Categories: TOP STORIES

సొంతింట్లోకి వెళతారా? కోర్టుల చుట్టూ తిరుగుతారా?

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌: హైద‌రాబాద్ నిర్మాణ రంగం ప్ర‌స్తుతం ఓ క్లిష్ట‌మైన స‌మ‌స్య‌ను ఎదుర్కొంటోంది. ప్ర‌పంచ చ‌రిత్ర‌ను క్రీస్తు పూర్వ‌, క్రీస్తు శ‌కం లా విభ‌జించిన‌ట్లే.. హైద‌రాబాద్ నిర్మాణ రంగాన్ని రెరా, నాన్ రెరా ప్రాజెక్టులుగా విభ‌జించాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. ఒక‌దాంట్లో కొంటే రాజ‌సం.. మ‌రోదాంట్లో కొంటే మోసం.. ముక్కూమొహం తెలియ‌ని బిల్డ‌ర్‌తో సొమ్ము పెట్టుబ‌డిగా పెట్టి ఇబ్బందుల్లో ప‌డ‌తారో? ఖ‌ర్చు ఎక్కువైనా ఫ‌ర్వాలేదంటూ రెరా ప్రాజెక్టుల్లోనే ఫ్లాట్ల‌ను కొనుగోలు చేసి.. సొంతింట్లోకి అడుగుపెడ‌తారో మీ ఇష్టం. అందుకే, ఈ రెండింటి మ‌ధ్య గ‌ల తేడాను మీకు స్ప‌ష్టంగా వివ‌రిస్తున్నాం. దీన్ని బ‌ట్టి మీరు తుది నిర్ణ‌యానికి రావొచ్చు. మ‌రి, మీరు ఎటువైపు ఉంటారో మీరే నిర్ణ‌యం తీసుకోండి.

రెరాలో కొంటే.. ఇవీ ప్రయోజనాలు

  • స‌కాలంలో నిర్మాణం పూర్తి అవుతుంది
  • చెప్పిన గ‌డువులోపు బిల్డ‌ర్ పూర్తి చేయ‌క‌పోతే, కొనుగోలుదారులు ఫిర్యాదు మేర‌కు త‌గిన చ‌ర్య‌ల్ని తీసుకుంటుంది.
  • నిర్మాణం పూర్త‌య్యి.. ఆక్యుపెన్సీ వ‌చ్చిన త‌ర్వాత ఐదేళ్ల‌లోపు స్ట్ర‌క్చ‌ర్‌లో ఎలాంటి నిర్మాణ లోపాలున్నా బిల్డ‌రే మ‌ర‌మ్మ‌తులు చేయించాల్సి ఉంటుంది.
    రెరా ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుగోలు చేస్తే.. అందులో కొనుగోలుదారుడిగానే మిగిలిపోతారు.
  • కొనుగోలుదారులకు కార్పెట్ ఏరియా ఎంతొస్తుందో తెలుస్తుంది.
  • బిల్డర్ సకాలంలో నిర్మాణం పూర్తి చేయకున్నా.. కొనగోలుదారులు సకాలంలో చెల్లింపులు జరపకున్నా.. ఇద్దరిపై వడ్డీ పడుతుంది.
  • బయ్యర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ఇతర ప్రాజెక్టులకు మళ్లించే అవకాశమే లేదు.
  • కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో జమ చేయాలి. అందులో నుంచి నిర్మాణ పనులు నిమిత్తం కేవలం 70 శాతం సొమ్మును ఖర్చు పెట్టాలి. దీనికి సివిల్ ఇంజినీర్, ఆర్కిటెక్టు, ఛార్టెడ్ అకౌంటెంట్ ధృవీక‌రించాలి.
  • ఒకవేళ బిల్డర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే కొనుగోలుదారులు ఆ ప్రాజెక్టులో నుంచి బయటికి వచ్చేయవచ్చు.
  • ప్రాజెక్టు వ్యయంలో పది శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని కొనుగోలుదారుల నుంచి బిల్డర్ వసూలు చేయకూడదు.
  • బయ్యర్లు, బిల్డర్ల మధ్య నెలకొన్న వివాదాల్ని పరిష్కరించేందుకు ప్రత్యకంగా ఆథారిటీని ఏర్పాటు చేయాలి.
  • ఒకవేళ రెరా అథారిటీ నుంచి పరిష్కారం కాకపోతే, బిల్డర్ ట్రిబ్యునల్ ని
    సంప్రదించొచ్చు.

యూడీఎస్, ప్రీలాంచ్లో కొంటే జరిగే నష్టమిది..

• నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో కచ్చితంగా చెప్పలేం.
• సకాలంలో పనులు జరగకపోతే, ఎవరికీ ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండదు.
• అలాంటి ఆశలేం పెట్టుకోకండి. ప్రీలాంచ్లో కొనడం వల్ల ఈ అవకాశం కోల్పోతాం.
• యూడీఎస్ ప్రాజెక్టులో కొంటే.. బిల్డరుతో పాటు సహయజమానిగా అవుతాం. ఫలితంగా, బిల్డర్ ఒకవేళ సకాలంలో ఫ్లాటు కట్టకపోయినా, మధ్యలో వదిలేసి పారిపోయినా, మిగతా సభ్యులంతా వచ్చి యూడీఎస్లో కొన్నవారి మీద పడతారు.
• యూడీఎస్, ప్రీలాంచులో కొనేముందు ఒకటి చెబుతారు. ఆతర్వాత ప్లాన్లు మారిపోతాయి. బాచుపల్లిలో అర్బన్ రైజ్ ప్రాజెక్టే ఇందుకు చక్కటి ఉదాహరణ.
• బిల్డర్ సకాలంలో పూర్తి చేయకపోతే, అతన్ని నిలదీయలేని పరిస్థితి. అతని దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.
• బయ్యర్ల నుంచి వసూలు చేసే సొమ్మును ఎలా ఖర్చు పెట్టుకున్నా అడిగే నాధుడే ఉండరు. ఒకవేళ కొనుగోలుదారులు ధైర్యం చేసి అడిగినా, నీకేందుకు అంటూ లైట్ తీసుకుంటారు.
• ముందస్తుగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే, అందులో నుంచి బయటికి రాలేరు.
• ముందస్తుగానే కొనుగోలుదారుల్నుంచి వంద శాతం సొమ్ము వసూలు చేస్తారు.
• బయ్యర్లు, బిల్డర్ల మధ్య నెలకొన్న వివాదాల్ని పరిష్కరించేందుకు ఎలాంటి అథారిటీ ఉండదు. ఒకవేళ రెరాకు ఫిర్యాదు చేసినా స్పందించే అవకాశం తక్కువ.
• బిల్డరుతో సమస్యలుంటే.. వాటి పరిష్కారానికి రెరాకు వెళ్లినా పట్టించుకోరు.

This website uses cookies.