ఎలాగైనా ప్రజల్నుంచి సొమ్ము లాగేయాలి..
ఆశ చూపెట్టో.. వారి డబ్బుల్ని దోచుకోవాలి..
ఇదే కొందరి ప్రబుద్ధుల లక్ష్యంగా కనిపిస్తోంది..
ముందు వారి నుంచి డబ్బులు తీసేసుకుంటే..
తర్వాత కట్టినట్లు కొంతకాలం నటిస్తే చాలు..
మరీ ఎవరైనా ఒత్తిడి చేస్తే వెనక్కి ఇచ్చేద్దాం..
ఇలా సాగినంతకాలం ఒక ఆటాడుకుందాం..
కొందరు ప్రబుద్ధులకు రియల్ రంగంలో సులువుగా సొమ్ము సంపాదించొచ్చనే విషయం అర్థమైంది. రేటు తక్కువంటే చాలు ఎగబడి కొంటారని.. వంద శాతం సొమ్ము ఇస్తారని తెలిసింది. వారి పెట్టుబడికి అధిక వడ్డీ ఇస్తామన్నా జనాలు ఎగబడతారని అవగతమైంది. ఈ క్రమంలో కొందరు ఏజెంట్లు రియల్టర్లుగా అవతారమెత్తారు. గత మూడేళ్ల నుంచి ప్రజల వద్ద నుంచి సొమ్ము లాగుతూ.. పర్మిషన్లు రావట్లేదంటూ పబ్బం గడుపుతున్నారు. ప్రీలాంచులపై ప్రజల్లో కొంత అవగాహన పెరిగింది. అందుకే, కొందరు అక్రమార్కులు సరికొత్త స్కీముకు తెరలేపారు. అదేమిటంటే.. ప్లాటు కొంటే నెలకు పది నుంచి పాతిక వేలు అద్దె ఇస్తారనే ప్రచారాన్ని సోషల్ మీడియాలో ఆరంభించారు.
ప్లాట్లు కొంటే వంద నెలల పాటు అద్దె రావడమేమిటని ఆరా తీయగా.. విస్తుగొలిపే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రియల్టర్లు ఏం చెబుతున్నారంటే.. ఎవరైనా తమ వద్ద 2 గుంటలు లేదా 5 గుంటల్లో స్థలం కొంటే.. ఆస్ట్రేలియా టేకు చెట్లను ఇస్తారట. 2 గుంటల స్థలం కొంటే పది ఆస్ట్రేలియా టేకు చెట్లు, 5 గుంటల స్థలం కొంటే పాతిక టేకు చెట్లను ఇస్తారట. వాటి ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం గిట్టుబాటు అవుతుందట. హైదరాబాద్ వాతావరణంలో ఆస్ట్రేలియా టేకు చెట్లు పెరుగుతాయా?
This website uses cookies.