కొన్ని పాశ్చాత్య నగరాల్ని చూస్తే.. సముద్రం లేదా నది పక్కన ఆకాశహర్మ్యాలతో అలరారుతుండటాన్ని గమనించొచ్చు. మరి, వాటిని చూసి స్ఫూర్తి పొందారేమో తెలియదు కానీ.. హైదరాబాద్‌లోనూ హిమాయత్ సాగర్ దిగువ ప్రాంతాల్లో ఓ సరికొత్త ప్రపంచాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలిసింది. దాదాపు ఆరు వందల ఎకరాల్లో ఆకాశహర్మ్యాల్ని నిర్మించేందుకు కార్యచరణను సిద్ధం చేసినట్లు సమాచారం. హిమాయత్ సాగర్ దిగువ భాగంలో.. వాలంతరీకి 131.07 ఎకరాలు, వీడీఓటీసీ 254.04 ఎకరాలు, పర్యాటక శాఖ 91 ఎకరాలు, హెచ్ఎండీఏ 97 ఎకరాలు, టీఎస్ఈఆర్ఎల్ వద్ద కొంత భూములున్నాయి. ఇవన్నీ కలిపితే ఎంతలేదన్నా ఆరు వందల ఎకరాల దాకా ఉంటుంది. వీటిని ఎకరం చొప్పున వేలం వేయడానికి హెచ్ఎండీఏ ప్రణాళికల్ని రచిస్తోందని సమాచారం. ప్రస్తుతం ఆరంభ దశలో ఉన్న ఈ ఆలోచన కార్యరూపం దాల్చేందుకు రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశముందని తెలిసింది.
ఈ ఆరు వందల ఎకరాల్లో వాక్ టు వర్క్ కాన్సెప్టును అభివృద్ధి చేసేలా.. ఐటీ సముదాయలతో పాటు ఆకాశహర్మ్యాలకు అనుమతుల్ని మంజూరు చేస్తారా? లేదా కేవలం ఐటీ భవనాల్ని కట్టేందుకు అనుమతినిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాలి. అయితే, దుబాయ్ తరహాలో మిక్స్‌డ్ డెవలప్‌మెంట్‌కు అనుమతినివ్వాలనే విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. లేదా ఆఫీసు కార్యాలయాలన్నీ ఒకవైపు.. నివాస గృహాలన్నీ మరోవైపు అనుమతించినా మెరుగ్గానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం 40 నుంచి 50 అంతస్తుల నిర్మాణాలు నగరంలో సర్వసాధారణమైంది. ఎంతలేదన్నా యాభైకి పైగా ఆకాశహర్మ్యాల నిర్మాణం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్ దిగువ భాగంలో దాదాపు అరవై నుంచి వంద అంతస్తుల ఎత్తులో స్కై స్క్రేపర్లు రావాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అంతర్జాతీయ సంస్థలు, కన్సల్టెంట్లతో హెచ్ఎండీఏ సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
ఇటీవల సీఎం కేసీఆర్ టీఎస్‌పీఏ జంక్షన్ (అప్పా) వద్ద మెట్రో రైలు పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ రైలు ఇదే ప్రాంతం మీదుగా వెళుతుంది. అంటే, ఈ ప్రాంతం మీదుగా మెట్రో రైలు కూడా ప్రయాణిస్తుందని సమాచారం. అందుకే, కొంతకాలం క్రితం సీఎం కేసీఆర్ హడావిడిగా ఈ పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. సుమారు రూ.600 కోట్లతో డెవలప్ చేస్తున్న మెట్రో రైలు వల్ల కలిగే ప్రయోజనాలు చాలామందికి తెలియదు. ఈ ప్రాంతం గనక గ్లోబల్ డెస్టినేషన్గా అవతరిస్తే.. ఇక్కడి భూములకు ఎక్కడ్లేని గిరాకీ పెరుగుతుంది. కోకాపేట్‌లో ఎకరం రూ.60 కోట్లు పలికిన విషయం విధితమే. ఇంచుమించు ఇదే రేటుకు ఇక్కడి భూములను వేలం వేయాలన్నది ప్రభుత్వ ఆలోచనలుగా కనిపిస్తున్నది.
This website uses cookies.