- ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాల్లో వార్షిక ఆదాయమే చూడాలి
- స్టాంపు డ్యూటీ, బ్రోకరేజీ, వివిధ పన్నులు తీసేసిన తర్వాతే నికర లాభం
బాలీవుడ్ నటుల్లో చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలోనూ దూకుడుగా ఉంటారు. తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడుతుంటారు. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రాపర్టీలు కొనుగోలు చేసి తమ పోర్ట్ ఫోలియోను విస్తరించుకుంటుంటారు. మరి వారి నిర్ణయాలు ఎంతవరకు సత్ఫలితాలనిస్తున్నాయి? ఆశించిన రాబడి పొందుతున్నారా వంటి అంశాలపై ఇటీవల సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ముఖ్యంగా ప్రాపర్టీ డీల్స్ లో స్టాంపు డ్యూటీ, బ్రోకరేజీ, వివిధ పన్నులు కలిసి వారి రాబడిని 7 నుంచి 10 శాతం మేర తగ్గిస్తున్నాయని అంచనా వేశారు.
ఇటీవల తమ నివాసం మన్నత్ పునరుద్ధరణ కోసం దాదార్ వెస్ట్ లోని ఫ్లాట్ ను షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ రూ.11.61 కోట్లకు విక్రయించారు. ఏడాదిన్నర క్రితం ఆమె ఆ ప్రాపర్టీని రూ.8.5 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఆమె 37 శాతం లాభం పొందారని విశ్లేషణలు వచ్చాయి. అలాగే నటుడు అక్షయ్ కుమార్ బోరివాలిలోని ఒబెరాయ్ స్కై సిటీలో రెండు ఫ్లాట్‌లను రూ.6.60 కోట్లకు విక్రయించారు – ఇది 8 సంవత్సరాల హోల్డింగ్ కాలంలో 90% రాబడి వచ్చినట్టు పేర్కొన్నారు. సోనాక్షి సిన్హా కూడా బాంద్రాలోని 81 ఆరియట్‌లోని 2020లో కొనుగోలు చేసిన ఫ్లాట్‌ను రూ.22.50 కోట్లకు అమ్మేశారు. తద్వారా 61% లాభం పొందినట్టు వార్తలు వచ్చాయి. అయితే, వాస్తవానికి అదంతా లాభం కాదని.. ఇందులో స్టాంపు డ్యూటీ, బ్రోకరేజీ, వివిధ పన్నులు తీసేసిన తర్వాత.. అది కూడా వార్షిక రాబడి చూడాలని ఓ నిపుణుడు వ్యాఖ్యానించారు. గౌరీ ఖాన్ ఏడాదిన్నరలో 37% లాభం అంటే దాదాపు 21.1% వార్షిక రాబడి అని వివరించారు.