తెలంగాణ రాష్ట్రంలో ప్రీలాంచ్ స్కాములు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రెరా అథారిటీ అనుమతి లేకుండా.. అడ్డదారిలో సొమ్మును ఆర్జించేందుకు కొందరు అక్రమ రియల్టర్లు.. వేడిపకోడిల తరహాలో ప్లాట్లను అమ్మేశారు. హెచ్ఎండీఏ అనుమతి లేదు. రెరా పర్మిషన్ తీసుకోలేదు. రేటు తక్కువకు వస్తుందని బయ్యర్లు వెనకా ముందు చూడకుండా కొనేశారు. ఈ బాగోతాన్ని గత ఏడాది అక్టోబరులోనే రెజ్ న్యూస్ వెలుగులోకి తెచ్చింది.
ఫార్చ్యూన్ హోమ్స్ అనే సంస్థ ఎన్‌సీఎస్ ఫార్చ్యూన్ మెడి సిటీ అనే వెంచర్‌ను 2020 సెప్టెంబరులో ఆరంభించింది. కాకపోతే, అంతకు ముందే ప్రీలాంచ్‌లో ప్లాట్లను విక్రయించింది. అయితే, ఇందులో ప్లాట్లు కొనకూడదని గతంలో రెజ్ న్యూస్ హెచ్చరించింది కూడా. అయినా, తక్కువ రేటంటూ బయ్యర్లను ప్రలోభ పెట్టిందీ సంస్థ. లక్షల రూపాయల్ని కట్టించుకుంది. ఎంతకీ హెచ్ఎండీఏ అనుమతి రాకపోవడంతో సందేహించిన బయ్యర్లు తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేయడం ఆరంభించారు. దీంతో, సంస్థ ఎండీ పత్తా లేకుండా పోయారు. ఇక అప్పట్నుంచి బాధితులు తమ సొమ్ము కోసం సంస్థ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా, రియల్టర్ పత్తా లేకుండా పోయారు. దీంతో, ఏం చేయాలో అర్థం కాక కొందరు కొనుగోలుదారులు బంజారాహిల్స్ ఠాణా ముందు ధర్నా చేశారు. తమ సొమ్మును వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సంస్థపై గత ఏడాది రెరా నోటీసును జారీ చేసింది.
ఫార్చ్యూన్ 99 హోమ్స్ సంస్థ హెచ్ఎండీఏ, రెరా అనుమతి రాక ముందే.. ఒక్కో కొనుగోలుదారుడి నుంచి సుమారు రూ. 2 లక్షలు అడ్వాన్సుగా వసూలు చేసిందని గతేడాది రెజ్ న్యూస్ వెల్లడించింది. ఈ సంస్థకు రెరా అథారిటీ నోటీసు కూడా అందజేసిందని తెలియజేసింది. ఒక ప్రమోటర్ ప్లాటు లేదా ఫ్లాటుకు సంబంధించిన ప్రకటనల్ని విడుదల చేయాలనుకున్నా.. అమ్మకాల్ని చేపట్టాలన్నా.. తప్పనిసరిగా రెరా అథారిటీ చట్టం సెక్షన్ 3 (1) ప్రకారం అనుమతి తీసుకోవాలని చెప్పింది.
ఫార్య్చూన్ 99 హోమ్స్ రెరా అనుమతి లేకుండానే బయ్యర్ల నుంచి అడ్వాన్సు తీసుకోవడంతో.. రెరా చట్టం సెక్షన్ 59 ప్రకారం.. మొత్తం ప్రాజెక్టు విలువలో పది శాతం సొమ్మును జరిమానా వసూలు చేస్తుందని హెచ్చరించింది. మరేం జరిగిందో తెలియదు కానీ.. ఆ తర్వాత ఫార్చ్యూన్ 99 హోమ్స్ ప్రమోటర్ పత్తా లేకుండా పోయారు. బాధితులేమో పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు, నాయకులను కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. అయినా, ఫలితం మాత్రం కనిపించట్లేదు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ ఈ ప్రీలాంచ్ స్కాములపై దృష్టి సారించి.. వీటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This website uses cookies.