కారణం.. భువనతేజ ఇన్‌ఫ్రా
దీపావళి సందర్భంగా దేశమంతటా వెలుగుజిలుగులతో నిండిపోతే.. మరికొన్ని కుటుంబాల్లో కారుచీకట్లు కమ్ముకున్నాయి. అటు కష్టార్జితం పోయి.. ఇటు సొంతింటి ఆశలు ఆవిరై.. జీవితం నరకప్రాయంగా మారింది. మళ్లీ, తమ జీవితాల్లో వెలుగుజిలుగులు ఎప్పుడొస్తాయని ఆ కుటుంబాలెంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. మరి, ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపిందెవరు?
భువనతేజ ఇన్‌ఫ్రా.. కనీసం ఒక్క ఫ్లాటు కూడా సరిగ్గా కట్టని ఈ సంస్థ సామాన్య, మధ్యతరగతి ప్రజల్లోని సొంతింటి కల ఆశను తమకు అనుకూలంగా మార్చుకుంది. తక్కువ రేటుకే ఇల్లంటూ ఆశపెట్టింది. అరచేతిలో స్వర్గం చూపెట్టింది. అదే నిజమేనని కొందరు నమ్మారు. అసలే కరోనా సీజన్.. తక్కువ రేటుకు ఫ్లాటు వస్తుంది కదా అంటూ ఉన్నదంతా ఊడ్చుకొచ్చి.. అప్పులు తెచ్చి మరీ భువనతేజ ఎండీ చేతుల్లో పోశారు. ఇక అంతే సంగతులు. ఆయా అపార్టుమెంట్లకు అనుమతి రాలేదు. నిర్మాణాలు మొదలు కాలేదు. ఫ్లాట్లను విక్రయించిన ఏజెంట్లు చేతులెత్తేశారు. రెండు, మూడేళ్లలో అపార్టుమెంట్ పూర్తయ్యి.. అందులోకి అడుగుపెడతామని భావించిన వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో ఏం చేయాలో అర్థం కాకుండా తల పట్టుకున్నారు. కొందరైతే పోలీసు స్టేషన్లలో కేసుల్ని సైతం పెట్టారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన ప్రజలు భువనతేజ సంస్థలో సొమ్ము పెట్టి దారుణంగా మోసపోయారు. ఈ జాబితాలో సింగరేణీకి చెందిన కొందరు కార్మికులు ఉండటం గమనార్హం. తమ సొమ్ము ఎలా వెనక్కి వస్తుందో తెలియట్లేదని కొంతమంది బయ్యర్లు వాపోతున్నారు.
కొనుగోలుదారులు సొమ్ము గురించి నిలదీసినప్పుడల్లా చక్కా వెంకట సుబ్రమణ్యం.. వారిని ఆఫీసుకు రమ్మని చెబుతాడని తెలిసింది. తీరా అక్కడికి వెళితే ఆయన ఉండరని బాధితులు అంటున్నారు. ఇతని బారిన పడినవారిలో డెబ్బయ్యేళ్ల వృద్ధులు సైతం ఉండటం గమనార్హం. మరి, కరోనా సమయం నుంచి తెలంగాణ రియల్ రంగంలో ఎంతో అరాచకం చేసిన భువనతేజ ఇన్‌ఫ్రా ఎండీ చక్కా వెంకట సుబ్రమణ్యంపై ఇంతవరకూ అటు ప్రభుత్వం కానీ ఇటు టీఎస్ రెరా కానీ ఎలాంటి చర్యల్ని తీసుకోవట్లేదని బాధితులు వాపోతున్నారు. ఇతను మొత్తం ఎన్ని ప్రాజెక్టులు వేశాడు? అందులో సొంత స్థలం ఎంతుంది? ఎంతమంది వద్ద లక్షల రూపాయల్ని వసూలు చేశాడు? మరి, ఆయా సొమ్మునంతా ఏం చేశాడు? ఇతను ఏమైనా అపార్టుమెంట్లను ఆరంభించాడా? ఒకవేళ కడితే అవి ఏ స్థాయిలో ఉన్నాయి? ఇలా ప్రతి అంశాన్ని కూలంకషంగా టీఎస్ రెరా తెలుసుకోవాలి. మొత్తం ఎంతమంది నుంచి సొమ్ము వసూలు చేశాడో లెక్కించి ఆయా సొమ్మును బాధితులకు ఇప్పించాలని టీఎస్ రెరాను బాధితులు కోరుతున్నారు.