Categories: TOP STORIES

అగాధంలో.. అరబిందో రియాల్టీ ఇమేజ్‌?

  • కొన‌సాగాలా? ర‌ద్దు చేసుకోవాలా?
  • ఆందోళ‌న చెందుతున్న కొనుగోలుదారులు
  • కొత్త కొనుగోళ్లు క‌ష్ట‌మే ఇక‌!
  • ఖాతాల‌ను స్తంభింప‌జేస్తే మొద‌టికే మోసం!

నిన్న‌టి వ‌ర‌కూ అర‌బిందో రియాల్టీ అంటే.. హైదరాబాద్ నిర్మాణ రంగంలో అతిపెద్ద బ్రాండ్ గా అవ‌త‌రించింది. మాదాపూర్‌లో ఆరంభించిన కొహీనూర్‌, ద ప‌ర‌ల్‌.. కొండాపూర్‌లో రీజెంట్ వంటి ప్రాజెక్టుల‌ను చూస్తే ఎవ‌రికైనా మ‌తిపోవాల్సిందే. అంత‌ర్జాతీయ ఆర్కిటెక్టుతో ప్రాజెక్టుల‌ను డిజైన్ చేయించిన ఘ‌న‌త ఈ సంస్థ‌కే ద‌క్కుతుంది. ఈ సంస్థ వ‌ద్ద ఫ్లాట్లు కొనుగోలు చేసిన‌వారు.. తాము ఎంతో అదృష్ట‌వంతులుగా భావించేవారు. హైదరాబాద్‌లోనే ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులో నివ‌సిస్తామ‌నే అనుభూతిని పొందేవారు. కానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అర‌బిందో రియాల్టీ ఎండీ శ‌ర‌త్ చంద్రారెడ్డిని అరెస్టు చేయ‌డంతో కొనుగోలుదారులు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. త‌మ క‌ష్టార్జితాన్ని ఈ ప్రాజెక్టులో పెట్టుబ‌డి పెడితే.. ఈ కొత్త ట్విస్ట్ ఏమిట‌ని ఆలోచ‌న‌లో ప‌డ్డారు. అనేక మంది కొనుగోలుదారులు మార్కెటింగ్ సిబ్బందికి ఫోన్లు చేసి ఫ్లాట్లను ర‌ద్దు చేసుకుంటామ‌ని ఒత్తిడి చేస్తున్నారు. కొందరేం చేయాలో ఏం చేయాలో అర్థం కాక త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. మ‌రి, ఈ సంస్థ ఎండీ శ‌ర‌త్ చంద్రారెడ్డి అరెస్టు.. అర‌బిందో రియాల్టీ ప్రాజెక్టుల‌పై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతుంది? అందులో కొన్న‌వారి ప‌రిస్థితి ఏమిటి?

వాస్త‌వానికి చెప్పాలంటే, అర‌బిందో రియ‌ల్ సంస్థకు న‌గ‌దు నిల్వ‌ల గురించి పెద్ద‌గా ఇబ్బంది లేదని కొంద‌రు నిపుణులు అంటున్నారు. పైగా, అమ్మ‌కాల మీదే పూర్తిగా ఆధార‌ప‌డి నిర్మాణాల్ని చేప‌ట్ట‌డం లేదు కాబ‌ట్టి ప‌నుల్లో పెద్ద‌గా ఇబ్బంది ఉండ‌క‌పోవ‌చ్చ‌ని చెబుతున్నారు. కాక‌పోతే, ఈడీ గ‌న‌క అర‌బిందో రియాల్టీ బ్యాంకు ఖాతాల‌న్నీ స్తంభింపజేస్తే అస‌లుకే మోసం వ‌చ్చే ప్ర‌మాద‌ముంద‌ని అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. లిక్క‌ర్ స్కాం గురించి పూర్తిగా తేలేంత‌వ‌ర‌కూ అర‌బిందో నిర్మాణ ప్రాజెక్టుల‌న్నీ న‌త్త‌న‌డ‌క‌న కొన‌సాగే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఎందుకంటే, గ‌తంలో జ‌గ‌న్ కేసులో ఇరుక్కున ఇందూ ప్రాజెక్ట్స్ వద్ద ఫ్లాట్లు కొన్న‌వారు ఇబ్బందులు ప‌డ్డారు. స‌కాలంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. రిజిస్ట్రేష‌న్ ప‌నులు జ‌ర‌గ‌లేదు. మొత్తానికి, అందులో కొన్న‌వారు నానా క‌ష్టాలు ప‌డ్డారు. ఇప్పుడీ లిక్క‌ర్ స్కాం కూడా రాజ‌కీయాల‌తో ముడిప‌డి ఉండ‌టంతో.. ఈ కేసు ఎప్పుడు తేలుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. ఈ కంపెనీ ఖాతాల‌న్నీ స్తంభింప‌జేస్తే మాత్రం మొద‌టికే మోసం వ‌స్తుంది.

ఫ్లాట్ల ర‌ద్దు పెరుగుతుందా?

శ‌ర‌త్ చంద్రారెడ్డి అరెస్టు కావ‌డంతో ప్ర‌స్తుతం అర‌బిందో సంస్థ వ‌ద్ద ఫ్లాట్లు కొన్న‌వారిలో అధిక శాతం మంది.. కొన‌సాగాలా? వ‌ద్దా? అని ఆలోచించే అవ‌కాశ‌ముంది. త‌మ క‌ష్టార్జితానికి ఢోకా రాకుండా ఉండేందుకు.. వెంట‌నే త‌మ ఫ్లాట్ల‌ను ర‌ద్దు చేసుకునే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఇదే జ‌రిగితే గ‌న‌క‌, ఫ్లాట్ల‌ను ర‌ద్దు చేసుకున్న‌వారికి నిబంధ‌న‌ల మేర‌కు నిర్ణీత గ‌డువులోపు సొమ్మును వెన‌క్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే, గ‌తంలో వైఎస్ జ‌గ‌న్ కేసులో ఇలాగే ఇరుక్కుపోయిన ఇందూ ప్రాజెక్ట్స్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన‌వారు నానా ఇబ్బందులు ప‌డ్డారు. సకాలంలో నిర్మాణాలు పూర్తి కాలేదు. ఫ్లాట్ల రిజిస్ట్రేష‌న్లు నిర్ణీత గ‌డువులోపు పూర్తి కాలేదు. కాబ‌ట్టి, ఈ సంస్థ వ‌ద్ద కొన్న‌వారు ఇబ్బందులు వ‌ద్ద‌నుకుని.. త‌మ ఫ్లాట్ల‌ను ర‌ద్దు చేసుకోవ‌చ్చు.

కొత్త కొనుగోలుదారులు డౌటే!

లిక్క‌ర్ స్కాంలో అరబిందో సంస్థ ఎండీ ఇరుక్కుపోవ‌డంతో.. ఈ కంపెనీ ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొన‌డానికి కొత్త‌గా కొనుగోలుదారులు ముందుకు రాక‌పోవ‌చ్చు. ఫ్లాట్లు కొనుగోలు చేశాక‌.. రేపొద్దున జ‌ర‌గ‌రానిది జ‌రిగితే ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంద‌నే భ‌యంతో.. బ‌య్య‌ర్లు ఫ్లాట్లు కొనేందుకు ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌చ్చు. ఏ సంస్థ‌కైనా ప్రాణం ఎండీయే కాబ‌ట్టి.. అత‌నే జైలులో కూర్చుంటే.. ఇక్క‌డి కార్య‌క‌లాపాల‌న్నీ చ‌క్క‌బెట్టేదెవ‌రు? ప్ర‌తిరోజు అటు నిర్మాణ కార్య‌క‌లాపాల్ని ప‌ర్య‌వేక్షించ‌డంతో పాటు అమ్మ‌కాల‌పై దృష్టి సారించాల్సి ఉంటుంది. నాణ్య‌తా ప్ర‌మాణాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నించ‌క త‌ప్ప‌దు. వివిధ స్థాయిలో వెండార్ల‌తో మాట్లాడాలి. బ్యాంక‌ర్ల‌తో నిత్యం సంప్ర‌దింపులు జ‌రుపుతూ నిధుల‌కు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. ఈ ప‌నుల‌న్నీ చేయాల్సిన ఎండీ జైలులో కూర్చుంటే.. ఇవ‌న్నీ ఎవ‌రు చ‌క్క‌బెడ‌తారు చెప్పండి?

ప‌క్క ప్రాజెక్టుల‌కు పండ‌గే!

హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో అర‌బిందో రియాల్టీ అతిపెద్ద బ్రాండ్‌గా అవ‌త‌రిస్తోంది. పాతిక‌, ముప్ప‌య్యేళ్ల నుంచి న‌గ‌రంలో నిర్మాణాల్ని చేప‌డుతున్న కంపెనీల‌ను ప‌క్క‌కు నెట్టేసి.. అతి త‌క్కువ కాలంలోనే ఎక్క‌డ్లేని బ్రాండ్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఎందుకంటే, ఈ కంపెనీ అత్యుత్త‌మ లొకేష‌న్ల‌లో ప్రాజెక్టుల‌ను చేప‌ట్ట‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. మాదాపూర్‌లో కొహినూర్‌, ద ప‌ర‌ల్‌.. కొండాపూర్‌లో రీజెంట్ ప్రాజెక్టుల‌ను చూస్తేనే ఈ విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలో అర‌బిందో సంస్థ ఎండీ లిక్క‌ర్ స్కాంలో ఇరుక్కుపోవ‌డంతో.. బ్రాండ్ ఇమేజ్ కాస్త ఒక్క‌సారిగా పాతాళానికి చేరుకుంది. దీంతో, బయ్య‌ర్లు ఈ సంస్థ వ‌ద్ద ఫ్లాట్లు కొన‌డం నిలిపివేసే అవ‌కాశం లేక‌పోలేదు. ఎందుకంటే, ఇబ్బందుల్లో ఉన్న ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొని ఇరుక్కుపోవాల‌ని ఎవ‌రైనా ఎందుకు కోరుకుంటారు? అందుకే, ఈ సంస్థ ఎండీ స్వ‌యంకృత‌ప‌రాధం వ‌ల్ల.. ఇంటి బ‌య్య‌ర్లు అర‌బిందో వ‌ద్ద కాకుండా.. అక్క‌డి చుట్టుప‌క్క‌ల ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల‌ను కొనుగోలు చేసే అవ‌కాశం లేక‌పోలేదు. ఎందుకంటే, బ‌య్య‌ర్లు ఎప్పుడైనా పూర్త‌య్యే ప్రాజెక్టునే కొంటారు త‌ప్ప‌.. తెలిసీతెలిసీ ఇబ్బందుల్లో ఉన్న‌వాటి జోలికి వెళ్ల‌ర‌నే విష‌యం తెలిసిందే. ఎందుకంటే, గ‌తంలో రాజ‌కీయాల కార‌ణంగా అరెస్టు అయిన వైఎస్ జ‌గ‌న్, గాలి జ‌నార్ధ‌న్ రెడ్డిలు కొన్ని నెల‌ల పాటు జైలులో ఊచ‌లు లెక్క పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో లిక్క‌ర్ స్కాంలో ఇరుక్కున్న శ‌ర‌త్ చంద్రారెడ్డి ఎంత‌కాలం తిహార్ జైలులో ఉంటారో తెలియాలంటే మ‌రికొంత‌కాలం వేచి చూడాల్సిందే. కాబట్టి, అనేక‌మంది బ‌య్య‌ర్లు త‌మ ఆలోచ‌నా ధోర‌ణీని మార్చుకునే అవ‌కాశముంది.

This website uses cookies.