- ఆఫీసు కోసం రూ.247.5 కోట్లతో రెండు భవనాల కొనుగోలు
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణ ఇన్ ఫ్రా హౌసింగ్ రెండు ఆఫీసు భవనాలను కళ్లు చెదిరే మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. మాదాపూర్ ప్రాంతంలో 4,30,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్న ఈ రెండు భవనాలను సొంతం చేసుకునేందుకు ఏకంగా రూ.247.50 కోట్లు చెల్లించింది. ఆఫీసు భవనాల కొనుగోలుకు సంబంధించి ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద మొత్తం కావడం విశేషం. ఎన్ ఎన్ కార్పొరేషన్ నుంచి ఈ రెండు భవనాలను తన సబ్సిడరీ సంస్థ హైటెక్ సైబర్ స్పైజియో ద్వారా కొనుగోలు చేసింది. కొనుగోలు ప్రక్రియ ముగిసిందని, కొన్నిరోజుల క్రితమే రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని సంస్థ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ లో చాలాకాలంగా ఇంత పెద్ద డీల్ జరగలేదు. తాజాగా అపర్ణ ఇన్ ఫ్రా కొనుగోలుతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సత్తా ఏమిటనేది మరోమారు ప్రపంచానికి తెలిసింది. 2005లో ఎల్ అండ్ టీ ఇన్ఫోసిటీ 2,52,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ప్లస్ ఐదంతస్తులతో నిర్మించిన భవనాన్ని 2011లో ఎన్ ఎన్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. దీనినే అపర్ణ ఇన్ఫ్ ఫ్రా తాజాగా కొనుగోలు చేసింది. ఇక రెండో భవనం మాదాపూర్ లో ఉంది. 1,81,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ భవనంలో హెచ్ఎస్ బీసీ ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ ఇండియా పనిచేస్తోంది. రెండు భవనాల కొనుగోలు నిజమేనని ధ్రువీకరించిన అపర్ణా ఇన్ ఫ్రా.. అంతకుమించి వివరాలను వెల్లడించలేదు.