సుమారు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న విశ్వనగరం హైదరాబాద్ అంతకంతకు విస్తరిస్తూ వస్తోంది. ఇటూ అటూ అని కాకుండా నలువైపులా పెరుగుతోంది భాగ్యనగరం. కేవలం తెలుగువాళ్లే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్లు, విదేశీయులు సైతం నివాసం ఉండే ఏకైక సిటీ మన హైదరాబాద్. ఇందుకు హైదరాబాద్ లో ఉండే అహ్లాదకరమైన వాతావరణం, విద్యా ఉపాధి అవకాశాలు, ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలు, భద్రత, రుచికరమైన ఆహారం వంటి ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు. అందుకే కాస్మోపాలిటిన్ నగరమైన హైదరాబాద్ లో కోటి మందికి పైగా నివసిస్తున్నారు. అయితే హైదరాబాద్ ను మరో రెండు నగరాలైన సికింద్రాబాద్ , సైబరాబాద్ సమూహంగా పరిగణిస్తూ వస్తున్నాం కదా. ఇదిగో ఇప్పుడు మరో సిటీ వచ్చి చేరుతోంది.
హైదరాబాద్ రాజధాని సిటీ ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ల సమాహారం అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూడు నగరాలకు తోడుగా మరో నగరం రూపుదిద్దుకుంటోంది. రాజధానిలో మరో అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో నాలుగు వేల ఎకరాల్లో ఈ కొత్త నగరాన్ని నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. ఈ నాలుగో నగరానికి ఆరోగ్య, క్రీడా హబ్లు ఏర్పాటు చేయడంతో పాటు మెట్రో రైల్ ను సైతం అనుసంధానం చేస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ముచ్చర్లలో ఏర్పాటు చేసే నగరంలో వైద్య సేవల నుంచి ఉపాధి వరకు లభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.
ప్రణాళికాబద్దంగా ముచ్చర్లను అభివృద్ది చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అధికారులు సైతం చెబుతున్నారు. కనీసం 50 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముచ్చర్లలో మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది రేవంత్ సర్కార్. ప్రధానంగా విశాలమైన రోడ్లు, త్రాగునీటి సౌకర్యం, అంతర్జాతీయ స్థాయిలో విద్యా, వైద్య సౌకర్యాల ఏర్పాటుకు పక్కాగా ప్లాన్ చేస్తోంది. ముచ్చర్లలో ఏర్పాటు చేసే సిటీ చుట్టూ గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్ ను ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆలోచనలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. విద్యా, వైద్య, ఉపాధి అంశాలతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ రీక్రియేషన్, క్రికెట్ స్టేడియం నుంచి గోల్ఫ్ కోర్స్ వరకు అన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.
మరీ ముఖ్యంగా ముచ్చర్లలో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈ మేరకు ముచ్చర్లలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణంపై ఇప్పటికే బీసీసీఐతో మాట్లాడినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నట్లు ముచ్చర్లలో మరో నగరాన్ని నిర్మించేందుకు కొంత సమయం పట్టినా.. సామాన్య, మధ్య తరగతి వారికి సొంతిళ్లు నిర్మించుకునేందుకు, కొనుక్కునేందుకు ముందు ముందు అవకాశం దక్కుతుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
This website uses cookies.