- 2030 నాటికి కొత్తగా పది లక్షల పడకలు
- కొలియర్స్ నివేదిక వెల్లడి
దేశంలో కో లివింగ్ విభాగం దూసుకెళ్తోంది. ప్రస్తుతం మూడు లక్షల పడకలు కలిగిన ఈ విభాగం.. 2030 నాటికి అదనంగా పది లక్షల పడకలను జోడించే అవకాశం ఉందని కొలియర్స్ తాజా నివేదిక అంచనా వేసింది.
పట్టణీకరణ, నగరాలకు వలసలు పెరగడంతోపాటు విద్యార్థులు, యువ నిపుణులు అందుబాటు ధరలో సౌకర్యవంతమైన కమ్యూనిటీ ఆధారిత వసతి కోరుకోవడం ఎక్కువ కావడంతో కో లివింగ్ ఊపందుకుంది. ప్రస్తుతం కో లివింగ్ లో దాదాపు 3 లక్షల పడకలు ఉన్నాయి. ఇది మొత్తం అన్ని రకాల వసతుల్లో 5 శాతం మాత్రమే. 2030 నాటికి ఇది పది లక్షల పడకలకు చేరుతుందని అంచనా. అంటే.. అది పది శాతానికి చేరుతుంది. 2025 నాటికి కోలివింగ్ పడకల డిమాండ్ 6.6 మిలియన్లుగా అంచనా వేయగా.. 2030 నాటికి 9.1 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. సంప్రదాయ అద్దె ఎంపికలతో పోలిస్తే.. కో లివింగ్ ఎంచుకోవడం వల్ల 20 నుంచి 35 శాతం మేర ఆదా అవుతుంది.
బెంగళూరును పరిశీలిస్తే.. అక్కడ కో లివింగ్ నెలవారీ అద్దె సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11,700 నుంచి రూ.23,700 వరకు ఉంటాయి. సింగిల్ బీహెచ్ కే యూనిట్ ధర రూ.15,500 నుంచి రూ.36,500 వరకు ఉంటాయి. ముంబైలో కో లివింగ్ అద్దెలు నెలకు రూ.15,200 నుంచి రూ.27,500 వరకు ఉంటాయి. సింగిల్ బీహెచ్ కే కి రూ.19 వేల నుంచి రూ.42 వేలు చెల్లించాలి. ఢిల్లీలో కో లివింగ్ కోసం రూ.11,300 నుంచి రూ.24 వేల వరకు వెచ్చించాలి.
ALSO READ: విల్లా స్వాధీనంలో జాప్యం.. 12 ఏళ్ల తర్వాత ఉపశమనం
అదే సింగిల్ బీహెచ్ కే కోసం రూ.15 వేల నుంచి రూ.37 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది కో లివింగ్ వైపు మొగ్గు చూపిస్తున్నారని నివేదిక పేర్కొంది. “కో-లివింగ్ రంగంలో పెట్టుబడిదారుల భాగస్వామ్యం, ఆపరేటర్ విస్తరణకు ఊతం ఇచ్చేలా గణనీయమైన పెరుగుల అంచనా వేశారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి మార్కెట్ వ్యాప్తి ప్రస్తుతం 5% నుంచి 10% కంటే ఎక్కువగా అవుతుందని ఆశిస్తున్నాం’ అని కొలియర్స్ సీఈఓ బాదల్ యాగ్నిక్ పేర్కొన్నారు.