మాదాపూర్ వంటి కోర్ ఏరియాలో.. ఏడు స్టన్నింగ్ టవర్లు.. 8.54 ఎకరాల్లో 414 యూనిట్లు.. సింగిల్ ఫ్లోర్ స్కై మాన్షన్.. 5300- 5400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు.. ప్రతి రూములో డెడికేటెడ్ బాల్కనీ.. 62 వేల చదరపు అడుగుల క్లబ్ హౌజ్.. మొత్తానికి, అరబిందో రియాల్టీ ద పర్ల్ ప్రాజెక్టు.. లగ్జరీని మించిన నిర్మాణమని కచ్చితంగా చెప్పొచ్చు. ఆర్కిటెక్చరల్ డిజైన్, స్టన్నింగ్ ఎలివేషన్లు, ఇండోర్ మరియు ఔట్ డోర్ ఎమినిటీస్, ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ స్పేసెస్ వంటివి చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. హైదరాబాద్ రియల్ రంగానికే తలమానికమైన ఇంత లగ్జరీ ప్రాజెక్టును డిజైన్ చేసి ఏం లాభం? అరబిందో రియాల్టీ సంస్థ ఎండీ శరత్ చంద్రారెడ్డి అడ్డంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో అడ్డంగా ఇరుక్కుపోయారు. దీంతో, తెలంగాణ నిర్మాణ రంగమంతా నివ్వెరపోయింది. రియల్ రంగంలో ఒక సాధారణ రియల్ ఎస్టేట్ ఏజెంట్ లేదా కొత్తగా అపార్టుమెంట్లు చేపట్టే బిల్డర్ కూడా ఇలాంటి చిల్లర కేసుల్లో ఇరుక్కోరు. అలాంటిది అరబిందో ఫార్మా డైరెక్టర్, అరబిందో రియాల్టీ ఎండీ అయిన శరత్ చంద్రారెడ్డి ఈ లిక్కర్ స్కాంలో ఎలా ఇరుక్కుపోయాడా? అని నిర్మాణ రంగం ఆశ్చర్యపోతుంది. మరి, ఈయన అరెస్టు రియాల్టీ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం పడుతోంది?
అరబిందో ద పర్ల్.. సాధారణ పరిస్థితుల్లో అయితే ఇదో సూపర్ ప్రాజెక్టు అని చెప్పొచ్చు. హైఎండ్ లగ్జరీకే తలమానికంగా డిజైన్ చేసిన ద పర్ల్ ప్రాజెక్టులో ఫ్లాట్ రేటు.. చదరపు అడుక్కీ రూ.12,000 చెబుతున్నారు. మాదాపూర్ వంటి ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. ఈ రేటు పెద్దగా ఎక్కువేం కాదని చెప్పొచ్చు. కాకపోతే, సంస్థ ఎండీ శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుపోవడంతో.. ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి చాలామంది కొనుగోలుదారులు ముందుకు రావట్లేదని సమాచారం.
ఈమధ్య ద పర్ల్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటనలను విడుదల చేసినప్పటికీ.. బయ్యర్ల నుంచి ఆశించినంత స్పందన రావడం లేదని తెలిసింది. సంస్థ ఎండీ అరెస్టు అయ్యి.. తీహార్ జైలులో ఊచలు లెక్క పెడుతుండటంతో ఒక్కసారిగా అరబిందో రియాల్టీ ఇమేజ్ దారుణంగా పడిపోయింది. పైగా, లిక్కర్ స్కామ్లో రెండో వ్యక్తిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి పాత్ర నిరూపితమైతే, అరబిందో రియాల్టీ బ్యాంకు ఖాతాలు సీజ్ అవుతాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తెలిసి తెలిసీ ఎందుకీ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇరుక్కుపోవడమని కొనుగోలుదారులు ‘ద పర్ల్’ లో తీసుకోవడానికి ఆసక్తి చూపించట్లేదని తెలిసింది. ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల్లో.. బినామీల రూపంలో పెట్టుబడులు పెట్టిన రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల జాబితా కూడా బయటికి వస్తుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. పైగా, రిసెషన్ భయం కూడా రియల్ రంగాన్ని చుట్టి ముట్టింది. ఉద్యోగాలు పోతాయేమోననే భయంతో అధిక శాతం మంది బయ్యర్లు.. ఫ్లాట్లను కొనడానికి ముందుకు రావట్లేదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి, ఈ సంస్థ ఎండీ శరత్ చంద్రారెడ్డి జైలులో నుంచి బెయిల్ మీద ఎప్పుడు బయటికి వస్తారో.. అరబిందో రియాల్టీ ప్రాజెక్టులపై పడిన ప్రతికూల ప్రభావం ఎప్పుడు పోతుందో? కొనుగోలుదారులు మునుపటిలా వచ్చి ఫ్లాట్లను ఎప్పుడు కొనుగోలు చేస్తారో?
This website uses cookies.