నీళ్లు లేకుంటే జీవితం గడవదు. దైనందిన కార్యకలాపాలన్నింటికీ నీరు చాలా ముఖ్యం. అయితే, నగరాల్లోని చాలా అపార్ట్ మెంట్లలో నీటి సమస్య కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి చెక్ చెప్పేందుకు కర్ణాటక రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథార్టీ (కె-రెరా) కీలక నిర్ణయం తీసుకుంది. బిల్డర్లు నిర్మించబోయే భవనాలకు నీటి సౌకర్యం ఉన్నట్టు చూపిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రకటించింది.
కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఈ విషయంలో బిల్డర్లు విఫలమైతే.. అనుమతులు ఇవ్వబోమని తేల్చిచెప్పింది. బిల్డర్లు తమ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పత్రాలను కె-రెరాకు ఆన్ లైన్ లో సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అధికారులు వాటిని పరిశీలించిన తర్వాత కె-రెరా రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. ఇక రియల్ ఎస్టేట్ డెవలపర్లు దరఖాస్తు చేసుకునే ముందు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు లేదా గ్రామాల్లో అయితే సంబంధిత పంచాయతీల నుంచి తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చేస్తే సరిపోయేది. కానీ చాలామంది నీటి వసతి కల్పించకుండా వెళ్లిపోయేవారు. దీంతో అక్కడ ఇళ్లు కొనుక్కున్నవారంతా నీటి సమస్యలతో సతమతమయ్యేవారు. ఈ నేపథ్యంలో వాటర్ బోర్డులు లేదా పంచాయతీల నుంచి ఎన్ఓసీ తీసుకుంటేనే అనుమతి ఇవ్వాలని రెరా నిర్ణయించింది.
బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) పరిధిలో బోలెడు ఆకాశ హర్మ్యాలు ఉన్నాయి. తమ పరిధిలోకి వచ్చే బహుళ అంతస్తుల భవనాలకు నీటి వసతి ఉందో లేదో చూసిన తర్వాతే అనుమతులు ఇచ్చినట్టు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు అధికారి తెలిపారు. అలాగే 110 గ్రామాల్లో ఉన్న భవనాలకు 2023 తర్వాత వాటర్ సప్లై కనెక్షన్ వస్తుందనే విషయాన్ని స్పష్టంచేసినట్టు వెల్లడించారు. కాగా, సీవరేజి బోర్డు లేదా పంచాయతీలు నీటి సరఫరా చేయలేని పక్షంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన బాధ్యత బిల్డర్లదేనని కె-రెరా స్పష్టంచేసింది. లేదా ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాలని సూచించింది. చాలా అపార్ట్ మెంట్ కాంప్లెక్సులు నీటి కొరతతో సతమతమవుతున్నాయి. దీంతో సదరు అసోసియేషన్లు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు.
This website uses cookies.