Categories: TOP STORIES

బిల్డర్లూ జర జాగ్రత్త

  • అలాంటి హామీలు ఇవ్వొద్దు

‘మా ప్రాజెక్టులో ఫ్లాట్ తీసుకోండి. త్వరలోనే దీనికి మెట్రోతో కనెక్టివిటీ రాబోతోంది. ఇంకా ప్రభుత్వ నీటి సరఫరా కూడా రానుంది’ అనే ప్రకటనలు చాలానే చూస్తుంటాం. ఇకపై ఇలాంటి ప్రకటనలు చేసే బిల్డర్లు, డెవలపర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒకవేళ ఆ ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి ఆ రోడ్డు రాకుంటే, ఇళ్ల కొనుగోలుదారులకు వారు చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వాల్సిందే. ఈ మేరకు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ స్పష్టం చేసింది.

ఆ రోడ్లు లేదా సౌకర్యాల కల్పన ప్రభుత్వ అధికారుల వల్లే జాప్యం జరిగినప్పటికీ, ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగే హక్కు కొనుగోలుదారులకు ఉంటుందని, అలాంటి సందర్భంలో వారు చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వాల్సిందేనని పేర్కొంది. ప్రాజెక్టు బయట నిర్మాణాలు, అభివృద్ధి పనులకు బిల్డర్లకు సంబంధించింది కానప్పటికీ, వాటికి సంబంధించి ఇచ్చిన ప్రకటనలతో కొనుగోలుదారుల ఆకర్షితులవుతున్నందున, ఆ సౌకర్యాలు లేనప్పుడు అక్కడ నుంచి వైదొలిగే హక్కు ఉందని వ్యాఖ్యానించింది.

గుర్గావ్ లోని గోద్రేజ్ సమ్మిట్ హౌసింగ్ ప్రాజెక్టులో 2015లో ఓ వ్యక్తి ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఇందుకోసం తొలుత రూ.51.36 లక్షలు చెల్లించారు. 2017లో బిల్డర్ ఆక్యుపేషన్ సర్టిఫికెట్ పొంది, కొనుగోలుదారుకు ఫ్లాట్ అప్పగించడానికి ప్రయత్నించారు. అయితే, చెప్పిన సౌకర్యాలు కల్పించనందున దానిని తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. దీంతో కంపెనీ ఆయన అలాట్ మెంట్ లెటర్ రద్దు చేసి, ఆయన చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వలేదు.

దీంతో ఆయన వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. ద్వారక ఎక్స్ ప్రెస్ హైవేకి కనెక్ట్ అయ్యేలా 24 మీటర్ల రోడ్డు రానుందని బిల్డర్ చెప్పారని, కానీ అది జరగలేదని, అలాగే నీటి సరఫరా, జనరేటర్ ద్వారా కరెంటు వంటి హామీలు కూడా నెరవేర్చలేని పేర్కొన్నారు. అయితే, ప్రాజెక్టు బయట నిర్మాణాలు తమ పని కాదని, అది ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పని అని.. అందులో జాప్యం జరిగితే తమకు సంబంధం లేదని బిల్డర్ తరపు న్యాయవాది వాదించారు. అయితే, దీంతో కమిషన్ విభేదించింది. ఆ ప్రకటనలు చూసి కొనుగోలుదారులు ఆకర్షితులైనందున, వారికి డబ్బు తిరిగి చెల్లించాల్సిందేనని పేర్కొంది.

This website uses cookies.