ఒక సంస్థ లేదా బ్రాండ్ లేదా ఒక లీడర్ ను తలుచుకుంటే ముందుగా మనకు ఒక అభిప్రాయం కలుగుతుంది. ఆ పేరు స్పురణకు వచ్చిన ప్రతిసారీ అదే ఫీలింగ్ వస్తుంది. అదే బ్రాండింగ్ అంటే. ఒక సంస్థకు బ్రాండ్ ప్రామిస్ అనేది చాలా ముఖ్యం. అది ఆ సంస్థను స్థాపించినవారి విలువల ఆధారంగా వస్తుంది. ఉదాహరణకు టాటా కంపెనీని తీసుకుంటే.. దేశ ప్రయోజనమే వారి ప్రయోజనంలా ఉండటానికి కారణం.. ఆ సంస్థ వ్యవస్థాపకుల ఆలోచనలు, విలువలే. ఒక సంస్థకు సరైన బ్రాండ్ ప్రామిస్ నిర్వచించి.. దానిని నిలబెట్టుకోవడానికి ఎలాంటి విలువలు ఆ సంస్థ సంస్కృతిలో భాగం కావాలో వివరించి.. వాటిని ఆచరణలో పెట్టడానికి తగిన మార్గదర్శకాలు రూపొందించినప్పుడు ఆ సంస్థలో ప్రతి ఒక్కరూ బ్రాండ్ ప్రామిస్ నిలబెట్టేలా సత్వరమే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంటే సరైన బ్రాండ్ ప్రామిస్, కీలక విలువలు వ్యక్తులను స్వతంత్రులుగా చేసి, వారి పూర్తి శక్తిసామర్థ్యాలు వెలికితీస్తుంది.
వాస్తవానికి 90 శాతం మంది వ్యాపారులు డబ్బు కోసమే పనిచేస్తారు. అయితే, అదే సర్వస్వం కాకూడదు. ఆశయం లేనివారికి డబ్బు వచ్చే కొద్దీ ఆశ పెరుగుతుంది. వారి జీవితమంతా డబ్బు ఆలోచనలతోనే గడిచిపోతుంది. ఫలితంగా ప్రతి ఒక్కరినీ డబ్బు సంపాదన కోసమే వాడుకుంటారు. చివరకు పిల్లలకు కూడా డబ్బు, డాబు ఆలోచనలనే ఇస్తారు. ఇదే మానవజాతిని ఈ భూమికి శత్రువుగా మార్చేసింది. డబ్బు సంపాదించడం నేరం కానే కాదు. కానీ సామాజిక ప్రయోజనం లేని సంపద వ్యక్తిని, వ్యవస్థల్ని కలుషితం చేస్తుంది. అదే ఒక సామాజిక ప్రయోజనం ఒక ఆశయంగా మారితే ఆ సంస్థ వ్యవస్థాపకుడు సామాజిక పారిశ్రామికవేత్తగా మారిపోతాడు. అనంతరం అర్థవంతమైన ప్రాజెక్టులతో సంపద సృష్టించడం ఎంత అవసరమో తెలుసుకుంటారు. అలాంటివారు సరైన ప్రతిభావంతుల్ని తమ సంస్థలోకి ఆహ్వానించి వారిని నిబద్ధత, సమర్థత కలిగిన నాయకులుగా ఎదగడానికి అవసరమైన సంస్కృతిని నిర్మించగలుగుతారు.
ఒక కుటుంబంలోని అందరూ ఒక్కటిగా ఉండరు. అలాంటప్పుడు వేర్వేరు ప్రాంతాలకు చెందిన విభిన్నమైన వ్యక్తులు కలిసి ఉద్యమంలా పని చేయాలంటే ఆ సంస్థకు కొన్ని నియమాలు, మార్గదర్శకాలు తప్పనిసరి. అవి విశ్వసూత్రాలకు అనుగుణంగా ఉన్నప్పుడు ఆ సంస్థ విశ్వ సంస్థగా విస్తరిస్తుంది. విజయానికి ధర్మం, ధైర్యం, సాహసం కావాలని భగవద్గీత చెబుతుంది. అలాగే ధర్మం అనేది జ్ఞానం, ప్రేమ, న్యాయం, అంకితభావం, ధైర్యంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.
మరి చేసే పని పట్ల ఎంతమంది బిల్డర్లకు పూర్తి అవగాహన ఉంది? ఒకవేళ లేకపోతే అటువంటి నాలెడ్జ్ ఉన్న నిపుణుల సహాయం తీసుకోవాలి కదా? ఇక చేసే పని పట్ల ప్రేమ లేకపోతే బోర్ కొట్టడం సహజం కదా? అలాగే తీసుకున్న రూపాయికి, చేసిన ఒప్పందానికి న్యాయం చేయకుంటే అన్యాయమే కదా? అంకితభావం.. అంటే పది ప్రాజెక్టులు పెట్టుకుని దేని మీదా పూర్తి ఫోకస్ పెట్టకుండా ఇక్కడ డబ్బులు అక్కడ.. అక్కడ డబ్బులు ఇక్కడ పెట్టుకుంటూ పోతే ఎన్ని రెరాలు ఉన్నా ఏ ప్రయోజనం? అలాగే సామాజిక, ఆర్థిక, చట్టపరమైన, రాజకీయ, సాంకేతిక సమస్యలను ఎదుర్కొని సాహసంతో ముందుకు వెళ్లి స్వప్నాన్ని సాకారం చేసేవారే నిజమైన నిఖార్సైన బిల్డర్ అవుతారు.
This website uses cookies.