పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. రియల్ రంగంలో సరికొత్త ఉత్సాహం నెలకొంటుంది. ఈ సమయంలో ఇల్లు కొనుక్కుంటే కలిసొస్తుందని.. కలకాలం సంతోషంగా నివసించొచ్చని చాలామంది భావిస్తారు. అందుకే, ఫెస్టివల్ సీజన్‌లోనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఆరాటపడతారు. ఈ అంశాన్ని గుర్తించిన డెవలపర్లు కొత్త ప్రాజెక్టుల్ని ఇదే సమయంలో ప్రకటిస్తారు. అప్పటికే నిర్మాణాల్ని ఆరంభించిన బిల్డర్లు కొత్త ఆఫర్లను అందజేస్తారు. మరి, రియల్ రంగంలో నూతనోత్సహాం నింపే పండగ సీజన్ ఈసారి ఎలా ఉండే అవకాశముంది? ఫ్లాట్ల అమ్మకాలు పెరుగుతాయా? సరికొత్త ప్రాజెక్టులు ఆరంభమవుతాయా?
ఆషాడ మాసంలో సహజంగానే రియల్ రంగంలో అమ్మకాలు తక్కువుంటాయి. పైగా, నాలుగు వారాల్నుంచి వరుసగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టుల్ని సందర్శించే వారి సంఖ్య తగ్గింది. గత నెల రోజుల్లో కొత్తగా ఆరంభమైన ప్రాజెక్టుల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. తెల్లాపూర్‌లో మై హోమ్ సయూక్ ప్రాజెక్టు ప్రారంభమై అమ్మకాల్లో సరికొత్త రికార్డును సృష్టించింది. వ్యూహాత్మక ప్రాంతం, మంచి ప్రాజెక్టు, మెరుగైన ఆధునిక సదుపాయాలు, డెవలపర్ గత చరిత్ర.. ఇలాంటి అంశాలన్నీ గమనించిన ప్రజలు, ఇన్వెస్టర్లు పోటీపడి ఫ్లాట్లను కొనుగోలు చేశారు. కాకపోతే, నగరంలో మరే బిల్డర్ ఆ స్థాయిలో ఇప్పటివరకూ ఫ్లాట్లను విక్రయించలేదు. ఆషాడమాసం కావడంతో గత నెలలో అమ్మకాలు తగ్గుముఖం పట్టిన వాస్తవమే. కాకపోతే, శ్రావణం రాగానే కొందరు కొనుగోలుదారుల సొంతింటి విషయంలో నిర్ణయం తీసుకుంటారు.
కొత్త ఆఫర్లు..
నగరానికి చెందిన పలువురు డెవలపర్లు ఫెస్టివల్ సీజన్ సందర్భంగా రకరకాల స్కీముల్ని ప్రకటిస్తారు. ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు ఈ అంశంపై కసరత్తు జరుపుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రకటనలు అతిత్వరలో వెలువడే అవకాశముంది. ఇదే సమయంలో కొత్త ప్రాజెక్టుల్ని పలువురు బిల్డర్లు ప్రకటిస్తారు. దీంతో, కొనుగోలుదారులు నచ్చిన ప్రాజెక్టుని ఎంచుకునేందుకు వీలు లభిస్తుంది. ఇప్పటివరకూ వేచి చూసే ధోరణీని అవలబించిన వారిలో అనేక మంది.. పండగ వేళలోనే సొంతింటి ఎంపికకు సంబంధించి తుది నిర్ణయానికొస్తారు.
మీరు కొంటున్నారా?
- ముందుగా ఎక్కడ కొనాలో నిర్ణయించుకోవాలి.
- మీరు కొనాలనుకునే ఇల్లు ఆఫీసుకు ఎంత దూరం? రోజు రాకపోకల్ని సాగించేందుకు రవాణ సదుపాయం మెరుగ్గా ఉందా? అనే అంశాన్ని వాస్తవికంగా గమనించండి.
- వీలు చేసుకుని.. మీరు అనుకుంటున్న ప్రాజెక్టు సైటుకు స్వయంగా వెళ్లండి.
- అక్కడి మేనేజర్‌తో ధర గురించి నిర్దిష్ఠంగా చర్చించండి. రేటు గురించి బేరమాడి తుది నిర్ణయానికి రండి. ఇలా చేయడం వల్ల మీరు ఇల్లు కొనేందుకు ఎంత సీరియస్‌గా ఉన్నారనే విషయం అర్థమవుతంది. పైగా, అనవసరమైన ప్రాజెక్టుల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుంది.
- ఒకవేళ మీకు ఒక ప్రాజెక్టు నచ్చితే, దాన్ని గురించి మరింత లోతుగా తెలుసుకోవాలంటే సైటు విజిట్ తప్పకుండా చేయాల్సిందే.
హైఎండ్ సెగ్మంట్లో అమ్మకాలు ఫర్వాలేదు
జులై నుంచి సెప్టెంబరు త్రైమాసికంలో మొదటి రెండు నెలలు హైదరాబాద్‌లోని హై ఎండ్ సెగ్మంట్‌లో అమ్మకాలు మెరుగ్గా జరిగాయి. కోకాపేట్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో మేం చేపడుతున్న ప్రాజెక్టుల్లో.. గత క్వార్టరుతో పోల్చితే ఈసారి అమ్మకాలు రెట్టింపయ్యాయి. సహజంగానే ఈ విభాగానికి సాధారణ మార్కెట్‌తో సంబంధం ఉండదు. లగ్జరీ లివింగ్ కోరుకునే వారు మాత్రమే హై ఎండ్ కమ్యూనిటీల్లో ఎక్కువగా కొంటారు. మేం కొత్తగా కోకాపేట్ గార్ చేరువలో హైఎండ్ ప్రాజెక్టు.. కూకట్ పల్లిలో బడ్జెట్ హోమ్స్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వీటిలో మేం అనుకున్న దానికంటే బయ్యర్ల ఎంక్వయిరీలు ఎక్కువగా పెరిగాయి. అనుమతులన్నీ రాగానే వాటిని విక్రయించేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నాం.
పండగ వేళలోనూ అమ్మకాలు మెరుగ్గా జరుగుతాయని ఆశిస్తున్నాం. – వి. కృష్ణారెడ్డి, మేనేజింగ్ పార్ట్‌నర్, శ్రీ శ్రీనివాసా కన్‌స్ట్రక్షన్స్
దేశవ్యాప్తంగా పెరుగుదల
మన దేశంలో రియల్ రంగాన్ని క్షుణ్నంగా గమనిస్తే.. ఫెస్టివల్ సీజన్‌లో సహజంగానే అమ్మకాలు పెరుగుతాయి. తెలంగాణ అయినా న్యూఢిల్లీ అయినా ఇదే పోకడ కనిపిస్తుంది. ఎందుకంటే, మంచి రోజుల్లో కొత్త వస్తువు కొనాలని అనేకమంది కోరుకుంటారు. కేవలం ఇల్లే కాదు.. ఇతర కొత్త వస్తువులూ ఇప్పుడే కొనాలని అనుకునేవారు మనలో చాలామంది ఉంటారు. గత నెల ఆషాడ మాసం కాబట్టి.. చాలామంది ఫ్లాట్లను కొనలేదు. వారంతా వచ్చి శ్రావణమాసంలో కొనుగోలు చేశారు. ఇదే పోకడ వచ్చే ఏడాది ఉగాది వరకూ కొనసాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల మార్కెట్ మీద ప్రతికూల ప్రభావం పడదు. ఎన్నికల సందర్భంగా కొంత అమ్మకాలు తగ్గొచ్చేమో కానీ ఆతర్వాత మాత్రం యధావిధిగానే పెరుగుతాయి.- గుమ్మి రాంరెడ్డి, ఉపాధ్యక్షుడు, క్రెడాయ్ నేషనల్.