Categories: TOP STORIES

కేటీఆర్ వస్తే బాగుండేది!

క్రెడాయ్ తెలంగాణ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు ఉత్సాహంతో పాల్గొన్నారు. సభలోకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అడుగుపెట్టగానే బిల్డర్ల మోములో ఎక్కడ్లేని ఆనందం వెల్లివిరిసింది. ఎందుకంటే, కరోనా రెండో వేవ్ తర్వాత ఆరంభమైన ప్రాపర్టీ షో కాబట్టి.. క్రెడాయ్ హైదరాబాద్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఎంతో విశాలంగా ప్రాపర్టీ షోను డిజైన్ చేసింది. షోకు విచ్చేసిన ప్రతిఒక్కరూ స్టాళ్లను డిజైన్ చేసిన తీరును చూసి సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రాపర్టీ షోకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. మరి, షో ప్రారంభోత్సం సందర్భంగా పలువురు ప్రతినిధులు తమ అభిప్రాయాల్ని ఇలా వెలిబుచ్చారు.

అందుబాటు ఇళ్ల‌కు ప్రోత్సాహం

రాష్ట్ర ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌లు పాల‌సీల‌ను రూపుదిద్దే ప్ర‌క్రియ‌లో చురుగ్గా పాల్గొంటున్నాం. బిల్డ‌ర్ల‌ను బ్యాంకులు క్రెడాయ్ హైద‌రాబాద్లో స‌భ్య‌త్వం తీసుకోమ‌ని చెబుతున్నాయంటే.. నిర్మాణ రంగంలో మేం పార‌ద‌ర్శ‌క‌త‌ను తీసుకొచ్చిన‌ట్లే క‌దా. క‌రోనా స‌మ‌యంలో ఇర‌వై స‌మ‌స్య‌ల‌పై మంత్రి కేటీఆర్‌తో చ‌ర్చించాం. తండ్రికి మించిన త‌న‌యుడిగా నిర్ణ‌యాల్ని తీసుకున్నారు. ఫీజుల్ని క‌ట్టేందుకు వాయిదా ప‌ద్ధ‌తిని అనుమ‌తించ‌డంతో ప్యాండ‌మిక్‌లో కూడా న‌గ‌రంలో అనేక సంస్థ‌లు అనుమ‌తుల్ని తీసుకున్నాయి. దేశంలో కొత్త‌గా ఆరంభ‌మైన క‌ట్టడాల్లో న‌ల‌భై శాతం తెలంగాణ‌లోనే న‌మోదయ్యాయి. ఇది స‌రికొత్త రికార్డు. అందుకే, దేశ‌మంత‌టా హైద‌రాబాద్ వైపు తిరిగి చూసింది. అందుబాటు గృహాల్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రోత్సాహాకాల్ని అంద‌జేయాలి. క్రెడాయ్ హైద‌రాబాద్ ప్రాప‌ర్టీ షో నుంచే మార్కెట్లో సానుకూల వాతావ‌రణం ఏర్ప‌డుతుంది.- వి. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, క్రెడాయ్ హైద‌రాబాద్‌.

రెరాకు రెగ్యుల‌ర్ ఛైర్మన్ కావాలి

తెలంగాణ ప్ర‌భుత్వం అనేక సంస్క‌రణ‌ల్ని ప్ర‌వేశ‌పెట్టింది. దేశంలోనే ఎక్క‌డా లేనివిధంగా టీఎస్ బీపాస్ ని అమ‌ల్లోకి తెచ్చింది. అయితే, దీన్ని కూడా టీఎస్ ఐపాస్ త‌ర‌హాలో ప్రోత్స‌హించాలి. పోడియం పార్కింగ్ అందుబాటులోకి తేవ‌డం వ‌ల్ల ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌లు తొల‌గిపోయాయి. ధ‌ర‌ణి బాధ్య‌త‌ల్ని జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గించ‌డం వ‌ల్ల ఇబ్బంది ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఒక జిల్లా మెజిస్ట్రేట్ అధికారిగా క‌లెక్ట‌ర్‌కు అనేక గురుత‌ర బాధ్య‌త‌లుంటాయి. కాబ‌ట్టి, ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేకంగా ఒక క‌మిటీని ఏర్పాటు చేయాలి. టీఎస్ బీపాస్‌లో విద్యుత్తు, జ‌ల‌మండ‌లి, ప‌ర్యావ‌ర‌ణ వంటి డిపార్టుమెంట్ల‌ను అనుసంధానం చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల అనుమ‌తులు ఆల‌స్యం అవుతున్నాయి. మాకు రాయితీలు అక్క‌ర్లేదు. సుల‌భ‌త‌ర‌మైన వాణిజ్య విధానాన్ని అందుబాటులోకి తెస్తే స‌రిపోతుంది. రెరాకు రెగ్యుల‌ర్ ఛైర్మ‌న్ కావాలి. అప్పీలేట్ అథారిటీని ఏర్పాటు చేయాలి. ఈ విభాగానికి సొంత ఇన్‌ఫ్రా, సిబ్బంది లేరు. రెరాను ప‌టిష్ఠం చేస్తే మ‌రింత స‌మ‌ర్థంగా ప‌ని చేసే అవ‌కాశ‌ముంది.- పి. రామ‌కృష్ణారావు, అధ్య‌క్షుడు, క్రెడాయ్ హైదరాబాద్‌.

అత్యుత్త‌మ ప్రాప‌ర్టీ షో ఇదే..

క్రెడాయ్ హైద‌రాబాద్ నిర్వ‌హిస్తున్న ఈ ప్రాప‌ర్టీ షో.. దేశంలోనే బెస్ట్ అని గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌ను. ఎందుకంటే, క్రెడాయ్ జాతీయ ఉపాధ్య‌క్షుడిగా దేశంలోని అనేక ప్రాప‌ర్టీ షోల‌ను గ‌మ‌నిస్తున్నాను. వాట‌న్నింటినీ చూస్తే.. ఇదే అత్యుత్త‌మంగా క‌నిపిస్తుంది. హైద‌రాబాద్ నిర్మాణ రంగం గ‌ణ‌నీయంగా అభివృద్ధి చెందుతోంది. కాక‌పోతే, కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు ప్రీ లాంచ్‌ల పేరిట త‌క్కువ రేటుకు ఫ్లాట్ల‌ను విక్ర‌యించ‌డం స‌రైన ప‌ద్ధ‌తి కాదు. కాబ‌ట్టి, ఇళ్ల కొనుగోలుదారులు డెవ‌ల‌ప‌ర్ల ప్రొఫైల్‌ని క్షుణ్నంగా గ‌మ‌నించి సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోవాలి. ఈ ప్రాపర్టీ షోకు విచ్చేసి.. అన్నిర‌కాలుగా మీకు న‌ప్పే ఫ్లాటును ఎంచుకోండి. త‌క్కువ రేటుకు వ‌స్తుంద‌నే ఒకే ఒక్క కార‌ణంతో ఎవ‌రి ద‌గ్గ‌ర ప‌డితే వారి ద‌గ్గ‌ర కొనుగోలు చేసి అన‌వ‌స‌రంగా మోస‌పోవ‌ద్దు.- గుమ్మి రాంరెడ్డి, ఉపాధ్య‌క్షుడు, క్రెడాయ్ నేష‌న‌ల్‌

గృహ‌ప్ర‌వేశానికి సిద్ధమైన‌వి..

తెలంగాణ‌లో క్రెడాయ్‌కి సంబంధించిన ప‌ద‌కొండు ఛాప్ట‌ర్లున్నాయి. అందులో ప‌ది ఇత‌ర జిల్లాల్లో వ్యాపించి ఉన్నాయి. ఇంత‌వ‌ర‌కూ క్రెడాయ్ హైద‌రాబాద్ నిర్వ‌హించిన ప్రాప‌ర్టీ షోల‌లో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. ఈసారి స్టాళ్లు పెరిగాయి. ప్రాప‌ర్టీల సంఖ్య అధిక‌మైంది. ప్ర‌స్తుతం పెరిగిన స్థ‌లాల ధ‌ర‌ల‌తో పోల్చితే.. కొత్త‌గా ఆరంభ‌మ‌య్యే ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల ధ‌ర‌లు పెరిగేందుకు ఆస్కార‌ముంది కాబ‌ట్టి, గృహ‌ప్ర‌వేశానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్ల‌ను కొనుగోలు చేయాలి. ధ‌ర‌ణిలో చాలావ‌ర‌కూ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యాయి. కాక‌పోతే, ఇంకా కొన్ని స‌మ‌స్య‌లు మిగిలి ఉన్నాయి. లీగ‌ల్ హేర్ ప్రొవిజ‌న్ వంటి స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌ర‌ముంది. ఇవ‌న్నీ కూడా సీసీఎల్ఏ స్థాయిలోనే మార్పులు చేయాల్సి ఉంటుంది- సీహెచ్ రామ‌చంద్రారెడ్డి, అధ్య‌క్షుడు, క్రెడాయ్ తెలంగాణ

This website uses cookies.