ప్రాపర్టీ షో ద్వారా.. వంద స్టాళ్లు.. పదిహేను వందల ప్రాజెక్టులతో హైదరాబాద్ రియల్ రంగం ముఖచిత్రాన్ని ప్రజల ముందు ఉంచినందుకు క్రెడాయ్ హైదరాబాద్‌కు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆయన శుక్రవారం క్రెడాయ్ హైదరాబాద్ ఏర్పాటు చేసిన పదవ ఎడిషన్ ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహాక విధానాల వల్ల హైదరాబాద్ నిర్మాణ రంగం దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుందన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే శాంతిభద్రతల్ని నియంత్రించి, 24 గంటలు కరెంటును అందజేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఫలితంగా, అనేక పరిశ్రమలు తెలంగాణలోకి అడుగుపెట్టాయని గుర్తు చేశారు.
దేశ, విదేశీ పరిశ్రమలు తెలంగాణలోకి అడుగుపెట్టేలా సీఎం కేసీఆర్ ఆకట్టుకున్నారని వివరించారు. బిల్డర్‌గా ఉన్న రోజుల్లో ప్రభుత్వం ప్రో యాక్టివ్‌గా ఎలా ఉండాలని కోరుకున్నానో.. అదేవిధంగా సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాల్ని తీసుకుంటున్నారని చెప్పారు. ట్రిపుల్ ఆర్ ని సీఎం కేసీఆర్ ప్లాన్ చేశారని.. అది అందుబాటులోకి వస్తే ఆకాశమే హద్దుగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ నిమిత్తం రూ.2,3 వేల కోట్లను భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇది ఆరంభమైతే వచ్చే 20, 30 ఏళ్ల దాకా రియల్ రంగం ముందుకెళ్లేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
మంత్రికేటీఆర్ విజన్.. ఆయన సమర్థత వల్ల ప్రపంచంలోనే పేరెన్నిక గల సంస్థలు హైదరాబాద్ వైపు దృష్టి సారిస్తున్నాయని తెలిపారు. ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఏవియేషన్.. ఇలా అనేక సంస్థలు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయని చెప్పారు. భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు లోతుగా అధ్యయనం చేసి.. ఎస్సార్డీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. నగరంలో ఫ్లయ్ఓవర్లు, అండర్ పాస్లు, ఓవర్ బ్రిడ్జిలు, లింకు రోడ్లను అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగ్గా డెవలప్ కావడం వల్ల ఐటీ పరిశ్రమల్ని విశేషంగా ఆకర్షిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ నిర్మాణ రంగంలో సుస్థిరత పెరగాలంటే మధ్యస్థాయి నిర్మాణాల్ని చేపట్టాల్సిన ఆవశ్యకతను మంత్రి గుర్తు చేశారు. మధ్యతరగతి ప్రజానీకం సొంతింటి కలను తీర్చే ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే నిర్మాణ రంగం పదికాలాల పాటు చల్లగా ఉంటుందన్నారు. అందుబాటు గృహాల ప్రాజెక్టుల్ని నిర్మించేందుకు అవసరమయ్యే ప్రాజెక్టుల కోసం అవసరమయ్యే ల్యాండ్ పూలింగ్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని తెలిపారు. వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే సీఎం కేసీఆర్ ధరణికి శ్రీకారం చుట్టారని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటివరకూ 47 రకాల సమస్యల్ని పరిష్కరించామని, ఇంకా కొన్ని అంశాలు మిగిలి ఉన్నాయని వెల్లడించారు. ధరణికి సంబంధించి రియల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో లో చర్చకు వచ్చాయి. అవేమిటంటే..
This website uses cookies.