జీవో నెం 86 అమల్లోకి వచ్చాక.. తెలంగాణలో నిర్మాణ రంగం గాడిలో పడింది. అనుమతులన్నీ వచ్చాకే ఫ్లాట్లను అమ్మడాన్ని అలవాటు చేసుకున్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక.. ముఖ్యంగా 2019 నుంచి కొందరు డెవలపర్లు అక్రమ మార్గం ఎంచుకున్నారు. ఎలాంటి కష్టం లేకుండా.. సులువుగా సొమ్మును సంపాదించే పనిలో పడ్డారు. రేటు తక్కువ అంటూ బయ్యర్ల నుంచి కోట్లు వసూలు చేస్తున్నారు. రెరా అథారిటీ సీరియస్ కావడంతో ప్రస్తుతం వీరంతా ఏం చేస్తున్నారో తెలుసా?
నిన్నటివరకూ.. కొందరు రియల్టర్లు మరియు బిల్డర్లు.. యూడీఎస్ సేల్ పేరిట ఫ్లాట్లను అమ్మేవారు. స్థలం కొంటే రిజిస్ట్రేషన్ చేసేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. తెలంగాణ రెరా అథారిటీ కొరడా ఝళిపిస్తుండటంతో.. పలువురు రియల్టర్లు, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. యూడీఎస్, ప్రీలాంచ్, సాఫ్ట్ లాంచ్ పేర్లను వాడటం మానేశారు. కొత్తగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అంటూ జనాల్నుంచి సొమ్ము వసూలు చేస్తున్నారు. మరికొందరు ఆఫీసు, ఐటీ సముదాయాల్లో పెట్టుబడి పెడితే.. అధిక అద్దె చెల్లిస్తామని ప్రచారం చేస్తున్నారు. ఆర్‌జే గ్రూపు వంటి సంస్థలు ఒక అడుగు ముందుకేసి… రెరా అనుమతి తీసుకోకపోయినప్పటికీ.. తమను ఎవరేం చేస్తారులే అని బరితెగించి.. తమ స్టాఫ్ ఫోటోలు పెట్టి.. టీవీ ఛానెళ్లలో ప్రకటనల్ని గుప్పిస్తున్నారు. అంటే, ఇప్పటికే ఫ్లాట్లను కొన్నవారికి నమ్మకం కలిగించేందుకు ఇలా సరికొత్త జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు ఎన్ని ఇచ్చినప్పటికీ, ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానా రెరా అథారిటీ వసూలు చేస్తుందనే విషయం తెలిసిందే.
యూడీఎస్, ప్రీలాంచుల్లో ఆరి తేరిన ఈ కంపెనీ.. ఇటీవల డిజిటల్ మీడియాలో.. ల్యాండ్ పూలింగ్ అంటూ కొత్త పేరు పెట్టి.. సొమ్ము వసూలు చేసే పనిలో పడింది. మహేశ్వరం చేరువలోని పెద్ద గోల్కొండలో సుమారు 150 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించింది. మంచి రాబడిని కోరుకునేవారు తమ వద్ద పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించింది. ల్యాండ్ పూలింగ్ పేరిట ఒక ఎకరా స్థలం కొనేందుకు రూ.4.5 కోట్లుగా ధర నిర్థారించింది. అంటే, సుమారు రూ. 675 కోట్లను సేకరించే పనిలో పడింది. స్థానిక సంస్థ నుంచి అనుమతి లేకుండా.. రెరా అనుమతి తీసుకోకుండా.. ఇలా దొంగ దారిలో రూ.675 కోట్లు వసూలు చేయడాన్ని ఏమంటారు? ఇంత బడా స్కెచ్ వేసిన సంస్థ సభ్యత్వాన్ని ఎందుకు క్రెడాయ్ హైదరాబాద్ రద్దు చేయదు?
మనం ఎక్కడ ఫ్లాట్ కొనుగోలు చేసినా.. పేమెంట్ చేయగానే.. రశీదు ఇస్తారు. కానీ, తాజాగా కొందరు డెవలపర్లు టోకోన్ నెంబర్ ఇవ్వడం ఆరంభించారు. ఈ టోకెన్ నెంబర్ ఆధారంగానే ఫ్లాట్లను కేటాయిస్తారు. ఇలా టోకెన్ల ఆధారంగా ఫ్లాట్లు అమ్మవచ్చనే విషయాన్ని మన హైదరాబాద్ డెవలపర్లు ప్రపంచానికి పరిచయం చేశారు. కొందరు తెలివైన ప్రమోటర్లు.. తాము మార్కెట్లో ఇతరుల కంటే భిన్నమని భావించే డెవలపర్లు.. ప్రీలాంచ్ అమ్మకాలకు సరికొత్త పేరు పెట్టారు. వీళ్లేం చేస్తున్నారంటే.. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటూ ఓ సరికొత్త పదాన్ని కనిపెట్టారు. మార్కెట్ కంటే తక్కువ రేటని చెబుతారు. ముందుగానే చెక్కులు తీసుకుంటారు. కాకపోతే, రెరా అనుమతి వచ్చాకే చెక్కుల్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని చెబుతారు. లాంచింగ్ ధర చదరపు అడుక్కీ రూ.8500 నుంచి 9000 దాకా ఉంటుందని.. ప్రస్తుతం చెక్కులిస్తే.. 7000 నుంచి 8000 మధ్యలో విక్రయిస్తున్నామని అంటున్నారు.
కాస్త ఆర్థికంగా బలమైన కంపెనీలు ముందే స్థలాన్ని కొనేసి.. అనుమతి రాకముందే.. ఫ్లాట్లను అమ్మకానికి పెడుతున్నాయి. వీరి వద్ద ఫ్లాట్లు కొంటే ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ.. సకాలంలో పూర్తి చేస్తారా? లేదా? అనే అంశంపై గ్యారెంటీ ఉండదు. రెరా అనుమతి వచ్చాకే నిబంధనలు వర్తిస్తాయి కాబట్టి, చెప్పిన సమయానికి ఇవ్వకపోయినా ఎవ్వరేం చేయలేని పరిస్థితి. నిర్ణీత సంఖ్య కంటే అధిక ఫ్లాట్లను కేటాయించినా కష్టమే.
స్థలం ఎంపికలో ఎలాంటి కష్టాల్లేవు.. ఆయా స్థలంలో ఎలాంటి అపార్టుమెంట్ కట్టాలనే అంశంపై నిపుణులతో చర్చించేది లేదు. స్థలానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులున్నాయా? లేవా? అని న్యాయవాదుల్ని కలిసేది లేదు. ప్రాజెక్టు డిజైన్ల గురించి ఆర్కిటెక్టులతో కుస్తీ పడేది లేదు. అనుమతికి దరఖాస్తు చేయక్కర్లేదు. స్థానిక సంస్థ చుట్టూ తిరగక్కర్లేదు. ఎన్వోసీల కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు. రెరా వచ్చేవరకూ ఎదురు చూసీ చూసీ.. ప్రాజెక్టును అట్టహాసంగా అనౌన్స్ చేయనక్కర్లేదు. ఇవన్నీ చేసేందుకు ఏడాది నుంచి రెండేళ్ల దాకా కష్టపడక్కర్లేదు. మొత్తానికి, కొందరు రియల్టర్లు మరియు బిల్డర్లు సులువుగా సొమ్ము సంపాదించే పనిలో పడ్డారు. ఇలాంటి మోసపూరిత డెవలపర్ల పట్ల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి.
This website uses cookies.