- రెరా అనుమతి లేకున్నా విల్లాల్ని అమ్మొచ్చా?
- ఇలాగైతే రెరా ఏర్పడి ఏం లాభం?
- ప్రీలాంచ్‌లో ఇళ్లు అమ్ముతుంటే
రెరా కళ్లప్పగించి చూస్తోందా? - ఇతర బిల్డర్లు రెరా అనుమతి
తీసుకున్నా.. ఏం లాభం? - ఇప్పటికైనా రెరా స్పందించాలి
- ప్రాజెక్టు విలువలో పది శాతం
జరిమానాను వసూలు చేయాలి!
హైదరాబాద్‌లో రెరా ఎంత బలహీనంగా తయారైందంటే.. కొన్ని నిర్మాణ సంస్థలు ప్రీలాంచుల అమ్మకాల్లో రెచ్చిపోతున్నా పట్టించుకోవట్లేదు. కనీసం ఆయా సంస్థపై జరిమానా కూడా విధించకుండా రెరా కిమ్మనకుండా వ్యవహరిస్తోంది. అందుకే, భువనతేజ వంటి అక్రమార్కులు.. ప్రీలాంచుల్ని ప్రకటిస్తూ.. కొనుగోలుదారుల నుంచి అక్రమంగా కోట్లు వసూలు చేస్తున్నారు. గతంలో ఈ సంస్థపై అనేక ఫిర్యాదులు అందినప్పటికీ, తెలంగాణ రెరా అథారిటీ స్పందించలేదు. ఎలాంటి కఠిన చర్యల్ని తీసుకోలేదు. అందుకే, ఈసారి ఫ్లాట్ల బదులు ఏకంగా విల్లాల్ని కడతామంటూ.. మాయమాటలు చెబుతూ.. కొనుగోలుదారులను బుట్టలో వేస్తున్నాడీ బిల్డర్. ఇలాంటి వారిని తెలంగాణ రెరా అథారిటీ ఎందుకు ఉపేక్షిస్తోంది? ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానాను ఎందుకు వసూలు చేయట్లేదు? ఇలా ప్రీలాంచ్ బిల్డర్లను వదిలేస్తే.. రెరా నుంచి అనుమతి తీసుకుని నిర్మించే వారి పరిస్థితి ఏమిటి?
ఇంత దారుణమా?
రెరా అనుమతి తీసుకున్నాకే ప్రాజెక్టును ఆరంభించాలనే నిబంధనను భువన తేజా తుంగలో తొక్కుతోంది. హెచ్ఎండీఏ, రెరా అనుమతులు వచ్చాక.. 24 నెలల్లో విల్లాల్ని పూర్తి చేస్తామంటూ బాహాటంగా ప్రచారం చేస్తున్నాడీ బిల్డర్. ఒకవైపు ప్రభుత్వమే రెరా అనుమతి తర్వాత ప్రాజెక్టును ఆరంభించాలని చెబుతుంటే.. ఈ బిల్డర్ మాత్రం రెరా వచ్చాక 11 ఎకరాల్లో విల్లాల్ని రెండేళ్లలో పూర్తి చేస్తామంటూ అమ్ముతున్నాడు. మరి, ఇలాంటి బిల్డర్లను రెరా అథారిటీ దారిలోకి తేకపోతే.. ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానా విధించకపోతే.. తెలంగాణ రాష్ట్రంలో బిల్డర్లు రెరా నుంచి అనుమతి తీసుకోకుండా మానేస్తారు.
శామీర్‌పేట్‌లో రెరా బిల్డర్లు ఏం చేస్తున్నారంటే?
తెలంగాణ రెరా అథారిటీ నుంచి అనుమతి తీసుకుని అపార్టుమెంట్లు, విల్లాల్ని ఆరంభించే డెవలపర్లు.. రెరా అనుమతి లేకుండా విల్లాల్ని నిర్మించే భువనతేజా వంటి సంస్థలపై ఫిర్యాదు చేయడానికి సమాయత్తం అవుతున్నారని తెలిసింది. ఇలాంటి బిల్డర్ల వల్ల రెరా డెవలపర్ల వద్ద ఫ్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. మేడ్చల్, శామీర్‌పేట్, కీసర, కొంపల్లి వంటి ప్రాంతాలకు చెందిన డెవలపర్లు.. రెరా అథారిటికీ ఫిర్యాదు చేస్తున్నారు. కనీసం, ఇప్పుడైనా తెలంగాణ రెరా అథారిటీ తగు రీతిలో స్పందించి.. ఇలాంటి మోసపూరిత డెవలపర్లపై ముక్కుపిండి జరిమానాను వసూలు చేయాలని కోరుతున్నారు.