పెద్ద నోట్ల రద్దు వల్లే ప్రాజెక్టు అప్పగింతలో జాప్యం జరిగిందనడాన్ని అంగీకరించలేమని మహా రెరా స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఒప్పందం ప్రకారం ఫ్లాట్ అప్పగించని కారణంగా సదరు కొనుగోలుదారుకు పరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొంది. పుణెలో తనిష్ అసోసియేట్స్ సంస్థ తనిష్ ఆర్కిడ్ పేరుతో ఓ ప్రాజెక్టు చేపట్టింది. 2016 ఏప్రిల్ 30న ఫిర్యాదుదారు ఓ ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. అందుకు సంబంధించి ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.
దీని ప్రకారం 2017 జూన్ లోగా ఫ్లాట్ అప్పగించాలి. అయితే, గడువులోగా ఫ్లాట్ అప్పగించలేదు. ఆరు నెలల గ్రేస్ పిరియడ్ ముగిసినా అదే పరిస్థితి కొనసాగింది. ఈ నేపథ్యంలో సదరు కొనుగోలుదారు ఫిర్యాదు మేరకు రెరా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బిల్డర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దేశంలో పెద్ద నోట్ల రద్దు కారణంగానే తమ ప్రాజెక్టు ఆలస్యమైందని పేర్కొన్నారు. 2016 నవంబర్ 8న దేశంలో పెద్ద నోట్లు రద్దు చేశారని, దీంతో నగదు ఫ్లో కష్టమైందని, ఫలితంగా ప్రాజెక్టును పూర్తి చేయడంలో జాప్యం జరిగిందని నివేదించారు.
అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్లే ప్రాజెక్టు జాప్యమైందని, దీనిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అయితే, దీంతో రెరా విభేదించింది. గడువు తేదీ కంటే ముందుగా సంబంధిత అధికారుల నుంచి కంప్లీషన్ సర్టిఫికెట్ తీసుకుని ఫ్లాట్ అప్పగించని కారణంగా జరిమానా చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
This website uses cookies.