2024లో రెడీ టు ఆక్యుపై ప్రాజెక్టుల్ని కొనడానికి ప్రణాళికల్ని రచిస్తున్నారా? లేక కొత్తగా నిర్మితమవుతున్న అపార్టుమెంట్లలో ఫ్లాట్లను ఎంచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా? మీ ఆలోచన ఏదైనా.. కొన్ని అంశాలపై దృష్టి సారించాల్సిందే. అప్పుడే, మీరు జీవితాంతం ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంతింటి ఆనందాన్ని ఆస్వాదిస్తారు.
కొత్త సంవత్సరంలో మీరు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లను కొంటున్నట్లయితే.. అందులో నివసిస్తున్న కుటుంబాలతో మాట్లాడాలి. ఆయా ప్రాజెక్టు నాణ్యత ఎలా ఉందో వారి మాటల్లో తెలుసుకోవాలి. ఎందుకంటే, కొన్ని అపార్టుమెంట్లలో బాత్రూముల్లో నుంచి లీకేజీలు ఏర్పడే ఆస్కారముంది. కిటికీలు నాసిరకంగా ఉండొచ్చు. ఫ్లాట్లలో వాడిన సానిటరీ వేర్ నాణ్యమైనది లేకపోవచ్చు. ఇలాంటి అనేక సమస్యలు కొత్త అపార్టుమెంట్లలో దర్శనమిచ్చే ప్రమాదం లేకపోలేదు. రెరా అనుమతి పొందిన ప్రాజెక్టుల్లో మీరు తీసుకుంటున్నట్లయితే ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు. ఎందుకంటే, స్ట్రక్చర్ నాణ్యతపై దాదాపు ఐదేళ్ల పాటు రెరా చూసుకుంటుంది. రెరా అనుమతి లేని స్టాండ్ ఎలోన్ ఫ్లాట్లలో కొంటేనే ఎక్కువ సమస్యలొచ్చే అవకాశాలున్నాయి.
అనుమతి ఎవరు తీసుకున్నారు?
హైదరాబాద్ నిర్మాణ రంగంలో అధిక సందర్భాల్లో బిల్డర్లే స్థానిక సంస్థ నుంచి ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతిని తీసుకుంటారు. కొన్నేళ్ల నుంచి జరిగే సహజ ప్రక్రియ ఇది. అలా కాకుండా, స్థలయజమాని స్థానిక సంస్థ నుంచి అనుమతి తీసుకున్నాడంటే.. ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అంటే అందులో ఏదో సమస్య ఉంటుందని కాదు.. కాకపోతే, స్థలయజమాన్యం హక్కుకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే.. ఆతర్వాత ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి, ఈ అంశాన్ని కూడా మీరు పక్కాగా గమనించాకే.. ఫ్లాట్ ఎంపికకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాలి.