రెజ్ న్యూస్, హైదరాబాద్: శంషాబాద్, నార్సింగి వంటి ప్రాంతాల్లో హెచ్ఎండీఏ అధికారులు అక్రమార్కులపై విరుచుకుపడ్డారు. యాభైకి పైగా ఎకరాల భూమిని కబ్జా నుంచి విముక్తి కలిగించారు. ఇటీవల వేకువ జామున మూడు గంటల్నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ఆరంభించడం విశేషం. కాకపోతే, 111 జీవో ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ ఎందుకు దృష్టి సారించట్లేదు?
ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేశారని చాలామంది భావిస్తున్నారు. కానీ, ప్రభుత్వం తెలివిగా ఆ జీవోలోని మూడో పేరాగ్రాఫ్ ను తొలగించి కొత్తగా 69 జీవోను విడుదల చేసింది. ఈ అంశంపై పర్యావరణవేత్తలు కోర్టులను ఆశ్రయించారు. గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం 111 జీవో అంశంపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఈ మొత్తం ప్రాంతానికి ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో తెలిపారు. కాకపోతే, ఆ మాస్టర్ ప్లాన్ వచ్చేలోపు ఈ ప్రాంతమంతా మరో హుస్సేన్ సాగర్ తయారువుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు భవనాల్ని నిర్మిస్తున్నారు. అంతెందుకు బఫర్ జోన్లనూ వదలడం లేదు. ఇలా, ఎక్కడ పడితే అక్కడ కొత్త నిర్మాణాలు ఆరంభం కావడంతో.. ఈ ప్రాంతమంతా మురికికూపంగా మారేందుకు ఎక్కువ సమయం పట్టదని ప్రజలు అంటున్నారు.
This website uses cookies.