కింగ్ జాన్సన్ కొయ్యడ: ఒక నగరం అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జించాలంటే.. అక్కడ పచ్చదనం వెల్లివిరియాలి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా పరిసరాలు ఉండాలి. ప్రజలు కార్యాలయాలకు సులువుగా రాకపోకల్ని సాగించాలి. శాంతిభద్రతల విషయంలో రాజీ ఉండకూడదు. తాగటానికి స్వచ్ఛమైన నీరు దొరకాలి. మురుగునీటి శుద్ధికి పక్కా ప్రణాళికలుండాలి. భవన నిర్మాణ అనుమతులు సులభంగా లభించాలి. మున్సిపల్ సేవల్ని పౌరులు అతివేగంగా అందుకోగలగాలి. ఎప్పటికప్పుడు వినూత్న, విప్లవాత్మక నిర్ణయాలతో నగరం అభివృద్ధి చెందేలా పరిస్థితులుండాలి. అప్పుడే, ఆయా నగరం అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది. హైదరాబాద్‌ను విదేశీ నగరాల సరసన నిలబెట్టేందుకు.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మరింత వేగవంతమైన ప్రణాళికలు జరుగుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పురపాలక శాఖ సాధించిన విజయగాథను చూస్తుంటే.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
పట్టణ జనాభాలో జాతీయ సగటు (31.16 శాతం) కంటే తెలంగాణ (46.8 శాతం)లోనే అధికంగా ఉంది. ఇది మన తెలంగాణను దేశంలోనే మొదటి మూడు సర్వోన్నత పట్టణీకరణ రాష్ట్రాల్లో ఒకటిగా నిలబెట్టింది. నగరాలు ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా వ్యవహరిస్తాయని మంత్రి కేటీఆర్ తరుచూ చెబుతుంటారు. పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యలాపాల ప్రభావం రాష్ట్ర ప్రజలకు ఉపాధి అవకాశాలు, ఆదాయాల పెరుగుదలకు తోడ్పడుతుంది. ప్రగతీశీల పట్టణ విధానాల కారణంగా తెలంగాణ పట్టణీకరణ దిశగా అతివేగంగా పరుగులు పెడుతోంది. 69 నుంచి 142 పట్టణ స్థానిక సంస్థల్ని చేయడం ద్వారా.. వీటి నుంచి రాష్ట్ర జీడీపీకి మూడింట రెండు వంతు వచ్చి చేరుతోంది.
రహదారులు తళతళ
దేశంలోని ఇతర మెట్రో నగరాలకు భాగ్యనగరానికి గల తేడా ఏమిటంటే.. మన రహదారులు తళతళ మెరుస్తుంటాయి. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ సుమారు 9013 కిలోమీటర్ల రోడ్లను మెయింటెయిన్ చేస్తుంది. గతేడాది 3241 రహదారుల్ని అభివృద్ధి చేసేందుకై రూ.788.18 కోట్లను మంజూరు చేశారు. ఇందులో 1469 పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. సీఆర్ఎంపీ (కాంప్రీహెన్సివ్ రోడ్ డెవలప్‌మెంట్) కింద సుమారు 227 కిలోమీటర్ల రహదారుల్ని అభివృద్ధి చేశారు. నగరంలోని 36 ప్రాంతాల్లో సుమారు వంద ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తోంది. వీటిలో 22 బ్రిడ్జిలు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి. 7 చివరి దశలో ఉన్నాయి. మెహదీపట్నం, ఉప్పల్‌లో స్కైవాక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల పౌరులు చౌరస్తాలో అటూఇటూ సులువుగా రాకపోకల్ని సాగించేందుకు వీలు కలుగుతుంది. నాలాలను అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. 58 ప్రాంతాల్లో రూ.973 కోట్ల అంచనా వ్యయంతో పనులు జరుగుతున్నాయి.
అన్నింటా అగ్రగామిగా దూసుకెళ్తున్న హైదరాబాద్.. మరో కీలక అంశానికి వేదిక కాబోతోంది. ఫార్ములా వన్ రేసింగ్ కు ఆతిథ్యం ఇవ్వనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిల్లో ఎలక్ట్రిక్ కార్ చాంఫియన్ షిప్ ను నిర్వహిస్తోంది. ఈ రేసింగ్ నిర్వహించే తొలి భారతీయ నగరంగా చరిత్ర సృష్టించబోతోంది. ప్రపంచంలో ఇప్పటి వరకూ 17 నగరాల్లో ఈ రేసింగ్ జరుగుతుండగా.. మన హైదరాబాద్ 18వ కావడం గమనార్హం.
హైదరాబాద్ లో రోప్ వే వ్యవస్థను అభివృద్ధి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రదేశం హుస్సేన్ సాగర్ కు మరింత వన్నె తెచ్చేందుకు రోప్ వే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ 8 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయాలని ప్రణాళికల్ని రచిస్తోంది. నెక్లెస్ రోడ్ ఎంఎంటీఎస్ స్టేషన్, సంజీవయ్య పార్కు ఎంఎంటీఎస్ స్టేషన్, పీపుల్స్ ప్లాజా, జలవిహార్, సంజీవయ్య పార్క్, ఇందిరా పార్కులను కలుపుతూ రోప్ వే నిర్మించాలని ప్రణాళికలను రూపొందించింది. కాచిగూడ రైల్వే స్టేషన్ ఎంజీబీఎస్ మీదుగా జూపార్క్ వరకు 7.62 కిలోమీటర్ల మేర మరో రోప్ వే వ్యవస్థ ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ అధికారులు నిర్ణయించారు. వీటితో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలోనూ రోప్ వే ఏర్పాటు చేస్తారు. రాయిగిరి నుంచి యాదాద్రి వరకు 6.2 కిలోమీటర్ల రోప్ వే ఏర్పాటుకు ప్రతిపాదనల్ని సిద్ధం చేశారు.
ఆహా.. తెలంగాణ పురపాలక శాఖ ఎంత చక్కటి కబురును అందించింది. ఇక నుంచి రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యూటేషన్ సర్టిఫికెట్‌ను అందజేస్తారట. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫీజు కట్టిన తర్వాత ప్రత్యేకంగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి మ్యూటేషన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదట. ఇది వింటుంటేనే ఎంతో ఆనందమేస్తుంది.
ఇంతవరకూ అసెస్ చేయని ప్రాపర్టీ గనక.. రిజిస్ట్రేషన్ కు వస్తే.. అక్కడే అసెస్ చేసి నిర్మాణాలకు పీటీఐఎన్, ఖాళీ స్థలాలకు వీఎల్టీఐఎన్ జారీ చేస్తారు. వీటి కోసం పౌరులు ప్రత్యేకంగా దరఖాస్తు చేయనక్కర్లేదు. పదేపదే మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు. అంతే కాదు, భవన నిర్మాణ అనుమతి కోసం టీఎస్ బీపాస్ వద్దకు అసెస్ చేయని ప్రాపర్టీ వచ్చినప్పుడు, అక్కడికక్కడే ఆ ప్రాపర్టీని అసెస్ చేసి పీటీఐఎన్ జారీ చేస్తారు. అన్ని పట్టణ స్థానిక సంస్థల్లోని ఆస్తులను (20.8 లక్షల ప్రాపర్టీలు) మ్యాపింగ్ చేసేందుకు భువన్ ఫేజ్-2 చేపడతారు. ఇప్పటివరకు దాదాపు 17 లక్షల ప్రాపర్టీలను మ్యాపింగ్ చేశారు. దీనివల్ల ఆస్తి పన్ను వసూలు సులభతరం కానుంది. ఈ మ్యాపింగ్ కారణంగా ఇప్పటి వరకూ రూ. 25.41 కోట్ల ఆదాయం స్థానిక పట్టణ సంస్థలకు సమకూరింది.
తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కృషి కారణంగా అర్బన్ లోకల్ బాడీస్ లో పౌర జీవనం గణనీయంగా మెరుగుపడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ కార్పొరేషన్ కు అదనంగా మరో రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతిచ్చింది. అంటే ప్రభుత్వం మొత్తం రూ.4 వేల కోట్లకు హామీదారుగా ఉండనుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నుంచి ఐదేళ్ల కాలానికి రూ.90 కోట్ల టెర్మ్ లోన్ తీసుకోవడానికి అనుమతిచ్చింది. ఈ మొత్తంతో రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, పబ్లిక్ టాయిలెట్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల వంటివి నిర్మిస్తారు.
This website uses cookies.