(అబుదాబి నుంచి కింగ్ జాన్సన్ కొయ్యడ)
క్రికెటర్ అయినా బిల్డర్ అయినా.. ఒత్తిడిని అలవాటు చేసుకోవాలి. దాన్ని తట్టుకుని ధైర్యంగా నిలబడితేనే ఆశించిన ఫలితం వస్తుంది. వ్యాపారంలో విజయం సాధిస్తాం. కంఫర్ట్ జోన్లో ఉంటే కోరుకున్న ఫలితం ఎన్నటికీ రాదు. ఒత్తిడి ఉంటేనే సరైన మార్గంలో ముందుకు వెళ్లేందుకు అలవాటు పడతాం. కాబట్టి, ఒత్తిడిని ఎప్పుడు ప్రతికూలంగా భావించొద్దు. దాన్ని కూడా పాజిటివ్ తీసుకోవాలి అని భారత్ మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. అబుదాబీలో జరిగిన క్రెడాయ్ నాట్ కాన్ 2022 కార్యక్రమానికి విచ్చేసిన ఆయన.. భారత డెవలపర్లను ఉత్తేజపరిచేలా పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. సారాంశం ఆయన మాటల్లోనే..
‘‘ డెవలపర్లు మార్కెట్లో నిత్యం పోటీ పడాల్సి ఉంటుంది. మంచి డీల్స్ దొరికేందుకు ప్రయత్నిస్తుంటారు. తమ బ్రాండ్ కు మంచి విలువ రావాలని తపన పడుతుంటారు. కంపెనీ మెరుగైన ఫలితాలు రావాలని ఆశిస్తారు. ఇలాంటప్పుడు పెరిగే ఒత్తిడిని తట్టుకోవాలంటే దూకుడుగా వ్యవహరించాలి. ఒక క్రికెట్ ఆటగాడిలా.. భారత క్రికెట్ కెప్టెన్ గా తాను అలాంటి ఒత్తిడిని ఎదుర్కోన్నా.. దూకుడుగా వ్యవహరించే మైండ్ సెట్ ను అలవర్చుకున్నా.. మెక్ గ్రాత్, షోయబ్, బ్రెట్ లీ వంటి ఫేస్ బౌలర్లు.. ఎంత వేగంగా బంతిని విసిరితే అంతే వేగంగా కొట్టాలని నిర్ణయించుకున్నా.. అందుకే, భారత్ క్రికెట్ జట్టుకు చిరస్థాయిగా నిలిచిపోయేలా సేవలను అందించాను. కొన్నిసార్లు జీవితంలో మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్లు చాలామంది తారసపడతారు. అభివృద్ధికి అడ్డుపడతారు. కాబట్టి, మనం చాలా స్పష్టంగా ఉండాలి.
నా దారి లేక.. రహదారి?
లీడర్ ఎప్పుడూ తన ఆలోచనలకు అనుగుణంగా పనులు జరగాలని కోరుకుంటారు. కాకపోతే, అతని కింద పని చేసే వారి ట్యాలెంట్ ని ప్రోత్సహించాలి. వారు స్వేచ్ఛగా పని చేసే వాతావరణాన్ని కల్పించాలి. నియంత్రించేందుకు ప్రయత్నించకూడదు. వారి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు క్రుషి చేయాలి. వారేం చెబుతున్నారే అర్థం చేసుకోవాలి. బృంద సభ్యుల అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే వాతావారణాన్ని కంపెనీలో కల్పించాలి. వారి మీద నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంతే తప్ప.. మై వే ఆర్ హైవే.. నా దారి లేక రహదారి అని భావించకూడదు. వారిలో ఉన్న ఫియర్ ఫ్యాక్టర్ ని దూరం చేయాలి. వారి నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఇవ్వకపోతే.. మెరుగైన ఫలితాలు రాకపోవచ్చు. భారత్ జట్టులో మెరుగైన బ్యాటింగ్ లైనప్ ఉండటంతో.. ఆరంభంలో సెహ్వాగ్ కి బ్యాటింగ్ చేయడానికి పెద్దగా అవకాశం వచ్చేది కాదు. అప్పుడు ఓపెనింగ్ చేయమని ప్రోత్సహించాను. తన కెరీర్ పాడు చేస్తావా? అని తను ఎదురు ప్రశ్న వేశాడు. అయినా, అతని ట్యాలెంట్ మీద నమ్మకం ఉండటంతో.. ఒకసారి ప్రయత్నించు అన్నాను. విఫలమైతే మళ్లీ కింది స్థాయిలో బ్యాటింగ్ చేయవచ్చని చెప్పాను. ఇక ఆ తర్వాత వీరు ఎలాంటి చరిత్ర సృష్టించాడో మీ అందరికీ తెలిసిందే. కాబట్టి, లీడర్లు తమ సభ్యుల ట్యాలెంట్ ని గుర్తించాలి. వారిని సరైన రీతిలో ప్రోత్సహించాలి. అప్పుడే, అద్భుతాలు సాధ్యమవుతాయి.
లీడర్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. ఎప్పుడో ఐదేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తప్పు అని ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. అప్పట్లో ఆ నిర్ణయం కరెక్టు.. ఇప్పుడేమో చేయాలో ఆలోచించాలి. అంతేతప్ప, పాత నిర్ణయాల గురించి ప్రస్తుతం చింతించడం కరెక్టు కాదు. మొత్తానికి, నాట్ కాన్ 2022 సదస్సుకి నన్ను ఆహ్వానించినందుకు… మీతో ఇలా గడపటానికి నాకెంతో సంతోషంగా ఉంది.
క్రికెటర్ కాకపోయి ఉంటే..
ఒకవేళ క్రికెటర్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారని ఒక బిల్డర్ అడిగిన ప్రశ్నకు గంగూలీ సమాధానమిస్తూ.. నన్ను కూడా మా వాళ్లు బిల్డింగ్ ఇండస్ట్రీలో చేర్పించేవారేమో.. మీతో బాటు నేను కూడా బిల్డర్ అయ్యి.. బిల్డింగులు కట్టేవాడినేమో అంటూ చమత్కరించారు.