poulomi avante poulomi avante

ఫ్లాటూ.. ఫ్లాటూ.. ఎందుకు భార‌మ‌య్యావ్?

government artificial hype hiked property prices in Hyderabad

  • వ‌రుసగా వేలం పాట‌ల నిర్వ‌హ‌ణ‌..
  • కొత్త కంపెనీల‌పై రెగ్యుల‌ర్ ప్ర‌క‌ట‌న‌లు
  • మౌలిక స‌దుపాయాల గురించి భారీ ప్రచారం
  • అన‌వ‌స‌ర హైప్‌.. కృత్రిమ ధ‌ర‌ల పెరుగుద‌ల‌
  • భ‌విష్య‌త్తులోనూ ఇలాగే కొన‌సాగితే ఎలా?
  • మ‌ధ్య‌త‌ర‌గ‌తికి సొంతిల్లు అంద‌ని ద్రాక్షేనా?

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌క ముందు.. అప్ప‌టి శివారు ప్రాంతాలైన మియాపూర్‌, ఎల్‌బీన‌గ‌ర్‌, కొంప‌ల్లి, అత్తాపూర్‌, తెల్లాపూర్‌, శంషాబాద్ త‌దిత‌ర ఏరియాల్లోని స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్ల‌లో చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.2000 నుంచి రూ.3,000 మ‌ధ్య‌లో ఫ్లాట్లు ల‌భించేవి. అంటే, కాస్త క‌ష్ట‌ప‌డితే మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు సొంతింటి క‌ల‌ను సులువుగా సాకారం చేసుకునేవారు. కానీ, 2023 వ‌చ్చేస‌రికి ఈ ప్రాంతాల్లో చ‌ద‌ర‌పు అడుక్కీ రూ. ఆరు వేల నుంచి తొమ్మిది వేల‌కు రేటు పెరిగింది. అదే గేటెడ్ క‌మ్యూనిటీల్లో అయితే, రేటు ఇంకా ఎక్కువే అవుతుంది. మ‌రి, గ‌త తొమ్మిదేళ్ల‌లో ఎందుకు ఫ్లాట్ల ధ‌ర‌లు రెండు నుంచి మూడు రెట్లు పెరిగింది? మ‌రి, పెరిగిన ధ‌ర ప్ర‌కారం సామాన్యులు ఫ్లాట్లు కొనుక్కునే స్థాయిలో ఉన్నారా?

హైద‌రాబాద్‌లోని ఎల్‌బీన‌గ‌ర్‌, మియాపూర్ త‌దిత‌ర ప్రాంతాల్లో స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్‌లో 1250 చ‌ద‌ర‌పు అడుగుల డ‌బుల్ బెడ్‌రూం ఫ్లాట్ కొనాలంటే సుమారు కోటి రూపాయ‌ల దాకా ఖ‌ర్చ‌వుతుంది. ఇందులో ఇర‌వై శాతం మార్జిన్ మ‌నీగా రూ.20 ల‌క్ష‌లు చేతిలో నుంచి పెట్టుకున్నా.. మిగ‌తా ఎన‌భై ల‌క్ష‌ల‌ను గృహ‌రుణం తీసుకోవాలి. దీనిపై 8.5 శాతం చొప్పున ఇర‌వై ఏళ్ల‌కు గృహ‌రుణం తీసుకుంటే.. నెల‌కు రూ.70 వేల దాకా ఈఎంఐ చెల్లించాలి.

ఇంత మొత్తం రుణం రావాలంటే.. నెల జీతం క‌నీసం ల‌క్ష‌న్న‌ర దాకా ఉంటేనే సాధ్య‌మ‌వుతుంది. మ‌రి, హైద‌రాబాద్‌లో ఎంత శాతం మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఈ స్థాయిలో నెల‌జీతం వ‌స్తుంది చెప్పండి. బాచుప‌ల్లి, ప‌టాన్‌చెరు, హ‌య‌త్‌న‌గ‌ర్‌, కొల్లూరు వంటి ప్రాంతాలకు వెళ్లినా చ‌ద‌రపు అడుక్కీ రూ.5500 చొప్పున డ‌బుల్ బెడ్‌రూం ఫ్లాట్ కోసం క‌నీసం రూ.80 ల‌క్ష‌లు అవుతుంది. ఓ ప‌ద‌హారు ల‌క్ష‌లు చేతిలో నుంచి పెట్టుకున్నా.. మిగ‌తా రూ.64 ల‌క్ష‌ల రుణంపై నెల‌కు రూ.52 వేలు దాకా ఈఎంఐ చెల్లించాల్సి వ‌స్తుంది. ఇంత మొత్తం రుణం రావాలంటే.. నెల‌కు సుమారు రూ.లక్ష జీతం వ‌స్తేనే సాధ్య‌మ‌వుతుంద‌ని గుర్తుంచుకోండి. ఈ లెక్క‌న నెల‌కు రూ.50 నుంచి 60 వేల జీతాన్ని ఆర్జించే వేత‌న‌జీవులు సైతం గృహ‌రుణంతో సొంతిల్లు కొనుక్కోలేని దుస్థితి ఏర్ప‌డింది.

అప్ప‌ట్లో ఇలా లేదే!

ఉమ్మ‌డి రాష్ట్రంలో దివంగ‌త నేత వైఎస్సార్ ముఖ్య‌మంత్రి హ‌యంలోనూ కోకాపేట్లో వేలం పాట‌ల్ని నిర్వ‌హించారు. అప్ప‌ట్లోనే ఎక‌రం ధ‌ర రూ.13 కోట్లు ప‌లికింది. రియ‌ల్ ఎస్టేట్ బూమ్ ఏర్ప‌డటంతో.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకానికి సొంతిల్లు భారం కాకూడ‌ద‌నే ఉద్దేశ్యంతో.. రాజీవ్ స్వ‌గృహ కార్పొరేష‌న్ ఆరంభించారు. సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు సొంతింటి క‌ల‌ను సాకారం చేసేందుకు అప్ప‌ట్లో ప్ర‌య‌త్నించారు. నాగోలు, బండ్ల‌గూడ, పోచారం వంటి ప్రాంతాల్లో ఆరంభ‌మైన అపార్టుమెంట్లే నిద‌ర్శ‌నం. కాక‌పోతే, గ‌త తొమ్మిదేళ్ల‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అలాంటి ప్ర‌య‌త్నమేమీ పెద్ద‌గా చేయ‌లేదు. పైగా, హెచ్ఎండీఏకు భూములున్న ప్ర‌తి ప్రాంతంలో ప్లాట్ల‌ను వేలం పాట‌ల్ని నిర్వ‌హించి.. కృత్రిమంగా ప్లాట్ల ధ‌రలు పెరిగేలా చేసింది. దీంతో, సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకం ప్లాట్లు కొనుక్కోలేని దుస్థితి ఏర్ప‌డింది.

అదిగో.. ఇదిగో..

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డినప్ప‌ట్నుంచి హైద‌రాబాద్‌లో ఏదో ఒక అద్భుతం జ‌రుగుతుంద‌నే ప్ర‌చారాన్ని నిర్వ‌హించ‌డంలో ప్ర‌భుత్వం విజ‌య‌వంత‌మైంది. దేశ‌విదేశీ ఐటీ సంస్థ‌ల్ని ఆక‌ర్షించ‌డానికి ఇలాంటి ప్ర‌య‌త్నం చేయాల్సిందే. కాక‌పోతే, అదే నిజ‌మ‌ని స్థానిక ప్ర‌జ‌ల్ని న‌మ్మించే ప్ర‌య‌త్నం జ‌రిగింది. అక్క‌డ‌క్క‌డా కొన్ని రోడ్లు, అండ‌ర్‌పాస్ బ్రిడ్జిలు, ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జిలను నిర్మించి, ప‌లు లింక్ రోడ్ల‌ను ఏర్పాటు చేసి.. ఇదే అద్భుతమ‌నే ప్ర‌చారాన్ని జాతీయ, అంత‌ర్జాతీయ వేదిక‌ల మీద నిర్వ‌హించారు. మ‌రోవైపు కోకాపేట్‌, బుద్వేల్ వంటి ప్రాంతాల్లోనూ కృత్రిమంగా ధ‌ర‌ల్ని హైప్ చేశారు. కోకాపేట్‌లో ఎక‌రాన్ని రూ.100 కోట్ల‌కు విక్ర‌యించి.. అదేదో ప్ర‌భుత్వం సాధించిన ఘ‌న‌త‌గా చెప్పుకొచ్చారు. దీని వ‌ల్ల ప‌శ్చిమ హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఆరంభ‌మ‌య్యే ఫ్లాట్ల ధ‌ర‌లు చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.12 నుంచి రూ.13 వేలకు అమ్మే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ప్రీలాంచులు అందుకే..

మ‌రి, అంతంత రేటు పెట్టి ఫ్లాట్ల‌ను కొనేవారు త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల‌.. కోకాపేట్‌లో కొన్ని సంస్థ‌లు హండ్రెడ్ ప‌ర్సంట్ పేమెంట్ స్కీమ్ కింద.. స‌గం ధ‌ర‌కే ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నాయి. అంటే, ఎక‌రానికి రూ.75 నుంచి 100 కోట్లు పెట్టి భూముల్ని సొంతం చేసుకున్న సంస్థ‌ల్లో ప‌లు కంపెనీలు చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.6 వేల‌కే ఫ్లాట్ల‌ను అమ్ముతున్నారు. అంటే, ఒక‌ర‌కంగా రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే ప్రీలాంచుల్ని ప్రోత్స‌హిస్తుంద‌ని చెప్పొచ్చు. లేక‌పోతే, అంత ధైర్యంగా ఏ సంస్థ అయినా ఎందుకు ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తాయి? ఏదీఏమైనా భ‌విష్య‌త్తులోనూ సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకానికి సొంతింటి క‌ల సాకారం అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలే ప్ర‌మాదముంద‌ని గుర్తుంచుకోండి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles