-
కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాలి
-
లేకపోతే మరిన్ని స్కాములు?
-
పట్టించుకోకపోతే అంతే సంగతులు
తెలంగాణ రాష్ట్రంలో రెరా అథారిటీని ఏర్పాటు చేయడంలో మాజీ ఐఏఎస్ అధికారి రాజేశ్వర్ తివారీ ముఖ్య భూమిక పోషించారు. ఈ విభాగాన్ని సమర్థంగా పని చేయడంలో కీలక పాత్ర పోషించారు. మాసబ్ ట్యాంకులోని డీటీసీపీ కార్యాయం గ్రౌండ్ ఫ్లోరులో రెరా అథారిటీ కార్యాలయాన్ని దగ్గరుండి ఏర్పాటు చేయించారు. ఆయన పదవీవిరమణ తర్వాత, రెరా అథారిటీ పూర్తిగా గాడి తప్పింది. తన స్థానంలో ప్రభుత్వం సోమేష్ కుమార్‌ని తాత్కాలికంగా నియమించడం.. ఆయనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావడం.. అధికారిక బాధ్యతల్లో తలమునకలు కావడంతో రెరా అథారిటీపై పెద్దగా దృష్టి సారించలేదు. ఈ అంశమే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసింది. సాహితీ ప్రీలాంచ్ స్కామ్‌లో తప్పని పరిస్థితిలో.. ప్రభుత్వం బూదాటీ లక్ష్మీనారాయణను అరెస్టు చేసింది. పలువురు బిల్డర్లు, డెవలపర్లపై ఈడీ, సీబీఐ దాడులు రాజకీయ కోణంలో జరుగుతున్నాయని అనుకున్నప్పటికీ.. సాహితీ ప్రీలాంచ్ స్కామ్.. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని చెప్పొచ్చు. ఈ అంశం గురించి ముందే తెలిసినా రెరా అథారిటీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. బాధితులంతా రోడ్డు మీదికొచ్చి ధర్నాలు చేసినా నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరించింది.
తమకెందుకులే అని భావించింది. ఏదో తూతూమంత్రంగా నోటీసులిచ్చి తప్పించుకుంది తప్ప సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టలేదు. దీనికంతటికీ ప్రధాన కారణం.. రెరాకు పూర్తి స్థాయి ఛైర్మన్ లేకపోవడమే. కాబట్టికి, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి.. అమాయక కొనుగోలుదారుల కష్టార్జితాన్ని కాపాడేందుకు.. రెరా అథారిటీకి ప్రత్యేక అధికారిని నియమించాలి. కనీసం రాజేశ్వర్ తివారీని అయినా కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకుని.. రెరా బాధ్యతల్ని అప్పగించాలి. లేకపోతే, రానున్న రోజుల్లో ఈ ప్రీలాంచ్ స్కాముల వల్లే ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది.