- ఆకర్షణీయమైన సెషన్లు
- స్ఫూర్తినిచ్చిన ప్రసంగాలు
- ఆకట్టుకున్న విజేతల అనుభవాలు
- సరికొత్త సవాళ్లు, పరిష్కారాలపై
పెరిగిన అవగాహన - కొత్త డెవలపర్లకు విలువైన సూచనలు
- వచ్చే నాట్ కాన్ వరకూ అదే ఉత్సాహం
(అబుదాబి నుంచి కింగ్ జాన్సన్ కొయ్యడ)
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత.. అబుదాబిలో క్రెడాయ్ నాట్ కాన్ 2022 ఘనంగా జరిగింది. ఇండియా నేషన్ ఆఫ్ థ ఫ్యూచర్ అనే థీమ్ ను ఈసారి ఎంచుకున్నారు. టెక్నికల్ సెషన్ల అమితంగా ఆకర్షించాయి. భారతదేశంలోని వివిధ నగరాల నుంచి దాదాపు పదమూడు వందలకు పైగా డెలిగేట్లు పాల్గొన్నారు. క్రెడాయ్ ఎంసీహెచ్ఐ హోస్ట్ చేసిన ఈసారి నాట్ కాన్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సెషన్లు ప్రతిఒక్కర్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. నిర్మాణ రంగంలో రియల్ ఎస్టేట్ నెట్ వర్కింగ్ కి ఈ కార్యక్రమం ఉపయోగపడింది. పాత మిత్రులను కలుసుకునేందుకు వీలు కలిగింది.
రియల్ రంగంలో నూతన పోకడలపై అవగాహన పెంచుకునేందుకు అవకాశం కలిగింది. ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాల డెవలపర్లకు నాట్ కాన్ సదస్సు సరికొత్త స్ఫూర్తినిచ్చింది. నిర్మాణ రంగం ఎదుర్కొనే సరికొత్త సవాళ్లు, వాటి పరిష్కారాలపై చర్చ జరిగింది. రియల్ మార్కెట్ డైనమిక్స్ ను అర్థం చేసుకునేందుకు ఈ సదస్సు ఉపయోగపడింది. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన నిపుణులు పలు అంశాలపై తమ అభిప్రాయాల్ని తెలియజేశారు.
భవిష్యత్తులో భవనాల సుస్థిరత, డేటా సెంటర్ల పెరుగుదల, వేర్ హౌసింగ్, అర్బనైజింగ్ ఫ్యూచర్ సిటీస్ వంటి అంశాలపై జరిగిన సెషన్ల ద్వారా అనేక కొత్త విషయాల్ని తెలుసుకున్నారు. హరేక్రిష్ణ ఎక్స్ పోర్ట్స్ ఫౌండర్ సావ్జీ ధోలాకియా ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. లూలూ గ్రూఫ్ ఛైర్మన్ యూసుఫ్ అలీ, శోభా డెవలపర్స్ ఫౌండర్ పీఎన్ సీ మీనన్, క్రికెటర్ సౌరవ్ గంగూలీ, ప్రముఖ నటుడు ఫర్హాన్ అక్తర్ తదితరుల సెషన్లు ప్రతిఒక్కర్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. వీరి ప్రసంగాలు ఆహుతుల్ని అమితంగా ఆకర్షించాయి.
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి మరియు సంపూర్ణ పద్ధతిలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎలా అనుసరించాలి అనే అంశంపై ల్యూక్ కౌటిన్హో ఆకట్టుకునేలా మాట్లాడారు. ఒత్తిడిని అధిగమించేందుకు ఆయన అమూల్యమైన సలహాలిచ్చారు. థైరో కేర్ ఫౌండర్ డాక్టర్ వేలుమని తనదైన శైలిలో నవ్వులు పూయించారు. ఈ సెషన్ కు మోడరేటర్గా క్రెడాయ్ నేషనల్ ఉపాధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి వ్యవహరించారు. ఒరిస్సాకు చెందిన ఓయో రూమ్స్ ఎండీ రితేష్ సాగర్ అనుభవ పాఠాల నుంచి సభికులు స్ఫూర్తి పొందారు. మొత్తానికి, ఇలాంటి అనేక ఉపయోగకరమైన సెషన్ల ద్వారా నాట్ కాన్ 2022 అద్భుతంగా జరిగింది.
తెలుగు రాష్ట్రాల నుంచి..
క్రెడాయ్ నాట్ కాన్ 2022 కార్యక్రమానికి క్రెడాయ్ తెలంగాణ, క్రెడాయ్ హైదరాబాద్ సభ్యులు విశేషంగా పాల్గొన్నారు. క్రెడాయ్ జాతీయ ఉపాధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు మురళీకృష్ణా రెడ్డి, గిరిధారి హోమ్స్ ఎండీ ఇంధ్రసేనారెడ్డి, వర్టెక్స్ హోమ్స్ జేఎండీ మురళీమోహన్, సుమధుర గ్రూప్ ఎండీ, వైస్ ఛైర్మన్.. మధుసూధన, రామారావు, ప్రణవ గ్రూప్ ఎండీ బూర్గు రవి కుమార్, మారం సతీష్, క్రెడాయ్ కరీంనగర్ కు చెందిన అజయ్ కుమార్, క్రెడాయ్ తిరుపతికి చెందిన రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
కంగ్రాట్స్.. క్రెడాయ్ ఎంసీహెచ్ఐ
అబుదాబిలో నాట్ కాన్ కార్యక్రమాన్ని క్రెడాయ్ ఎంసీహెచ్ఐ అద్భుతంగా నిర్వహించింది. మూడు రోజుల పాటు జరిగిన సెషన్లను పక్కా ప్రణాళికలతో జరిపారు. నాట్ కాన్ 2022 కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరిలో సరికొత్త స్ఫూర్తి నిండింది. ప్రతిఒక్క స్టేక్ హోల్డర్లో సరికొత్త ఆత్మవిశ్వాసం పెరిగేందుకు దోహదపడింది. స్పీకర్ల సెలక్షన్ చాలా బాగుంది. డా. వేలుమణి, పీఎన్సీ మీనన్, ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్, గంగూలీ, ఫర్హాన్ అక్తర్ వంటి వారు అనుభవాల్ని పంచుకునేటప్పుడు సభ మొత్తం కిక్కిరిసిపోయింది. మొత్తానికి క్రెడాయ్ నాట్ కాన్ విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
– గుమ్మి రాంరెడ్డి, వైస్ ప్రెసిడెంట్, క్రెడాయ్ నేషనల్.