- ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ
కాజల్ అగర్వాల్.. పరిచయం అక్కర్లేని పేరు. చందమామ సినిమాతో తెరంగ్రేటం చేసిన ఈ బామ.. మగధీరతో ఎక్కడ్లేని పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈమధ్య ముంబైకి చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. మరి, తన సొంతింటి గురించి రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా వివరించింది. సారాంశం ఆమె మాటల్లోనే..
మా ఇల్లును చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. లివింగ్ రూమును కనీస స్థాయిలో చూడచక్కగా డిజైన్ చేశాం. ఇటుకలతో సర్కిల్ ఆకారంలో కనిపించే గోడను తీర్చిదిద్దాం. ఇందులో కొంత వ్యక్తిగత స్పేస్ కూడా ఉంది. అక్కడే ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరుచుకునే గ్లాస్ టేబుల్ ఉంటుంది. దాన్ని అవసరమైనప్పుడు వాడుకుంటాం. వినోదం మరియు జీవితం లేని ఇల్లా అని కొందరు అనుకోవచ్చు. కానీ, చిందరవందరగా లేని ఇల్లు ఉండటం వల్ల ఎక్కడ్లేని సంతృప్తి, ప్రశాంతత లభిస్తుంది. ఇంటిని తెలుపు రంగులోనే పేయింట్ చేశాం.
దీని వల్ల రాత్రి, పగలు ఇంటీరియర్స్ ప్రకాశిస్తూ కనిపిస్తాయి. పడక గదిలో కిటీకి ఉండటం వల్ల వేకువజామునే సూర్యుడు నేరుగా శుభోదయం చెబుతాడు. మంచం వద్ద టేబుల్ ఉంటుంది. కార్నర్‌లో కొన్ని పుస్తకాలుంటాయి. ఇంటీరియర్స్ అన్నీ తెలుపులోనే ఉంటాయి. సహజసిద్ధమైన కాంతి, టెక్స్ఛర్‌తో మిళితమయ్యేలా చూడటానికెంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
ఇంటీరియర్స్ తెలుపులో డిజైన్ చేయడం వల్ల ఇల్లంతా వెచ్చగా, ఆహ్వానించదగినదిగా.. ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇక్కడే పుట్టా..
ఈ ఇల్లు నేను పుట్టక ముందు నుంచీ ఉంది. మా తల్లీదండ్రులు నేను పుట్టక ముందు నుంచీ ఈ ఇంట్లో ఉంటున్నారు. ఇదే ఇంట్లో నా జీవితాన్ని గడిపేశాను. జీవితంలో బడా సంబురాలన్నీ ఇదే ఇంటిలో జరిగాయి. ఇక్కడే ప్రత్యేక లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాను. అక్కడే ఎవరైనా వచ్చి సినిమా స్టోరీలను చెబుతుంటారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో తయారు చేసిన రగ్గుతో ఈ ప్రాంతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
ఈ స్థలం ఓదార్పునివ్వడంతో పాటు సౌందర్యంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. గోడకు బ్యాక్ లైటు గాజులో అమర్చిన బంగారు రేకు నంది.. చేతితో చిత్రించింది. నా ఇంట్లో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను హోస్ట్ చేయడం నాకు చాలా ఇష్టం, కాబట్టి నేను స్టైలిష్ మెటల్ మరియు డిజైన్ టేబుల్‌తో కూడిన సూపర్ ఫంక్షనల్ బార్‌ని ఏర్పాటు చేశాను. నాకు ఇల్లు అనేది ప్రస్తుతం హాలిడే స్పేస్ గా మారింది, కాబట్టి కొన్ని రోజులు సెలవు దొరికినప్పుడు, నేను ఇంటికి తిరిగి వస్తాను.