కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. ప్రీలాంచులపై తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా నజర్ పెట్టినా.. హైదరాబాద్‌లోని కొందరు అక్రమ బిల్డర్లకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ప్రీలాంచుల్లో కొని ప్రజలు మోసపోతున్నారని తెలిసినా.. గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిర్లక్ష్య ధోరణీతో వ్యవహరించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రజల జీవితాలతో ఆటాడుకుంటున్న అంశాలపై సీరియస్‌గానే దృష్టి పెట్టింది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట డ్రగ్స్ ను పట్టుకోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పొచ్చు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపినట్లే.. సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను దూరం చేస్తున్న ప్రీలాంచ్ బిల్డర్ల ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేయాలి. మార్కెట్ రేటు కంటే తక్కువ అంటూ అమాయకులకు గాలెం వేస్తూ.. వంద శాతం సొమ్ము ఇస్తేనే ఈ రేటంటూ.. మధ్యతరగతి ప్రజానీకంతో ఆటాడుకుంటున్న ప్రీలాంచ్ గజదొంగలను తెలంగాణ పోలీసులు కఠినంగా శిక్షించాలి.
అది హఫీజ్‌పేట్‌లోని సర్వే నెంబర్ 80 ఏరియా.. సుప్రీం కోర్టులో కేసున్న విషయం ప్రజాప్రతినిధులకు, పురపాలక శాఖ అధికారులకు, జీహెచ్ఎంసీ సిబ్బందికి తెలుసు. ఆ కేసు పరిష్కారమైతే తప్ప అందులో నిర్మాణ పనుల్ని చేపట్టడానికి వీలుండదు. అలాంటిది, బిల్డాక్స్ అనే సంస్థ.. జంకు బొంకు లేకుండా..
ఏకంగా అందులో అపార్టుమెంట్లను నిర్మించడానికి ప్రణాళికల్ని రచించింది. ప్రణాళికలైతే ఫర్వాలేదు కానీ.. ఈ కంపెనీ ఏకంగా ప్రీలాంచ్ ఆఫర్ ను ప్రకటించింది. ఆ రేటు చూసిన వారెవ్వరైనా మతిపోవాల్సిందే. ఎక్కడ్నుంచైనా డబ్బులు తెచ్చి.. అందులో ఫ్లాట్ కొనాలన్న ఆలోచనలు ఎవరికైనా కలుగుతాయి. కాకపోతే, అందరూ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. అసలీ నిర్మాణాన్ని కడుతున్నదెవరు? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏమిటీ? గతంలో ఎప్పుడైనా అపార్టుమెంట్లను నిర్మించిన చరిత్ర ఉందా? అతని వద్ద కొన్నవారిలో ఎంతమంది హ్యాపీ కస్టమర్లు ఉన్నారు. ప్రీలాంచ్ ఆఫర్ కింద సొమ్ము కట్టిన తర్వాత.. అందులో నిర్మాణానికి అనుమతి రాకపోతే ఎలా? ఆయా అపార్టుమెంట్‌ను జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటి? అసలీ ప్రాజెక్టుకు పర్మిషన్ వస్తుందా? రేటు తక్కువుందని వందలాది మంది ప్రజలు బిల్డాక్స్‌కు సొమ్ము కట్టిన తర్వాత.. సాహితీ సంస్థ మాదిరిగా బిచాణా ఎత్తేస్తే ఎలా?
* సాహితీ సంస్థకు జూబ్లీహిల్స్‌లో ఆఫీసు అయినా ఉంది. మరి, ఈ బిల్డాక్స్ సంస్థ ఆఫీసెక్కడో ఎవరికీ తెలియదు. ఈ కంపెనీ ఎండీ ఎవరో బయ్యర్లకు తెలియదు. కొండాపూర్‌లో ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయిస్తున్నామని కంపెనీ ఎండీ ఎప్పుడూ అధికారికంగా ప్రకటించింది లేదు. కాకపోతే, బిల్డాక్స్ తరఫున కొందరు ఏజెంట్లు మాత్రం ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను అమ్మేస్తున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా.. పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి.. ఈ ప్రీలాంచ్ మోసగాళ్లకు అడ్డుకట్ట వేయాలి. ఈ మోసపూరిత బిల్డాక్స్ నుంచి అమాయకులైన కొనుగోలుదారుల్ని రక్షించాలి. లేకపోతే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే.. కాంగ్రెస్ హయంలోనూ ప్రీలాంచ్ మోసాలు పెరగడానికి ఆస్కారముంది.
This website uses cookies.