హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి వంటి జిల్లాల్లో భువన తేజ ఇన్‌ఫ్రా భారీ స్థాయిలో ప్రీలాంచ్ మోసాలకు పాల్పడింది. ఇక్కడ ఇక కొత్త బక్రాలు దొరకరని గ్రహించి.. వివిధ జిల్లాల్లో అమాయలకు గాలం వేసే పనిలో పడింది. రేటు తక్కవని చెబితే జనాలు వేలంవెర్రిలా ఫ్లాట్లను కొనడానికి ముందుకొస్తారనే అంశాన్ని అర్థం చేసుకుందీ సంస్థ. కంపెనీ ఎండీ చక్కా వెంకట సుబ్రమణ్యంకు ఇళ్లను నిర్మించడంలో ఎలాంటి అనుభవం లేదు.
అయితే, ధర తక్కువంటే ప్రజలు ఆటోమెటిగ్గా కొంటారని అతను గ్రహించాడు. కాకపోతే, హైదరాబాద్ చుట్టుపక్కల తన పప్పులు ఉడకవని గ్రహించి.. క్రమక్రమంగా జిల్లాలకు మకాం మారుస్తున్నాడు. రాజామండ్రికి చెందిన ఈ బిల్డర్ ఇప్పుడు ఏకంగా తెలంగాణ జిల్లాల ప్రజలను మోసం చేయడానికి బయల్దేరడం గమనార్హం. మంచిర్యాల, నిజామాబాద్, జడ్చర్ల వంటి నగరాల్లో అక్రమ వసూళ్లకు శ్రీకారం చుట్టాడు. భువనతేజ పేరిట ఎవరైనా తక్కువ రేటంటూ మీ వద్దకొస్తే అస్సలు నమ్మకండి. అందులో కొనుగోలు చేసి మీ కష్టార్జితాన్ని బూడిదలో పన్నీరు చేసుకోకండి.
కరోనా సమయంలో హైదరాబాద్లో ప్రీలాంచ్ మాయకు శ్రీకారం చుట్టిన భువనతేజ ఇన్‌ఫ్రా.. శామీర్‌పేట్‌లో రూ.12 లక్షలకే ఫ్లాట్ అనగానే.. ప్రజలంతా వేలంవెర్రిగా.. వెనకా ముందు చూడకుండా పెట్టుబడి పెట్టేశారు. ఊహించని రీతిలో సొమ్ము చేతికి రావడంతో.. ఈ స్కీమేదో బాగుందని భావించిన చక్కా వెంకట సుబ్రమణ్యం.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా..
అక్రమ వసూళ్ల స్కీమును విస్తరింపజేశాడు. నగరం నలువైపులా డజను దాకా ప్రీలాంచ్ ప్రాజెక్టుల్ని ఆరంభించాడు. కొన్నింటికీ స్థానిక సంస్థ నుంచి అనుమతి రాకున్నా నిర్మాణ పనుల్ని ఆరంభించినట్లుగా చూపించి బయ్యర్లను బోల్తా కొట్టించాడు. మరికొన్నింట్లో ప్రజల వద్ద సొమ్ము తీసుకుని ప్రాజెక్టులే ప్రారంభించలేదు.కాలం గడిచేకొద్దీ ప్రజలకు వాస్తవం తెలిసింది. అపార్టుమెంట్లను కట్టడం ఇతని వల్ల కాదని అర్థం చేసుకున్న వారిలో అనేక మంది ఫ్లాట్లను రద్దు చేసుకున్నారు. అప్పట్నుంచి తమ కష్టార్జితాన్ని వెనక్కి తీసుకోవడానికి పంజాగుట్టలోని సంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వీరికి పూటకో కహానీ చెబుతూ.. అందరనీ వెర్రి వెంగళప్పలను చేస్తున్నాడీ చక్కా వెంకట సుబ్రమణ్యం.
నిజామాబాద్‌లో ఇంద్రప్రస్థ ఏమైంది?
నిజామాబాద్‌లో సుమారు రెండు ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీతో పాటు త్రీ స్టార్ హోటల్ నిర్మించడానికి భువనతేజ ఇన్‌ఫ్రా ప్రీలాంచ్ మాయను ఆరంభించింది. ఏకంగా భూమి పూజ కూడా చేసింది. అనుమతులను తీసుకోకుండానే ప్రారంభించిన ఈ 96 ఫ్లాట్ల ప్రాజెక్టు ఏమైందో ఎవరికీ తెలియదు. అందులో కొన్నవారి పరిస్థితి ఏమిటో తెలియదు. ఇందుకు సంబంధించిన వివరాల్ని తెలుసుకునేందుకు సంబంధిత వ్యక్తిని రియల్ ఎస్టేట్ గురుని సంప్రదించింది. అయితే, ఇంద్రప్రస్థ ప్రాజెక్టు ప్రస్తుత స్టేటస్ తనకు తెలియదన్నాడు. ఆ ప్రాజెక్టు ప్రారంభం అవుతుందో లేదో కూడా తన వద్ద సమాచారం లేదన్నాడు.
మంచిర్యాలలో ఏకంగా రెండు వందల ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీని భువనతేజ ఇన్ ఫ్రా నిర్మిస్తోందని.. ఓపెనింగ్ ఆఫర్ గా.. 2 బీహెచ్‌కే ఫ్లాట్‌ను రూ.10 లక్షలకే అందజేస్తామని సోషల్ మీడియాలో ప్రచారం ఆరంభమైంది. 200 గజాల్లో ఇల్లు రూ.20 లక్షలు, విల్లా అయితే రూ.40 లక్షలంటూ కొత్త మాయ ఆరంభించింది. రాజమండ్రికి చెందిన చక్కా వెంకట సుబ్రమణ్యం.. ఏకంగా మంచిర్యాల ప్రజల్ని మోసం చేయడానికి స్కెచ్ వేయడం గమనార్హం. మంచిర్యాల ప్రజలంతా గుర్తించాల్సిన అంశం ఏమిటంటే.. ఇలాంటి స్కీములను గుడ్డిగా నమ్మేసి.. ఇళ్లను కొనకండి. రెరా అనుమతి ఉన్న వాటికే ఎంచుకోండి. రెరా అనుమతి వచ్చాక రేటు పెరుగుతుందని మిమ్మల్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి, వారి మాయలో పడకండి. మీ కష్టార్జితాన్ని మీరే కాపాడుకోవాలి.
భువనతేజ ఇన్‌ఫ్రా మాయ గురించి ప్రజలకు తెలిసిపోవడంతో సంస్థ ఎండీ చక్కా వెంకట సుబ్రమణ్యం అప్రమత్తం అయ్యాడు. ఈ సంస్థ పేరు పెడితే.. ప్రజలు ప్లాట్లు కొనరని గ్రహించాడో ఏమో తెలియదు కానీ.. జడ్చర్లలో కొత్తగా ఆరంభించిన ఫామ్ ప్లాట్ల ప్రాజెక్టుకు సన్నిధి ఆగ్రో ఫామ్స్ అనే పేరు పెట్టాడు. కొత్త బయ్యర్లకు గాలం వేసే పనిలో పడ్డాడు. ఇతని మాయలో మరెవరూ పడి మోసపోకూడదని రియల్ ఎస్టేట్ గురు బలంగా కోరుకుంటోంది.
ఇక్కడ ప్రతిఒక్క కొనుగోలుదారుడు గుర్తించాల్సిన అంశం ఏమిటంటే.. ప్రీలాంచ్ అన్నా.. రేటు తక్కువ అన్నా.. వెనకా ముందు చూడకుండా కొనుగోలు చేయకండి. ఒక్కసారి మీ కష్టార్జితాన్ని ఇలాంటి సంస్థల చేతిలో పోస్తే.. మళ్లీ వెనక్కి తెచ్చుకోవడమెంతో కష్టం. ఇప్పటికే సాహితీ, జయా గ్రూప్ వంటి సంస్థల్లో ఫ్లాట్లను కొనుగోలు చేసి జనాలెంతో ఇబ్బంది పడుతున్నారు. మీరు ఆ జాబితాలో చేరకూడదంటే.. భువనతేజ వంటి సంస్థల వద్ద ప్రీలాంచులో ఫ్లాట్లను అస్సలు కొనుగోలు చేయకండి.
This website uses cookies.