ఓ టౌన్ షిప్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టిన ప్రవాస భారతీయుడిని (ఎన్ఆర్ఐ) మోసం చేసిన డెవలపర్, అతడి భాగస్వామిపై కేసు నమోదైంది. పుణె కళ్యాణి నగర్ లో గత 15 ఏళ్లుగా ఉంటున్న భారత సంతతికి చెందిన నైజీరియా వ్యక్తి బోట్ క్లబ్ రోడ్డులోని ఓ ప్రాజెక్టులో రూ.9.9 కోట్లు పెట్టుబడి పెట్టారు. 2015లో ఈ ప్రాజెక్టు ప్రారంభం కాగా, అందులో పెట్టుబడి పెడితే ఫ్లాట్లు ఇస్తామని చెప్పడంతో ఆయన ఆ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, రెండేళ్ల క్రితం ఆ డెవలపర్, అతడి భాగస్వామి కలిసి ఆ ప్రాజెక్టును మరో బిల్డర్ కు విక్రయించారు.
నైజీరియా వ్యక్తి షేర్ సైతం సదరు బిల్డర్ కు బదిలీ చేశారు. ఈ విషయాలేవీ తమకు తెలియనివ్వలేదని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, అవన్నీ అసత్య ఆరోపణలని డెవలపర్ తరఫు న్యాయవాది జావేద్ షేక్ పేర్కొన్నారు. ‘మా క్లైంట్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆ ప్రాజెక్టును మరో డెవలపర్ కి విక్రయించినప్పుడు ఇన్వెస్టర్ అక్కడే ఉన్నారు. ఎంవోయూపై సంతకం కూడా చేశారు. ఆ ప్రాజెక్టును అమ్మినప్పుడు ఆయన షేర్ అలాగే ఉంది. అంటే ఇప్పటికీ ఆ ప్రాజెక్టులో ఆయన షేర్ ఉన్నట్టే’ అని వివరించారు. కాగా, బాధితుడు అందజేసిన పత్రాలు పరిశీలించిన తర్వాత డెవలపర్, అతడి భాగస్వామిపై కేసు నమోదు చేసినట్టు కోరెగావ్ పార్క్ పోలీసులు తెలిపారు.