటి నగరాల్లో టెక్నో పార్క్, ఇన్ఫో పార్క్, సైబర్ పార్క్ వంటి గ్లోబల్ ఐటీ కంపెనీల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేరళ రియల్ బూమ్ పరుగులు పెట్టడం ఖాయమని నివేదిక పేర్కొంది. దేశంలోని తదుపరి 10 అత్యంత అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ నగరాల జాబితాలో రెండు నగరాలను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం కేరళే కావడం విశేషం. కొచ్చి, త్రివేండ్రం ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే కోజికోడ్, త్రిసూర్, పాలక్కాడ్ వంటి నగరాలు కూడా గణనీయమైన పురోగతి సాధిస్తున్నట్టు నివేదిక వివరించింది. రాబోయే సంవత్సరాల్లో టైర్-2 నగరాల్లో ఆఫీసులు ఏర్పాటు చేయడానికి చూస్తున్నవారికి కేరళ ప్రముఖ గమ్యస్థానంగా మారుతుందని అభిప్రాయపడింది.

This website uses cookies.