Categories: TOP STORIES

మాంద్యంలో ఇల్లు కొనొచ్చా.. లేదా?

ప్రస్తుతం ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుందనే సంకేతాలున్నాయే తప్ప.. అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు. అయితే, ద్రవ్యోల్బణం, భౌగోళిక అస్థిర పరిస్థితుల కారణంగా ఇంచుమించు అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు కొనడం కరెక్టేనా? ఒకవేళ ఇల్లు కొనాలని భావిస్తే ఇందులో ఉండే లాభనష్టాలేమిటో చూద్దామా? అంతకంటే ముందు.. నిజంగా మాంద్యం వచ్చే పరిస్థితులున్నాయా అనేది తెలుసుకోవాలి.

నిరుద్యోగం, ఇండస్ట్రియల్ ప్రైస్ ఇండెక్స్, రిటైల్ అమ్మకాలు, వ్యవసాయేతర ఉద్యోగాల వివరాలు, జీడీపీ వంటి అంశాల ఆధారంగా మాంద్యం ఉందో లేదో తెలుస్తుంది. 2022 తొలి రెండు త్రైమాసికాల్లో జీడీపీ తగ్గింది. అయితే మూడో త్రైమాసికానికి వచ్చేసరికి పెరిగింది. అలాగే నిరుద్యోగం కూడా కోవిడ్ ముందునాటి పరిస్థితికి చేరుకుంది. 2022 నుంచి ఇండస్ట్రియల్ ప్రైస్ ఇండెక్స్ నిలిచిపోయినప్పటికీ, అది ఏమాత్రం తగ్గలేదు. అంటే.. గణాంకాలన్నీ బాగానే ఉన్నాయి. కానీ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం, భౌగోళిక రాజకీయ సంఘర్షణలు నెలకొని ఉండటం వంటి కారణాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ కారణంగా మాంద్యం ముప్పు తప్పదేమో అనే భావన చాలా మందిలో ఉంది.

మాంద్యంలో ఇల్లు కొంటే లాభాలు..

ఒకవేళ ప్రపంచంలో మాంద్యం నెలకొని ఉంటే ఆ సమయంలో ఇల్లు కొనడం వల్ల కొన్ని లాభాలుంటాయి. ముఖ్యంగా డిమాండ్ లేని కారణంగా ఇంటి ధరలు తగ్గుతాయి. దీంతో బిడ్డింగ్ యుద్ధం జరగదు. ఈ కారణంతో ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు నేలకు దిగి వస్తాయి. 2019 డిసెంబర్ నుంచి 2022 జూన్ మధ్య హౌసింగ్ ర్యాలీలో నిలకడ లేదు. ఇళ్ల ధరలు ఏకంగా 45 శాతం మేర పెరిగాయి. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత ఎక్కువ ధరలు పెరగడం అసాధారణం. మరోవైపు ప్రస్తుతం మాంద్యం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే 2022 జూలై-అక్టోబర్ మధ్యలో ఇంటి విలువలో 2.67 శాతం తగ్గుదల నమోదైంది. అలాగే భవిష్యత్తులో తక్కువ వడ్డీ రేట్లకు రీఫైనాన్స్ చేసే సామర్థ్యం వస్తుంది.

మాంద్యంలో కొంటే కలిగే నష్టాలివీ..

ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు కొంటే కొన్ని నష్టాలు కూడా సంభవించే అవకాశం ఉంది. ప్రస్తుతం మోర్టగేజ్ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో కనీస వేతనాలు తక్కువగా ఉన్నాయి. ఇన్వెంటరీ సైతం తక్కువే. పైగా మాంద్యం సమయంలో ఉద్యోగ భద్రత లేకపోవడం కూడా ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి సమయంలో ఉన్నదంతా పెట్టి ఇల్లు కొనడం అవసరమా అనే భావన కలుగుతుంది. ఒకవేళ మాంద్యం కారణంగా ఉద్యోగం కోల్పోతే ఇంటి ఈఎంఐలు కట్టడం కష్టమే కదా? మరోవైపు మాంద్యం సమయంలో మార్కెట్ లో ఇళ్ల ఇన్వెంటరీ కూడా తక్కువగా ఉంటుంది. మార్కెట్ లో అనుకూలమైన పరిస్థితులు వచ్చేవరకు వేచి చూద్దామనే భావన డెవలపర్లలోనూ ఉంటుంది. ఇవన్నీ మనకు నచ్చే ఇల్లు దొరకడంపై ప్రభావం చూపిస్తాయి. అంటే.. మాంద్యం సమయంలో ఇల్లు కొనడం లేదా కొనకపోవడం అనేది ఆయా వ్యక్తులు, చుట్టుపక్కల పరిస్థితులను బట్టి మారుతుంది.

This website uses cookies.