Categories: Celebrity Homes

నా డెకర్ లకు బిగ్ బాస్ ఇల్లే ప్రేరణ

ఆ ఇంటి నుంచి ఎంతో నేర్చుకున్నా
నటి, మోడల్ శుభశ్రీ రాయగురు

నటి, మోడల్, బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ పార్టిసిపెంట్ శుభశ్రీ రాయగురు జోరుగా దూసుకెళ్తున్నారు. ఈ వారం డ్రీమ్ హోమ్ సెగ్మెంట్ లో మేము ఆమెను ఎంచుకోవడం సరైనదేనా అని ప్రశ్నిస్తే నిస్సందేహంగా అని చెప్పొచ్చు. ఆమె డ్రీమ్ హోమ్ గురించి, చిన్ననాటి ఇంటి సంగతుల గురించి బోలెడు అంశాలను ఫోన్లో పంచుకున్నారు. చిన్నప్పుడు నివసించిన ఇంట్లో తండ్రికి ఆమెకు ఉన్న అనుబంధం ఎలాంటిదో చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి న్యాయవాది కావడంతో పలుచోట్లకు బదిలీ కావడంతో శుభశ్రీ దేశవ్యాప్తంగా బోలెడు ఇళ్లు చూశారు. తన కలల సౌథం ఎలా ఉండాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.

‘మినిమలిజం డెకర్ నాకు అంతగా నచ్చదు. విలాసవంతమైన అంశాలు నన్ను ఎల్లప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాయి. నా ప్రేక్షకులు నా నుంచి సింప్లిసిటీని ఆశించరు. ఎందుకంటే అది చాలా బోరింగ్ గా ఉంటుంది. నేను రణవీర్ సింగ్ ను ఫాలో అవుతా డ్యూడ్. అందువల్ల ఇంటి డెకర్ విషయంలో కూడా అంతే ఉత్సాహంగా, దూకుడుగా ఉంటాను. మినిమల్ గా ఉండే ఇల్లు అంతగా బాగోదు. అయితే, మంచి మంచి రంగులు వేస్తే ఓకే. నాకు రంగులు అంటే చాలా ఇష్టం’ అని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో మూడు వేలకు పైగా టెలివిజన్ షోలు చేసిన శుభశ్రీ డెకర్ గురించి తన అభిరుచులు వెల్లడించారు. ‘తెలుగు లేదా హిందీ బిగ్ బాస్ ఇల్లు ఒకరకంగా నా ఇల్లు లాంటిది. అవి రంగురంగుల ప్రకంపనలు కలిగిస్తాయి. వాటిని విభిన్నమైన థీమ్ లతో రూపొందించిన తీరు నాకు బాగా నచ్చింది. ఎన్ని రంగులు ఉన్నాయో, అవి ఎంత అందంగా ఉంటాయో ఈ షో ద్వారా నాకు తెలిసింది. షో గురించి ప్రకటన వచ్చినప్పుడల్లా ఈసారి బిగ్ బాస్ సెట్ ఎలా ఉందన్న అంశమే నా మదిలో మెదిలేది’ అని తెలిపారు.

ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉంటున్న శుభశ్రీ ఇల్లు ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించి, ఆమె చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయాం. ‘నేను ఈ భూమి కోసం నా వంతుగా ఏదైనా చేయాలనుకుంటున్నాను. అందుకే ఎప్పుడూ పచ్చని ప్రత్యామ్నాయాల కోసం చూస్తుంటాను. నా ఇంట్లో ప్రతి మూలనూ గులాబీలు, తులిప్ గుత్తితో నింపడం అంటే నాకు చాలా ఇష్టం. డెకరేషన్ లో ఇదో చక్కని మార్గం. నేను త్వరలోనే వెల్వెట్ తో కూడిన రాయల్ బ్లూ పెయింట్ నా బెడ్ రూమ్ కి వేయబోతున్నా. డెకర్ విషయంలో బిగ్ బాస్ హౌస్ నన్ను బాగా ప్రభావితం చేసింది. దీనికి సంబంధించి చాలా అంశాలపై నాకు పూర్తి అవగాహన వచ్చింది. అయితే, గోడలపై ఉండే ప్యాటర్న్స్ నాకు నచ్చవు. అలాగే నా ఇంట్లో మనోధైర్యం కలిగించే వైబ్స్ లేవు’ అని పేర్కొన్నారు.

శుభశ్రీ రాయగురుకు విల్లా అంటే ఇష్టమా లేక ఫ్లాట్ అంటే ఆసక్తా అని అడిగితే.. ఆమె ఇలా చెప్పారు. ‘ఓ సరదా సంగతి చెబుతాను. నేను రియల్ ఎస్టేట్ లో ఉన్నందున నాకు వచ్చిన అవగాహన మేరకు విల్లానే ఇష్టపడతాను. తత్వ అనేది మా వెంచర్లలో ఒకటి. త్వరలోనే మేం బిల్డర్లుగా రాబోతున్నాం. నాకు ఫ్లోర్ ప్లానింగ్ పై ఆసక్తి ఎక్కువ. విల్లాలు ఎప్పుడూ వెకేషన్ స్పాట్ లుగా ఉంటాయి. నేను ఒడిశాకు చెందినప్పటికీ, వాటిలో సెంట్రిక్ భాగం పూర్తిగా తెలుగు శైలిలోనే ఉండాలని కోరుకుంటాను. నిజానికి గాజు పైకప్పులు, గాజు తలుపులు నన్ను బాగా ఆకర్షిస్తాయి’ అని వివరించారు.

ఏదో ఒక రోజు గోవాలో బీచ్ హౌస్ కొనాలనే ఆలోచన శుభశ్రీకి ఉంది. ఆమె గోవా గురించి కలలు కంటున్నారు. అక్కడి సముద్రం, సూర్మరశ్మి, ఇసుక, పినాకోలాడాస్ అన్నీ బాగా ఆకట్టుకుంటాయట. ఆమె తన కలల ఇంటి గురించి ఆలోచించినప్పుడల్లా అవే గుర్తువస్తాయని చెప్పారు. ‘రామానాయుడు స్టూడియోస్ కి దగ్గర్లో ఉన్న శ్రీకాంత్ అడ్డాల ఇల్లు నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మా సినిమా ప్రమోషన్ కోసం మమ్మల్ని పిలిచారు. విశాలమైన బాల్కనీతో ఉన్న ఆ ఇల్లు నన్ను ఎంతగానో ఆకర్షించింది. అక్కడ నా సినిమా ప్రమోషన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక హైదరాబాద్ లో ఎకరం భూమి వంద కోట్లకు అమ్ముడైందనే వార్త చూసి ఎంతగానో గర్వపడ్డాను. త్వరలోనే హైదరాబాద్ మరో సింగపూర్ గా మారబోతోంది. నేను ల్యాండ్ ప్లానింగ్ లో ఉన్నందున నగరం మరింతగా విస్తరిస్తుందనే విషయం నాకు తెలుసు. మన రాష్ట్రం ఇతర మెట్రోపాలిటన్ నగరాల మాదిరిగా ఉండదు’ అని చెప్పి ముగించారు.

This website uses cookies.