- నరెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్
నూతన అధ్యక్షుడు ఎం. ప్రేమ్ కుమార్
చిన్న బిల్డర్లు ఎదుర్కొనే సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎం. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఇటీవల నరెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. బహుళ అంతస్తులకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అనుమతుల్ని మంజూరు చేయాలన్నారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
నగరంలోని వివిధ ప్రాంతాల్లో 900 గజాలు లేదా ఆపై విస్తీర్ణంలో కట్టే అపార్టుమెంట్లను కట్టేటప్పుడు సెల్లార్లు తవ్వాలంటే ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సైటు పక్కన నివసించేవారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఐటీ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే, చిన్న సైట్లలో అపార్టుమెంట్లను కట్టేవారికి సెల్లార్ బదులు 2 స్టిల్ట్ ప్లస్ 5 అంతస్తులను కట్టేందుకు ఫైర్ ఎన్వోసీ లేకుండా జీహెచ్ఎంసీ అనుమతిని మంజూరు చేయాలి. ఇలా చేస్తే సెల్లార్లను తవ్వే మట్టితో నాలాలు, చెరువులను పూడ్చే పని ఉండదు. పర్యావరణం దెబ్బతినదు. కాబట్టి, ఈ అంశానికి గల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకోవాలి. ఈ చిన్న కట్టడాలకు అనుమతిని స్థానిక జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోనే మంజూరు చేయాలి. ఇలా చేస్తే.. నగరంలోని వివిధ ప్రాంతాల్నుంచి అనుమతి కోసం ప్రధాన కార్యాలయం చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది.