- హఫీజ్‌పేట్ సర్వే నెంబర్ 80లో
- చేసేదేమో బిల్డాక్స్ సంస్థ
- వాసవి గ్రూప్ పేరు బద్నాం
- తమకు సంబంధం లేదన్న వాసవి గ్రూప్
- టీఎస్ రెరా కఠిన చర్యలు తీసుకోవాలి
ఎన్నికల వేళ కొందరు ప్రీలాంచ్ అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఇష్టం వచ్చిన రేటుకు ప్రీలాంచ్లో ఫ్లాట్లను విక్రయించడం మొదలెట్టారు. రెండు నెలల పాటు ఎన్నికల బిజీగా ఉంటుందనే అంశాన్ని ఆసరాగా చేసుకుని.. పాత దందాను ఉదృత్తం చేస్తున్నారు. విస్తుగొలిపే విషయం ఏమిటంటే.. సుప్రీం కోర్టు కేసుల్లో ఉన్న భూముల్సి సైతం యధేచ్చగా విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు రూ.400 నుంచి రూ.500 కోట్ల దాకా ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసినట్లు సమాచారం. మరి, సుప్రీం కోర్టు కేసుల్లో ఉన్న భూమిలో అపార్టుమెంట్లను ఎలా నిర్మిస్తారు? అనుమతిని ఎవరిస్తారనేది మిలియన్ డాలర్ ప్రశ్న. మొత్తానికి, ఈ తాజా ఉదంతం మరో సాహితీ స్కామ్ మాదిరిగా తయారయ్యే ప్రమాదముంది. ఈ ప్రీలాంచ్ తతంగాన్ని బిల్డాక్స్ అనే సంస్థ నడిపిస్తూ.. వాసవి గ్రూప్ పేరును మార్కెట్లో వాడుకుంటోంది. ఇదే అంశంపై రియల్ ఎస్టేట్ గురు వాసవి గ్రూప్ సీఎండీ ఎర్రం విజయ్‌కుమార్‌ని సంప్రదించగా.. ఈ ప్రీలాంచ్ అమ్మకంతో తమకేం సంబంధం లేదంటూ కొట్టిపారేశారు. ఈ ప్రీలాంచ్‌కు సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి..
హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో మై హోమ్ మంగళ ప్రాజెక్టుకు ఎదురుగా ఉన్న భూములు హఫీజ్‌పేట్ సర్వే నెంబర్ 80 పరిధిలోకి వస్తాయి. వీటిపై ప్రభుత్వానికి, కొందరు ప్రైవేటు వ్యక్తుల మధ్య సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. ఆ విషయాన్ని దాచిపెట్టేసి.. కొనుగోలుదారులకు చెప్పకుండా.. బిల్డాక్స్ అనే సంస్థ ప్రీలాంచ్ దందాకు తెరలేపింది. సుమారు ముప్పయ్ ఎకరాలకు పైగా విస్తీర్ణమున్న స్థలంలో 35 అంతస్తులను నిర్మిస్తామని చెబుతూ.. ఫ్లాట్లను అంటగడుతోంది. రెండు వారాల్లో వంద శాతం సొమ్ము చెల్లించేవారికి.. చదరపు అడుక్కీ రూ.4500కే ఫ్లాట్లను అందజేస్తామని చెబుతోంది. ఈ భూమికి సంబంధించి న్యాయపరమైన చిక్కులున్నాయనే విషయం తెలియకుండా.. కొందరు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడుతున్నారని తెలిసింది. ఇలాంటి వారంతా వివాదాస్పద భూములకు దూరంగా ఉండటమే మేలని రియల్ ఎస్టేట్ గురు అప్రమత్తం చేస్తోంది.
ఎలా బయటికొచ్చింది?
కొండాపూర్‌లో చదరపు అడుక్కీ రూ.4500కే.. అనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతమైంది. దీంతో, ఈ అంశాన్ని పలువురు పాఠకులు రియల్ ఎస్టేట్ గురు దృష్టికి తీసుకురావడంతో.. ఈ వ్యవహారం గురించి కూపీ లాగింది. వాట్సప్పుల్లో చక్కర్లు కొడుతున్న పలువురు ఏజెంట్లతో మాట్లాడింది. అసలీ ప్రాజెక్టు ఎక్కడుంది? ఏయే సర్వే నెంబర్లలో ఉందనే విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేసింది. సొమ్ము ఎవరికి చెల్లించాలని ఏజెంట్లను ప్రశ్నించగా.. బిల్డాక్స్ సంస్థకు సంబంధించిన బ్యాంకు ఖతా నెంబర్లు బయటికొచ్చాయి. దీంతో, ఈ ప్రీలాంచ్ దందా మొత్తం బిల్డాక్స్ కంపెనీ చేస్తోందని అర్థమైంది. ఈ స్థలం మీద ప్రస్తుతమైతే బిల్డాక్స్ సంస్థకు కానీ ఇతరులకు కానీ న్యాయప్రకారంగా ఎలాంటి హక్కుల్లేవు. ఎందుకంటే, సర్వే నెంబర్ 80 వ్యవహారమంతా సుప్రీం కోర్టు పరిధిలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు.
వాసవి పేరు బద్నాం..
ఈ ప్రీలాంచ్ దందా బిల్డాక్స్ సంస్థ నడిపిస్తున్నప్పటికీ.. ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించే ఏజెంట్లు.. కొనుగోలుదారులకు వాసవి సంస్థ నిర్మిస్తుందని చెప్పడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్ రియల్ ఎస్టేట్ గురు వద్ద ఉంది. ఇదే విషయాన్ని వాసవి గ్రూప్ సీఎండీ ఎర్రం విజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా.. ఈ ప్రీలాంచ్ వ్యవహారంతో తమకేం సంబంధం లేదన్నారు. అక్రమ లావాదేవీలకు తమ పేరును వాడుకుంటున్న ఏజెంట్లపై టీఎస్ రెరా ఛైర్మన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కొనుగోలుదారులు కేవలం రెరా అనుమతి గల ప్రాజెక్టుల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలని సూచించారు.