Categories: TOP STORIES

నిర్మాణ వ్యర్థాల ఆటోమేటిక్ ప్లాంటు

    • రూ.1.74 కోట్లతో అంచనాలు సిద్ధం

చండీగఢ్ లో ప్రస్తుతం మాన్యువల్ గా పనిచేస్తున్న నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల (సీఅండ్ డీ) ప్లాంటును ఆటోమేటిక్ ప్లాంటుగా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ దీనికి సంబంధించి దాదాపు రెండు నెలలపాటు కసరత్తు చేసి రూ.1.74 కోట్లతో తుది అంచనాలు సిద్ధం చేసింది.

ఆటోమేటిక్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే.. ప్రస్తుతం ఈ ప్లాంటు నుంచి ఉత్పత్తి అవుతున్న మెటీరియల్ ఐదు నుంచి ఆరు రెట్లు పెరుగుతుందని అంచనా వేశారు. ఈ పనికి సంబంధించి వచ్చేవారం టెండర్లు పిలవనున్నారు. ఈ ప్లాంటు ఆటోమేటిక్ అయిన తర్వాత గరిష్ట స్థాయిలో మెటీరియల్ ఉత్పత్తి చేస్తుందని ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు. నగరంలో గరిష్ట స్థాయిలో ముడి మెటీరియల్ దొరకుతుండటం కూడా ఈ ప్రాజెక్టు చేపట్టడానికి మరో కారణం. ఈ ప్లాంటు నుంచి ఉత్పత్తి అయ్యే మెటీరియల్ ను మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం పలు పనుల్లో వినియోగిస్తుంటుంది. ‘నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను ఈ ప్లాంటు రీసైకిల్ చేసి నిర్మాణ రంగానికి అవసరమైన కాంక్రీట్ తరహా కొన్ని రకాల పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని మున్సిపల్ కార్పొరేషన్ పలు పనుల్లో వాడుతుంది’ అని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇప్పటికే సీఅండ్ డీ వేస్ట్ పాలసీకి సంబంధిచి ముసాయిదా నిబంధనలు రూపొందించారు. దీని ప్రకారం ఇండస్ట్రియల్ ఏరియాలోని ఈ ప్లాంటుకు నగర ప్రజలు తమ నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను తీసుకుని వచ్చే సౌకర్యం ఉంది. ఒక్క చండీగఢ్ లోనే కాకుండా పంచకుల, మోహలిలోని వ్యర్థాలను కూడా ఇక్కడకు తీసుకురావడానికి అనుమతించనున్నారు.

This website uses cookies.