ఎవరైనా సరే.. కొత్త ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేసేముందు అది ఎప్పుడు పూర్తవుతుందనే విషయాన్ని తప్పకుండా చూస్తారు. రెడీ టూ మూవ్ లేదా అండర్ కన్ స్ట్రక్షన్స్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపడానికి కారణం అదే. అయితే, కొందరు బిల్డర్లు చెప్పిన సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయకుండా కొనుగోలుదారులను ఇబ్బందిపెట్టడం కూడా చూస్తుంటాం. తాజాగా ఇలాంటి బిల్డర్ పై కేసు నమోదైంది.
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు పేరుతో కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేసి, చివరకు అటు ప్రాజెక్టు పూర్తి చేయకుండా.. ఇటు డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్న ఓ కంపెనీ డైరెక్టర్ పై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదైంది. కొనుగోలుదారుల నుంచి భారీమొత్తంలో డబ్బులు తీసుకున్న తర్వాత ఏళ్లు గడుస్తున్నప్పటికీ ప్రాజెక్టు ప్రారంభించలేదని అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో సదరు కంపెనీ డైరెక్టర్ పై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని.. చివరకు కోర్టు జోక్యం చేసుకోవడంతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని బాధితులు తెలిపారు. అయితే, కోవిడ్ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టు ఆలస్యమైందని.. ప్రస్తుతం దానిని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.
‘2014లో 1941 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు బెడ్రూం ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయని ఆకర్షించారు. ఫ్లాట్ ఖరీదు రూ.5.05 లక్షలు అని.. 2018లో నిర్మాణం పూర్తి చేసి అప్పగిస్తామని చెప్పారు. అయితే, మొత్తం డబ్బంతా అప్పుడే చెల్లించాలని మాపై ఒత్తిడి చేశారు. చాలామంది అలాగే చెల్లించాం. కానీ తర్వాత బిల్డర్ అసలు ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. అక్కడ ఎలాంటి నిర్మాణపరమైన కార్యకలాపాలు జరగడం లేదు. ఇక ముందు కూడా జరుగుతాయనే ఆశ లేదు. ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడానికి కారణాలు గానీ.. మా సొమ్ము తిరిగిచ్చే విషయంపై గానీ బిల్డర్ ఏమీ చెప్పడంలేదు. 2018లో సైట్ ఆఫీసు కూడా మూసేశారు. అక్కడ నుంచి కంపెనీకి చెందిన బ్యానర్లు, పోస్టర్లు కూడా తొలగించారు. దీనిపై కంపెనీ ఆఫీసుకు వెళితే డైరెక్టర్లను కలవడానికి అనుమతించలేదు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించాం’ అని గుర్గావ్ లోని సెక్టార్ 54కి చెందిన అజయ్ జైన్ వివరించారు.
* అటు అద్దె కట్టుకోవడంతో పాటు ఇటు కంపెనీకి చెల్లించిన మొత్తంపై వడ్డీలు కూడా కట్టుకుంటూ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని జైన్ ఆవేదన వ్యక్తంచేశారు. సీహెచ్ డీ డెవలపర్స్ కంపెనీ తమను ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో కంపెనీ డైరెక్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదైందని వివరించారు.