Categories: TOP STORIES

అద్దె గ్యారెంటీ.. అంతా హంబక్కే?

  • 80 లక్షలు పెడితే ప్ర‌తి నెలా రూ.44వేల ఆదాయ‌మ‌ని ప్ర‌చారం
  • హైదరాబాద్ వన్ పేరుతో మరో ప్రీలాంచ్ ఆఫర్
  • పునాదులే పడని ప్రాజెక్టులో..
    పెట్టుబడి పెట్టాలంటూ ఆకర్షిస్తున్న వైనం

రూ.80 లక్షలు పెట్టుబడి పెడితే.. నెలకు రూ.44వేల చొప్పున జీవితాంతం అద్దె వస్తుందట. అదే రూ.1.09 కోట్లు పెడితే నెలనెలా రూ.62వేలు తీసుకోవచ్చట. జీవితాంతం పెన్షన్ మాదిరిగా ఆదాయం గ్యారెంటీ అట. ఇల్లు కొనుక్కుని అద్దెకు ఇచ్చుకోవడం కంటే, బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం కంటే.. ఇదే బెటరని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఇంకా పునాదులే పడని ప్రాజెక్టులో పెట్టబుడి పెడితే జీవితాంతం ఆదాయం పొందవచ్చని ఆకర్షిస్తున్నారు. ఇదంతా ఎక్కడా అన్నదే కదా మీ ప్రశ్న?

నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో హైదరాబాద్ వన్ పేరుతో ఓ భారీ ప్రాజెక్టు కట్టబోతున్నారు. ప్రపంచంలోనే పొడవైన కో లివింగ్ బిల్డింగ్ అని.. నాలుగు సెల్లార్లు, గ్రౌండ్, 46 అంతస్తుల్లో దీనిని డిజైన్ చేశామని ప్రకటనలు ఇస్తున్నారు. ఎకరం స్థలంలో సింగిల్ హైరైజ్ టవర్ అని.. 395 చదరపు అడుగులు, 545 చదరపు అడుగుల్లో మొత్తం 1928 యూనిట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంటున్నారు. ప్రపంచస్థాయి సౌకర్యాలతోపాటు 7 స్టార్ క్లబ్ హౌస్ ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఒకటి నుంచి మూడు అంతస్తుల వరకు అన్ని రకాల సౌకర్యాలూ ఉంటాయని, 4, 5వ అంతస్తుల్లో 7 స్టార్ క్లబ్, 6 నుంచి 10 అంతస్తుల వరకు ప్రత్యేకంగా మహిళల కోసం కో లివింగ్ స్పేస్, 36వ అంతస్తు నుంచి 46వ అంతస్తు వరకు సీనియర్ సిటిజన్స్, ఎన్నారైల కోసం ప్రత్యేక గదులు, ఇక 47వ అంతస్లులో స్విమ్మింగ్ పూల్, రూఫ్ టాప్ లాంజ్ బార్ ఉందని అరచేతిలో స్వర్గం చూపించేలా ఊదరగొడుతున్నారు.

రెరా సహా అన్ని అనుమతులు వచ్చేశాయని, ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభమయ్యాయని.. వెంటనే బుక్ చేసుకోకుంటే నష్టపోతారనే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. మే నెలాఖరు వరకు అయితే చదరపు అడుగుకు రూ.15 వేలు ధర అని.. జూన్ ఒకటి నుంచి రూ.20 వేలు అయ్యిందని చెబుతున్నారు. మరి నిజంగానే హైదరాబాద్ వన్ పూర్తి చేసి కొనుగోలుదారులకు వాటిని అప్పగిస్తారా? లేక చాలా ప్రీలాంచ్ ఆపర్ల మాదిరిగానే ఇది కూడా హంబక్కేనా అనేది వేచి చూడాలి.

This website uses cookies.